ఇలా అయితే టీ20 వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టం…

not-easy-for-india-to-win-t20-world-cup-if-they-don-t-improve-ranking
Share Icons:

ఢిల్లీ: టెస్ట్, వన్డేల్లో మంచిగా రాణిస్తున్న టీమిండియా పొట్టి ఫార్మాట్ టీ20ల్లో మాత్రం అంత దూకుడుగా ఆడటం లేదనిపిస్తుంది. అందుకు ఉదాహరణే మన జట్టు టీ20 ర్యాంకింగ్స్ లో ఐదో స్థానం లో ఉండటం. పైగా తాజాగా బంగ్లాదేశ్ తో ఆడిన తొలి టీ20లో ఓటమి పాలయ్యారు. సొంతగడ్డపైనే ఆడుతూ మనోళ్ళు ఏడు వికెట్ల తేడాతో బంగ్లా చేతిలో ఓడిపోయారు. ఇదే ప్రదర్శన కొనసాగితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇండియాకు చాలా కష్టమైపోతుందని భారత్ మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా 5వ స్థానంలో ఉందని, రెండు లేదా మూడు ర్యాంకులకు ఎగబాకాలంటే టీమిండియా కొన్ని పెద్ద మ్యాచ్‌లను గెలవాలని, టీమిండియా దీనిని చేయలేకపోతే, టీ20 వరల్డ్‌కప్ నెగ్గడం వారికి అంత సులభం కాదని అన్నాడు. ఢిల్లీ ఓటమి నుంచి మనం నేర్చుకోవాలన, దీనిని మరిచిపోకూడదని, జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన దానితో పోలిస్తే చేధనలో చాలా ఎక్కువ డాట్ బంతులను ఆడటం మనం చూశామని, ఢిల్లీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 55 డాట్ బాల్స్ ఆడారని, టీ20ల్లో ఇది చాలా ఎక్కువని అన్నారు.

ఇక రాబోయే రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సరిగ్గా ఆడకపోతే అతడి ఫామ్‌పై సందేహాలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఎన్ని బంతులైతే ఎదుర్కొన్నాడో అన్ని పరుగులే చేస్తే జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, అతను దీని గురించి ఆలోచించాలని అన్నారు.  గ్యాప్ తర్వాత ఆటగాళ్లు తిరిగి వచ్చినప్పుడు తిరిగి లయను పొందడానికి చాలా సమయం పడుతుందని గవాస్కర్ తెలిపాడు.

ఇక మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియాతో ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ విజయంతో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

Leave a Reply