ఉత్తర భారత్ పై కమలాస్త్రం!

Share Icons:
కొత్త ఢిల్లీ, జనవరి 9, 
కూటమిని దెబ్బతీయాన్న యత్నం ఫలిస్తుందా? అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్ల అంశం మోదీకి ఓట్ల పంట పండిస్తుందా? ముఖ్యంగా ఉత్తరభారతంలో కమలం పార్టీకి ఈ ఎత్తుగడ సత్ఫలితాలనిస్తుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు. మోదీ సమయం చూసి విపక్షాలను దెబ్బకొట్టారంటున్నారు. ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంకు విపక్షాల పరమైన మెజారిటీ ఓట్లున్న అగ్రవర్ణాలను ఆకట్టుకునేందుకు ఈ రిజర్వేషన్ల బిల్లును తెచ్చి మోదీ మరోసారి అందలం ఎక్కాలన్న ఆశతో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటేనే హస్తిన పీఠం దక్కుతుంది. ఇందులో ఏమాత్రం సందేహంలేదు. కానీ యూపీలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు లేవు. మొత్తం 80 స్థానాలున్న యూపీలో మెజారిటీ స్థానాలు సాధించాల్సి ఉంటుంది.
ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఏకమయ్యాయి. మాయావతి, అఖిలేష్ లు కలసి పోటీ చేస్తే బీజేపీకి గణనీయంగా స్థానాలు తగ్గిపోయే అవకాశముంది. ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్ లో అగ్రవర్ణాలు బీజేపీకి అండగా నిలిచారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కలసి, కాంగ్రెస్ విడిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో అగ్రవర్ణాల ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఉండేదుకు ఈ రిజర్వేషన్లు బిల్లు మోదీ తెచ్చారన్నది ఒక విశ్లేషణ. దీని వల్ల ఓట్లు చీలకుండా అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశముందని కమలనాధులు అంచనా వేస్తున్నారు.
మాయావతిని కూడా ఈ రిజర్వేషన్ బిల్లుతో దెబ్బకొట్టినట్లేనని చెబుతున్నారు. గతంలో మాయావతి సయితం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చారు. ఇక మరాఠాలు, గుజ్జర్లు, పటేళ్లు జాట్లు వంటి రిజర్వేషన్ల ఆందోళన నేపథ్యంలో వారు కూడా ఈ బిల్లుతో కమలం వైపు మొగ్గుచూపుతారన్న ఆశతో కమలం పార్టీ ఉంది. దీనివల్ల గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.
మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు తెచ్చిన ఈ బిల్లు కమలనాధులకు ఓట్ల వర్షం కురిపిస్తుందా? లేక ఎన్నికల స్టంట్ గానే భావించి అగ్రవర్ణాల ప్రజలు సయితం కమలాన్ని తిరస్కరిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
మామాట: అధికారం కోసం సమాజాన్ని ఇంకా చీలుస్తారా.. కమలాలూ

Leave a Reply