రెండు సార్లు చాలు… బూస్టర్‌ డోసు అవసరం లేదు!

Share Icons:

కోవిడ్‌–19 టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్‌ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి నియంత్రణకు బూస్టర్‌ డోసు అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డాక్టర్‌ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం  అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా అర్హులకు కరోనా వ్యాక్సిన్‌ అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.

ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం(ఎన్‌టీఏజీఐ) త్వరలో భేటీ కానుంది. బూస్టర్‌ డోసుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బూస్టర్‌ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్‌ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బూస్టర్‌ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు.

బూస్టర్‌ డోసులు అవసరమనడానికి ఆధారాలు పరిమితంగా, అసంపూర్తిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. ఆధునిక దేశాలు అప్పుడే మూడో డోసులు ఇవ్వడం మొదలపెడితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద ఆఫ్రికా దేశాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని డబ్ల్యూహెచ్‌వో డెరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అథనోమ్‌ ఘెబ్రెయాసస్‌ ఈనెల 13న హెచ్చరించారు. కొన్ని దేశాల్లో ప్రతి 100 మందిలో 20లోపు మందికే తొలి డోసు అందిందని, ఆఫ్రికా దేశాల్లోనయితే కేవలం 5 శాతం మందే తొలిడోసును పొందగలిగారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో 52.6 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ అందింది.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply