అమావాస్య తర్వాతే ప్రజా కూటమి లిస్ట్

Share Icons:
హైదరాబాద్, నవంబర్ 3,
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. దీనితో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది. సెప్టెంబర్ 6న శాసనసభ రద్దు తర్వాత టీఆర్‌ఎస్ 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మహాకూటమిగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి.అయితే మొదట్నుంచి మిత్రపక్షాలు, కాంగ్రెస్ మధ్య దాదాపు నెలన్నరకు పైగా పలు దఫాలుగా చర్చలు జరిగాయి. మిత్రపక్షాలు అధిక సీట్లలో ఆసక్తిని కనబరిచినప్పటికీ, కాంగ్రెస్ వారిని పరిమిత సంఖ్యలో పోటీ చేయడం ద్వారానే అందరి లక్ష్యం కేసీఆర్‌ను గద్దెదించడం సాధ్యమౌతుందని చెబుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పలుసార్లు తాము 95 సీట్లకు తగ్గేది లేదని చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అనుకుంటున్నగానే 95 సీట్లలో పోటీ చేసేలా మిత్రపక్షాలను ఒప్పించింది. టీడీపీ 14 సీట్లలో పోటీ చేయనుంది. అయితే మిగిలిన 10 సీట్లలో టీజేఎస్, సీపీఐ పార్టీలు పోటీ చేయాల్సి ఉంది.
టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వయంగా 95 సీట్లకు కాంగ్రెస్, 14 సీట్లకు టీడీపీ పోటీ చేస్తుందని చెప్పడంతో సర్దుబాట్ల కసరత్తు ముగిసినట్టే తెలుస్తోంది. అయితే  సీపీఐ, టీజేఎస్‌లతో కొంత చర్చించాల్సి ఉందని చెప్పినప్పటికీ కాంగ్రెస్ 95 సీట్ల నుంచి ఇక తగ్గబోదని అర్థమౌతోంది. మరో వైపు ఇప్పటికే ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాతో ఉత్తమ్‌తో పాటు పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లడం, మరో వైపు చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీలో రాహుల్‌ను కలుసుకోవడం, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఢిల్లీలోనే ఉండడం గమనార్హం.  వివిధ సామాజిక వర్గాల నుంచి సీట్ల కోసం వచ్చిన ప్రతిపాదనలను పార్టీ నాయకత్వం నిశితంగా పరిశీలించింది. పలు వర్గాలకు ప్రభుత్వం తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారీ కసరత్తు చేసి సిద్ధం చేసిన జాబితాపై ఢిల్లీలోనూ జాతీయ నేతలతో మరోసారి చర్చిస్తున్నారు.పెద్దగా ఆశావహుల పోటీ లేని నియోజకవర్గాలు 30 నుంచి 40 వరకు ఉండగా, మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ఆశావహుల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వారు జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
అయితే నవంబర్ 1న అష్టమి కావడంతో పాటు రాజకీయంగా కూడా జాబితాలో మరో వారం రోజుల్లో ప్రకటిస్తేనే పార్టీకి ప్రయోజనం ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ ప్రకటించే తొలి జాబితాలో మిత్రపక్షాల అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు కూడా ఉంటాయని, మొత్తంగా మహాకూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదల  అవుతుందంటున్నారు. టీడీపీకి ఈ స్థానాలను కేటాయించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, సత్తుపల్లి, దేవరకద్ర, మక్తల్, అశ్వారావు పేట. మలక్‌పేట, సికింద్రాబాద్, పటాన్ చెరువు, ఖమ్మం, నిజమాబాద్ రూరల్, కోదాడ లేదా జూబ్లీహిల్స్ స్థానాలు టీడీపీకి కేటాయించినట్టు తెలుస్తోంది.  టీజేఎస్ : ఆసీఫాబాద్,  మెదక్, చెన్నూరు, రామగుండం,  మల్కాజ్‌గిరి, వరంగల్ ఈస్ట్ , సిద్ధిపేట, మిర్యాలగూడ   సీపీఐ : కొత్త గూడం, వైరా, బెల్లంపల్లి.  ఇదిలా ఉండగా పొత్తులో కాంగ్రెస్, టీడీపీలు 109 సీట్లలో పోటీ చేయనుండగా సీపీఐ, టీజేఎస్‌లకు 10 సీట్లను మాత్రమే కేటాయించాలని నిర్ణయించారు.
మామాట: జనవిజ్ఞాన వేదిక వారిని కూడా ఓ మారు కనుక్కోలేక పోయారా… 

Leave a Reply