నిర్భయ నిందితుల ఉరి: ఉరితీతపై ట్రయల్ రన్

Nirbhaya's rapist-killers to hang at 7am on January 22
Share Icons:

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార విషయంలో న్యాయం జరగనుంది. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకులైన నలుగురు దుర్మార్గులకు ఉరిపడనున్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలోని పటియాలా హౌస్ న్యాయస్థానంలో మంగళవారం డెత్ వారెంట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంటుందని ఈ డెత్ వారెంట్‌లో స్పష్టం చేశారు. డెత్ వారెంట్ జారీ చేసిన వెంటనే దీనికి సంబంధించిన అసలు ప్రతులను న్యాయస్థానం సిబ్బంది.. తీహార్ జైలు అధికారులకు అందజేశారు.

దేశంలోనే అతిపెద్ద కేంద్ర కారాగారం తీహార్. ఇందులోని మూడో నంబర్ జైలులో నిర్భయ దోషులను ఉరి తీయబోతున్నారు. దీనికోసం బుధవారం జైలు అధికారులు ట్రయల్ రన్‌ను నిర్వహించబోతున్నారు. ఒకేసారి వేర్వేరు ఉరికంబాలను ఆ నలుగురినీ ఎక్కించబోతుండటంతో.. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. వేర్వేరు ఉరికంబాలకు ఒకేసారి డమ్మీ ఉరితీత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

డమ్మీ ఉరితీతలో భాగంగా దోషుల శరీర బరువుతో కూడిన ఇసుక సంచులను ఉరికంబానికి తగిలిస్తారు. సుమారు 30 నిమిషాల పాటు వాటిని అలాగే ఉంచుతారు. ఇదే తరహా ట్రయల్ రన్ కనీసం నాలుగు సార్లు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉరితాడు, ఉరికొయ్యల పటిష్టత, వాటికి అమర్చిన లివర్‌ల పనితీరును పరీక్షించడానికే ఈ ఏర్పాటు చేసినట్లు తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. ఉరితీయడానికి రెండు రోజుల ముందు కూడా డమ్మీ ఉరితీతను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఆరుమందిలో నలుగురు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆరుమందిలో రామ్ సింగ్ అనే దోషి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ గా తేలడంతో మూడేళ్ల జువైనల్ శిక్షను అనుభవించి, విడుదలయ్యాడు. ఇక మిగిలిన నలుగురిలో అక్షయ్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ కుమార్, వినయ్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది.

కాగా, 2012 డిసెంబర్‌ 16వ తేదీన వైద్య విద్యార్థిని అయిన నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తుండగా.. కదులుతున్న బస్సులో అమానుష కాండ సాగించారు ఆ దుర్మార్గులు. తర్వాత రన్నింగ్‌లో ఉన్న బస్సులోంచే కిందకు విసిరేశారు. తీవ్ర గాయాలపాలై మాంసపు ముద్దలా మారిన నిర్భయను మొదట ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు శరీరం సహకరించిన తీవ్ర విషమ స్థితిలో ఉండటంతో.. డిసెంబర్‌ 26 వ తేదీన మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి నిర్భయను తరలించారు. 13 రోజుల పాటు.. మృత్యువుతో పోరాడిన నిర్భయ.. డిసెంబర్‌ 29 వ తేదీన మృతిచెందింది.

 

Leave a Reply