వరల్డ్ కప్: ఉత్కంఠ పోరులో సఫారీలని చిత్తు చేసిన కివీస్…

Share Icons:

లండన్, 20 జూన్:

ఎన్నో ఆశలతో వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టుకు ఊహించని ఓటములు ఎదురవుతున్నాయి. మెగాటోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సఫారీలు గెలుపు వాకిట బొక్కాబోర్లా పడ్డారు. సఫారీల ప్రపంచకప్ కలను న్యూజిలాండ్ మరోమారు చెరిపేసింది.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యఛేదనలో 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలిచింది. కేన్ విలియమ్సన్(138 బంతుల్లో 103 నాటౌట్, 8 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీకి తోడు గ్రాండ్‌హోమ్(47 బంతుల్లో 60, 5 ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. మోరిస్(3/49) మూడు వికెట్లు తీశాడు.

తొలుత ఫెర్గుసన్(3/59) విజృంభణతో సఫారీలు 49 ఓవర్లలో 241/6 స్కోరు చేసింది. డస్సెన్(64 బంతుల్లో 67 నాటౌట్, 2 ఫోర్లు, 3సిక్స్‌లు), ఆమ్లా(83 బంతుల్లో 55, 4ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన కివీస్ ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోంది. 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇక ఆరు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా నాలుగింటిలో ఓడి మూడు పాయింట్లతో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. కాగా, ఈ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే.

 

Leave a Reply