ప్రమాద బీమా పాలసీకి సవరణలు

Share Icons:

కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 22,

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలో బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) సమూల మార్పులు చేసింది. సొంతంగా వాహనాన్ని నడిపే యజమానికి తప్పనిసరిగా వర్తించే వ్యక్తిగత బీమా మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలకు రూ.లక్ష, వ్యక్తిగత కార్లు, వాణిజ్య వాహనాలకు రూ.2 లక్షల బీమా సదుపాయం ఉండేది. ఈ బీమా మొత్తాన్ని ఈ రెండు విభాగాలకూ ఏకమొత్తంగా రూ.15 లక్షలకు పెంపు చేసింది.

ఇందుకోసం వాహన యజమాని చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రూ.750లుగా నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడడం, మరణించడం సంభవించినప్పుడు పాలసీదారు నామినీలకు ఈ పరిహారం అందనుంది. ఇప్పటి వరకు ఈ వ్యక్తిగత ప్రమాద బీమా తక్కువ మొత్తం ఉండడంతో ప్రైవేటు కంపెనీలు అదనపు ప్రీమియం వసూలు చేసి మరికొంత మొత్తానికి బీమా సదుపాయం కల్పిస్తూ వస్తున్నాయి. అదే సమయంలో బీమా మొత్తాన్ని పెంచాలంటూ ఐఆర్‌డీఏఐని కొన్నేళ్లుగా ఈ సంస్థలు కోరుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల మద్రాస్‌ హైకోర్టు ఒక కేసు విషయంలో ఐఆర్‌డీఏఐకి కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఐఆర్‌డీఏఐ ఈ మార్పులు చేస్తూ తక్షణం అమలును ప్రకటించింది. తాజా నిర్ణయంపై బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ తపన్‌ సింఘల్‌ స్పందిస్తూ ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ‘అనూహ్య ఘటనలు జరిగి వాహన యజమానికి ఏదైనా అయితే కుటుంబం ఒడిదుడుకులు ఎదుర్కోకుండా బీమా మొత్తం ఆసరాగా నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

మామాట: రోడ్డు భద్రత – జీవితభద్రత అని గుర్తించాలి

Leave a Reply