అభ్యర్థుల్లో కొత్త టెన్షన్….ముందస్తు జాబితాలు ప్రకటిస్తామన్న పార్టీలు

Share Icons:

తిరుపతి, జనవరి 11,

వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు ముందుగానే ప్రకటిస్తామని ప్రధాన రాజకీయపార్టీలు ప్రకటించడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఓ పక్క సన్నద్ధమవుతుండగా మరోపక్క ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కొత్తగా ఎన్నికల గోదాలోకి దిగుతున్న జనసేన పార్టీ ముందుగానే అభ్యర్థుల జాబితాల విడుదలపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల హడావుడి ఈసారి కాస్త ముందుగానే మొదలతుందని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. ఆయా పార్టీలు ప్రకటించే ముందస్తు జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

పార్టీ టికెట్ కోసం పాతకాపులు ఓ పక్క అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉండగా కొత్తవారు తమకు ఓ అవకాశం ఇవ్వండంటూ అభ్యర్థనలు పంపుతున్నారు. దీంతో ఈసారి జిల్లాలోని దాదాపు అన్ని నియోజవర్గాల్లో అన్ని పార్టీల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. అసెంబ్లీకి పోటీచేసేందుకు టికెట్ తమకు దక్కతుందా లేదా అన్న ఉత్కంఠ అటు సిట్టింగ్‌లు, ఇటు కొత్తవారిలో నెలకొంది. ముఖ్యంగా టీడీపీలో అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటికే అధినేత కసరత్తు చేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి వారుసుల పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

హిందూపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకే మళ్లీ సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ బాలయ్య కోస్తాలో పోటీకి సిద్దపడితే సీఎం కుమారుడు లోకేష్‌ను ఇక్కడ బరిలో దింపుతారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మిగిలిన అనంతపురం, కదిరి, శింగనమల, మడకశిర, గుంతకల్లు, పుట్టపర్తి అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలను బేరీజువేసుకుని ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ విషయానికి వస్తే టికెట్ ఆశిస్తున్న వారు జిల్లాలో అధికంగా ఉండటంతో తొలి జాబితాపై వారిలోనూ అయోమయం నెలకొంది. ప్రస్తుత సమన్వయకర్తలకే టికెట్ దక్కుతుందన్న నమ్మకం లేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో నేతలు ఉన్నారు.

మరోవైపు జనసేన పార్టీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కమ్యూనిస్టులతో పొత్తు నేపధ్యంలో జిల్లాలో సీట్ల పంపిణీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టులు కోరుకునే అసెంబ్లీ సెగ్మెంట్‌ను మినహాయించి మిగతా చోట్ల బలమైన నాయకులను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. పార్టీ టికెట్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయితే పార్టీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకపోవడంతో అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థులు, మేధావి వర్గానికి చెందిన వారిని పోటీకి నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాంటివారి పేర్లను కొంత ఆలస్యంగా జనసేన చీఫ్ ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తు టికెట్ల లొల్లి ఇలా ఉండగా, పార్టీ ఫిరాయింపులు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పార్టీలో టికెట్ రాకుంటే మరో పార్టీలోకి జంప్ చేసి టికెట్ కైవసం చేసుకునేందుకు కొంతమంది ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయించే వారి సంఖ్య ఫిబ్రవరి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మామాట: ముందుగా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం మంచిదేగా… 

Leave a Reply