నిరుద్యోగ యువతకి మద్యం షాపుల్లో ఉద్యోగాలు కల్పించనున్న ఏపీ ప్రభుత్వం

new jobs in ap wine shops
Share Icons:

అమరావతి:

 

ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం…నిరుద్యోగ యువత కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ వైన్ షాపులుగా మార్చాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం వాటిలో యువతకు ఉపాధి కల్పించాలని యోచిస్తోంది.

 

ఇక ఇందులో భాగంగా రాష్ట్రంలో 3500 దుకాణాల్లో 12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో ఉండే ఒక్కో దుకాణంలో నలుగురు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో ముగ్గురు చొప్పున నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు-ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. సూపర్ వైజర్‌కు రూ.17,500, సేల్స్‌మెన్‌కు రూ.15 వేల చొప్పున వేతనాన్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సూపర్‌వైజర్‌కు డిగ్రీ, సేల్స్‌మెన్‌కు ఇంటర్‌ విద్యార్హతగా నిర్ణయించారు. అయితే, ఏడాది ప్రాతిపదికన మాత్రమే సిబ్బందిని నియమించుకోనున్నారు. అలాగే నగదు నిల్వలు సిబ్బంది వద్దే ఉంటాయి కాబట్టి గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపుల్లో నియమించిన సిబ్బంది నుంచి  సెక్యూరిటీ డిపాజిట్లు స్వీకరించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో బాండ్లను స్వీకరించనున్నారు. దీనివల్ల ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాటి ద్వారా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది.

 

కాగా, మద్యపాన నిషేధం దిశగా అడుగులేస్తున్న ఏపీ ప్రభుత్వం…త్వరలో మద్యంలోకొత్త పాలసీ తీసుకురానుంది. అన్నీ షాపులని ప్రభుత్వమే నడపనుంది. అలాగే  రాష్ట్రంలో ప్రస్తుతం  4380 షాపులు ఉన్నాయి. వీటిలో ఏటా 20 శాతం దుకాణాలను తగ్గించుకుంటూ పోతామని ప్రభుత్వం చెబుతోంది. అటు మద్యంలో బ్రాండ్లని కూడా తగ్గించనుంది.

 

Leave a Reply