బంద్… బలవంతంగా కాదు

Share Icons:

 

 తిరుపతి, జాలై 24,

రాష్ట్రానికి హోదా పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మంగళవారం  వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జరుగుతోంది. అయితే ఆ విషయాన్ని మన ప్రముఖ తెలుగు దినపత్రికలు పెద్దగా పట్టిచుకోలేదు. ఒక్క సాక్షి పత్రిక మాత్రమే నేడు రాష్ట్ర బంద్  అంటూ బ్యానర్ వార్త ఇచ్చింది. ఈనాడులో  వైకాపా బంద్ నేడు అనీ, ఆంధ్రజ్యోతిలో  నేడు వైసీపీ రాష్ట్రబంద్  అంటూ చిన్న వార్తలిచ్చారు. సాక్షి పత్రిక ప్రధాన వార్తకు దిగువన ప్రత్యేక హోదానే అజెండాగా బంద్ కు ప్రజానీకం సన్నద్ధం అనే ఉప శీర్షిక ఇవ్వగా, జ్యోతిలోని వార్తకు దిగువన.. మద్దతు ప్రకటించని విపక్షాలు, ఇందులో ప్రజాప్రయోజనాల్లేవు మోదీకి సహకరించే బంద్ లా లెప్ట్… తరచూ అంటే కష్టాలు కాంగ్రెస్, టీడీపీ మద్దతూ లేదు… పోరాడాల్సింది ఢిల్లీలోనే.. సీఎం అంటూ ట్యాగులు పెట్టారు.  ఇలా ఉంది తెలుగు పత్రికల తీరు. ఇక నమస్తే తెలంగాణలో ఏపీ బంద్ వార్తలేదు. వారు తమకు కావాల్సిన  ఆర్థిక నిర్వహణలో తెలంగాణ టాప్, జనవరికెల్లా గజ్వేలుకు రైలు, రాష్ట్రంలో క్రాప్ కాలనీలు అనే వార్తలు వేసుకున్నారు.

హోదా విషయంలో రాష్ట్రంలో ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. ఇది మొదటి నుంచీ వైకుంఠపాలీని తలపిస్తోంది. అదిగో వచ్చేసిందని ఒకరోజు, హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని ఒక రోజు, హోదా అంటే జైలుకే అని మరో రోజు.. ప్యాకేజీ కూడా ఇవ్వలేదే అని ఇంకో రోజూ వస్తున్న లీకు వార్తలతో ప్రజల్లో అయోమయం  ఉంది. దానిని తొలగించాల్సిన బాధ్యత పత్రికలపైన ఉంది. ఎందుకు హోదా ఇస్తామన్నారు.. ఎందుకు ఇవ్వడం లేదు. ప్యాకేజీ ఎందుకు అవసరం. అందులో ఉన్నవేమి, లేనిదేమి… ఏది రాష్ట్రానికి మేలు చేస్తుంది అన్న విషయాన్ని పత్రికలు ప్రజలకు తెలియ చెప్పాలి కదా.. ఇలా ఎందుకు జరగడం లేదంటే… రాష్ట్రంలో నూట్రల్ గా (మొగ్గు లేకుండా) ఉన్న పత్రికలు లేవు కనుక. వాస్తవాలు ప్రజలకు తెలియడం లేదు. దీనికి తోడుగా సామాజిక మాధ్యమాలు చిమ్ముతున్న విషయం ( అదో పెద్ద వ్యవహారం వివరంగా చర్చించడానికి స్థలం చాలదు) అంతా ఇంతా కాదు. తమ ప్రత్యర్థి వర్గాలపై దుమ్మెత్తిపోయడానికి గాను నిరుద్యోగులకు సోషల్ మీడియాలో ప్రచారకర్తలుగా ఉద్యోగాలు ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

ఈనాడులో ఈ రోజు బ్యానర్ వార్త రాజధానికి రైల్వే దెబ్బ… అమరావతికి ఏర్పాటు కావలసిన రైల్వేలైన్లను కేంద్రం అడ్డుకుంటుందనే విధంగా వార్త ఉంది. అంటే… రాష్ట్రంలోని తెలుగుదేశం పాలకులకు, కేంద్రంలోని బీజేపీ  పాలకులకూ చెడితే… ఏపీ ప్రజలు కూడా చెడిపోవాలా…. వారికి రావలసిన హక్కుల కోసం ఎవరు పోరాడుతారు? ఎందుకు కేంద్రం ఏపీ పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది? ఏమిటి వారి ధైర్యం? అమరావతి రైలు మార్గాలు ఆర్థికంగా వెసులుబాటు కావట, అందుకని గతంలో రూపొందించిన అంచనా వ్యయం రూ. 2,679.59 కోట్లను తాజాగా రూ. 1,732.56 కోట్లకు తగ్గించిందట. ఎంత దారుణం?

అదే సమయంలో వైసీపీ బంద్ పిలుపునకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్నట్లు, అన్నా మేము నీవెంటే ఉంటామని ప్రజలు మొత్తం బంద్ పాటించడానికి సిద్దంగా ఉన్నారని, చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు వరుసగా ఏకరువుపెడుతూ వైసీపీకి పూర్తి మద్దతు పలుకుతున్నారనీ సాక్షి కథనంలో పేర్కొన్నారు. ఇది కూడా వాపును బలుపనుకోవడమే… ఈ వార్తలు నిజమైతే.. రాష్ట్రంలో సంపూర్ణ బంద్ జరగాలి. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి రావాలి.  ఇలా ఎవరికి కావాలసిన పత్రికల్లో వారు తమకు కావలసిన విధంగా వార్తలు రాసుకోవడం కారణంగా ఫలానా పత్రిక రాసిందా… అది ఆ పార్టీకి అనుకూలంగా  రాసుంటుంది లే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడిపోతోంది. పత్రిక అందరిదీ కాదు కేవలం కొందరిదే అనే కఠనితర వాస్తవం రూఢి అవుతోంది మన దిన పత్రికల తీరుతో…

 

మామాట : ప్రజలు పత్రికలను బంద్ చేసే రోజు దగ్గరలోనే ఉందా… ఏమో…!

Leave a Reply