మామాటలో మీమాట పోల్ నెం.17 – దక్షత లేని దీక్షల వల్ల ఒరిగేదేంటి?

Share Icons:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని, దీనిని ఆదుకునే దిక్కేలేరని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా మదనపడిపోతున్నట్లున్నారు. ఆ మదనతోనే ప్రతి యేడు నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్నారు.

 

[pinpoll id=”56342″]

ఈ కార్యక్రమాలతో రాష్ట్రంలో ఓ వారం రోజులపాటు రాజకీయ విన్యాసాలు చేసేస్తున్నారు. అసలు ఈ నవ నిర్మాణ దీక్షలు ఎందుకు చేస్తున్నారు? వీటి వలన నిజంగా ఒరిగేదేమైనా ఉందా? రాష్ట్రం ఇంత వరకూ ఏమైనా సాధించిందా? ఈ నవనిర్మాణ దీక్షల్లో ఉన్న దక్షత ఎంత? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు చాలా మందిని పట్టిపీడిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఆంధ్ర ప్రజల కోసం తొలిసారిగా 1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేశారు. అప్పటికి రాజధాని లేదు. కర్నూలును రాజధానిగా చేశారు. ఇంతలో రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. ఇక అక్కడ నుంచి హైదరాబాదు రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో కలిపేశారు. దీంతో 1956, నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధాని అయ్యింది. అప్పటి నుంచి 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2న పునర్విభజింపబడింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. మరో రాజధానిని నిర్మించుకునే వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే పాలన చేయవచ్చు. రాజధాని నిర్మించే బాధ్యత కూడా కేంద్రం తీసుకుంది. ఇది నిన్నటి వరకు చరిత్ర.. తరువాత ఏం జరిగింది.

ఉన్న రాజధానిని వీడి ఎందుకు వచ్చారు? అక్కడ్నుంచి ఎవరు పొమ్మన్నారు?

‘రాష్ట్రానికి రాజధాని లేదు… నిధులు లేవు.. నిలువ నీడలేదు…. బస్సులోంచి పాలన చేస్తున్నాం. చెట్టుకింద తింటున్నాం’ అనే మాటలు చంద్రబాబు నాయుడు పదే పదే అంటున్నారు. అవే మాటలను తెలుగుదేశం నాయకులు వల్లె వేస్తున్నారు. సకల సౌకర్యాలు.. చర్చించుకోవడానికి శాసనసభ, అక్కడే గవర్నర్, పక్కనే సచివాలయం, రాష్ట్రానికి ఏమి కావాలో అన్ని ఉన్నాయి. అలాంటి రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి అమరావతికి తరలి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ నుంచి ఎవరు పొమ్మన్నారు.? ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? పార్టీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ప్రజా రాజధానిని బలి చేసింది ఎవరు? ఇక్కడకు వచ్చి ‘చెట్టు కింద ఉన్నాం. బస్సులో బస చేస్తున్నాం’ అనాల్సి అవసరం ఏమొచ్చింది.? రాజకీయ పార్టీల తగువులకు ప్రజలు బాధ్యులా? ఉన్న రాజధానిని వదిలేసి వచ్చి నవ నిర్మాణ దీక్షలు చేయాలా? అసలు నవ నిర్మాణ దీక్షలు ఎందుకు చెయ్యాలి? రాష్ట్రానికి ఏమయ్యిందని దీక్ష చేయాలి? రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా సువిశాలమైన కలెక్టరేట్లు ఉన్నాయి. రెవెన్యూ భవనాలు ఉన్నాయి. పాలనా యంత్రంగం ఉంది. మరి ఏం కొదవ ఉందని నవ నిర్మాణదీక్షలు చేయాలి? పునరంకింతం కావడానికి నవనిర్మాణ దీక్షలు చేయాలని పిలుపునిస్తున్నారు. పునరంకితం కావాల్సింది ఎవరు? హక్కుగా లభించిన హైదరాబాద్‌ను వీడి వచ్చిన పాలకులా? ప్రజలా?

అసలు దీక్షలో చిత్తశుద్ధి ఉందా?

సరే కొత్త రాజధాని నిర్మాణం చేస్తున్నారు. పరిగెత్తుకొచ్చారో…  హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారో.. వచ్చేశారు.. అనుకుందాం. పునరంకితం అవ్వాల్సింది పాలకులు. అక్కడ ఉన్న యేడాదిలోనే కోట్లు ఖర్చు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ, వచ్చిన వారు అన్నింటిని అక్కడే వదిలేసి వచ్చారు. ఏం ఈ పేద రాష్ట్రానికి అన్నీ ఎక్కువయ్యాయా? లేక ఇక్కడ ఎక్కువైపోయాయా? అధునాతన కంప్యూటర్లు, ఫర్నిచర్ అన్నింటిని గాలికి వదిలేశారు. అక్కడ అవి వినియోగించే వారు లేక తుప్పు పడుతుంటే ఇక్కడ కొత్తవి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇదేనా నవ నిర్మాణ దీక్ష? ఇదేనా పునరంకితం అవ్వడమంటే? అక్కడ నుంచి వీరు పుల్ల కూడా పోకుండా తీసుకువచ్చి ఇక్కడ పాలన సాగించి ఉంటే అప్పుడు పునరంకితం, నవనిర్మాణం అనే పదాలకు అర్థం, పరమార్థం ఉండేది. కానీ, పేరు మోసిన మన పాలకులు అలా చేయలేదు. అన్నింటిని అక్కడ పడేసి వచ్చి, ఇక్కడ జనాన్ని మాత్రం దీక్షలు చేయాలంటున్నారు. దక్షతే లేని ఈ దీక్షలు ఎవరికోసం..? పాలకుల కోసమా? ప్రజల కోసమా? రాజకీయ ప్రయోజనాల కోసమా?

జరుగుతున్నదేంటి?

సరే… అక్కడికీ సర్దుకుందాం. దీక్ష చేస్తే తప్పేంటి? పునరంకితమవుదాం అనుకుందాం. దీక్షల్లో పాలకులు చెప్పేదేంటి. దీక్ష అంటే ఇదిగో దీనిని సాధించడానికి దీక్షబూనాలి. ఇప్పటి వరకూ చేసి దీక్షల్లో ఇవి సాధించామని చెప్పారా? మన పాలకుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నదేంటి? రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని, జరిగిపోయిన నష్టాన్ని ముందరేసుకుని గత దీక్షల్లో ఆడిపోసుకున్నారు. తలుపులు మూసేసి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. రాజధానిని వదిలేసి అరణ్యవాసం చేసిన రాజుల్లా అర్థరాత్రి విజయవాడకు పరుగెట్టుకొచ్చిందెవరు? పాలకులా ? జనమా?

ఇక, ప్రస్తుత దీక్షలో బీజేపీ నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో గద్దెనెక్కిన పాలకుడికి బీజేపీ డ్రామాలు ఆడుతోందని తెలుసుకోవడానికి నాలుగేళ్ళు పట్టిందా? ప్యాకేజీలు ప్రకటించారని సన్మానం చేసినప్పుడు తెలియదా? అది తప్పో? ఒప్పోనని? ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని పవన్, జగన్‌లను చంద్రబాబు ఆడిపోసుకుంటున్నారు. అంటే జనం కూడా వారిని ఆడిపోసుకోవడానికి దీక్షలు చేయాలా? ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? నవ నిర్మాణానికి ఏం చేయాలి? తెలంగాణ కొత్త రాష్ట్రం అక్కడ రాష్ట్ర అవతరణ దీక్షలు జరిపి పండుగ చేసుకుంటారు. ఇక్కడ కూడా ఏదోకటి చేసి రాజకీయంగా జనంలో నలగడానికి, వారిని మాయలో పెట్టడానికి చేసే రాజకీయ విన్యాసాలే. నాయకులు చెబుతున్న నవనిర్మాణ దీక్షల్లో దక్షత, నేతి బీరకాయలో నెయ్యే…

మామాట : ఈ దీక్షలు ప్రతిపక్షాలను, కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే అయితే ఓ ప్రెస్‌మీట్ చాలుగా..

Leave a Reply