సహజ శిలాతోరణం

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 11,

తిరుమల శిఖరాలు వేదాలే శిలలైన కొండలు. ఈ పవిత్ర పర్వత శిఖరం మీదే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. కోనేటి రాయుడు కొలువైన ఈ కొండలలోనే మరో ప్రకృతి చిత్రం దాగి ఉంది. తిరుమల కేవలం పుణ్యక్షేత్రమే కాదు, పురాతత్వప్రాముఖ్యత కలిగిన కొండ కూడా.  ఈ సహజ శిలాతోరణం జాతీయ  వారసత్వ స్మారకంగా (National Geological Monuments of India ) గుర్తింపుపొందింది.

ఈ భౌగోళిక వైచిత్రి శ్రీవారి ఆలయానికి  ఉత్తరంగా కిలోమీటరు దూరంలో ఎత్తైన ప్రాంతంలో చక్రతీర్థం సమాపంలో ఉంటుంది. దీని పొడవు 8 మీటర్లు (26.2 అడుగులు), ఎత్తు 3 మీటర్లు ( 9.8 అడుగులు) ప్రకృతి సిద్దమైన గాలుల కోతకు గురై కడప బండలతో సహజంగా ఏర్పడినదే శిలాతోరణం.

ఐతిహ్యం

ఈ శిలాతోరణానికి సంబంధించి మూడు ప్రధానమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వానిలో మొదటిది.. శ్రీమహావిష్ణువు సేవకులైన శంఖు, చక్రం, శేషుడు శిలా రూపంలో ఉన్నారనేది. రెండవది, శిలాతోరణం ఉన్న ఎత్తులోనే కొండపై శ్రీవారు కొలువై ఉన్నారనేది. ఇక మూడవది  తిరుమల గిరులపై మొదటి అడుగు శ్రీవారి పాదాల వద్ద పెట్టిన విష్ణుమూర్తి, రెండవ అడుగు శిలాతోరణం వద్ద వేశాడని, ఇపుడు స్వామి కొలువైన ఆనంద నిలయమే మూడవ అడుగు అనీ భక్తుల నమ్మిక.

అయితే, 1980 లలో తొలి సారిగా పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి కృతిని గుర్తించారు. శాస్త్రీయంగా అంచనావేసినపుడు ఈ శిలాతోరణం వయసు  2.5 మిలియన్ సంవత్సరాలుంటుందని నిపుణులు తెలిపారు. తిరుమల గా పిలువ బడే శేషాచలం కొండలు సగటున 150 మీటర్లు (450 అడుగులు) ఎత్తున్నప్పటికీ పర్వతాలలో కొన్ని శిఖరాలు 3000 అడుగుల ఎత్తులో కూడా ఉంటాయి.  మరో మారు తిరుమల వెళ్లినపుడు  తప్పకుండా ఈ ప్రకృతి చెక్కిన అపురూప శిలాతోరణాన్ని వీక్షించించండి.. ఆనందించండి.

మామాట: తిరుమలలో చూడవలసిన విశేషాలు చాలా ఉన్నాయే..

Leave a Reply