వైసీపీపై లోకేశ్ కౌంటర్: రాజకీయ అపరిచితులు

nara lokesh fires on ysrcp government
Share Icons:

అమరావతి: వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కౌంటర్ వేశారు. రాజకీయ ‘అపరిచితులు’ వీళ్లు అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. వైసీపీ నేతలు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చేస్తోన్న వ్యాఖ్యలను అందులో వినిపించి తీవ్ర విమర్శలు చేశారు. ‘చంద్రబాబు గారి హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్యాల యాత్ర చేసిన జగన్ గారు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బాబు గారి హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

‘పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెప్పింది’ అని అన్నారు.’ఇవన్నీ వైకాపాలా కార్యకర్తలకు దొడ్డి దారిలో ఇచ్చిన ఉద్యోగాలు కావు. నిరుద్యోగ యువత కి బాబు ఇచ్చిన జాబులు’ అని అన్నారు.’ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్  ప్రమోషన్ పాలసీ పేరుతో వైకాపా ప్రభుత్వం రూపొందించిన పాలసీలో టిడిపి హయాంలో 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.51 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉత్పత్తి రంగంలోనే వచ్చినట్టు ప్రకటించారు’ అని తెలిపారు.

విజయసాయి విమర్శలు

ఇక ఏపీలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులపై జరిగిన ఐటీ దాడులపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడిందని… బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే రూ. 10 లక్షల కోట్లయినా దొరుకుతాయని అన్నారు. ‘చంద్రబాబు నెట్ వర్క్ చూసి ముంబై కార్పొరేట్ సంస్థలన్నీ బిత్తరపోయాయట’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమేనని అన్నారు.

ఇక విజయసాయికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. దో నెంబర్ దందాతో నడిచే బ్లాక్ పేపర్, బ్లాక్ ఛానల్ లో ఐటీ దాడులకు సంబంధించిన వార్తలను చూస్తుంటే నవ్వొస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా చంద్రబాబు హయాంలోనే ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టారని చెప్పారు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలు మాత్రమేననే విషయం అర్థమవుతోందని అన్నారు. 40 చోట్ల ఐటీ రెయిడ్స్ జరిగితే దొకింది కేవలం రూ. 87 లక్షలు మాత్రమేనని చెప్పారు.

‘మూడు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా దాడి చేశామని ఐటీ అధికారులు ప్రకటన ఇచ్చారు. బోడి గుండుకి, మోకాలికి ముడి పెట్టినట్టు… ఇన్ఫ్రా కంపెనీల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని ఐటీ అధికారులు అంటే… చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికేశాయని వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ ను చదవడం వచ్చిన వాళ్లతో చదివించుకోవాలని కోరుతున్నానని సూచించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

 

Leave a Reply