రథసారథికి ఇక సెలవు…

Share Icons:

హైదరాబాద్, 30 ఆగష్టు:

టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం నాడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూ గౌరవ వందనం సమర్పించగా, హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంత్యక్రియలు ముగియడంతో బాధాతప్త హృదయంతో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు అక్కడ నుంచి బయటకు వచ్చారు. ఇక సెలవు అంటూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన హరికృష్ణ శాశ్వతంగా మన నుంచి దూరమయ్యారు.

అంతకు ముందు చంద్రబాబు నాయుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయంపై తెలుగుదేశం జెండా కప్పారు. అనంతరం రథసారథి అంతిమ యాత్ర ప్రారంభమైంది. పసుపు రంగు బంతి పూలతో అలంకరించిన వాహనంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఆరంభమైన హరికృష్ణ అంతిమ యాత్రలో టీడీపీ శ్రేణులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఇక హరికృష్ణ భౌతిక కాయాన్ని ఉంచిన పాడెను మోయడం ద్వారా బావమరిదిపై ఉన్న ప్రేమను చంద్రబాబు చాటుకున్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా కొద్ది దూరం హరికృష్ణ పాడె మోశారు. అలాగే మహాప్రస్థానం వద్ద వాహనం నుండి పార్థీవ దేహన్ని దింపిన తర్వాత జాస్తి చలమేశ్వర్, చంద్రబాబునాయుడులతో పాటు, హరికృష్ణ సోదరులు బాలకృష్ణ, జయకృష్ణలు కూడ పాడె మోశారు.

మామాట: రథసారథికి అనంత అశ్రునివాళి….

Leave a Reply