అచ్చం అన్నగారి లాగే…బాలయ్య…సావిత్రిలాగే…..నిత్యా

nandamuri-balakrishna and nitya menon in ntr biopic
Share Icons:

హైదరాబాద్, నవంబర్ 6:

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. బసవతారకమ్మ పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు రానా, సుమంత్, కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికితోడు, సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని యూనిట్ వెల్లడించింది.

ఎన్టీఆర్ సినిమా జీవితానికి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. కథానాయకుడు’ అని, పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. మహానాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో నందమూరి తారక రామారావు బయోపిక్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బుధవారం జరగబోయే దీపావళి పండుగను పురస్కరించుకుని  చిత్ర బృందం సినిమాకు సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది. ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో మధురమైన సినిమాల్లో నటించారు. వాటిలో ‘గుండమ్మ కథ’ ఒకటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, మహానటి సావిత్రి, జమున, సూర్యకాంతం, ఎస్వీరంగారావు వంటి మహామహులు నటించిన ఈ సినిమాను కమలకర కామేశ్వర్రావు తెరకెక్కించారు.

అప్పట్లో ఇది సంచలన విజయం సాధించడంతో పాటు, ఇందులో నటించిన అందరకీ ప్రశంసలు దక్కాయి. అందుకే ఈ సినిమా తాలూకు సీన్లను ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపించాలని డిసైడ్ అయింది ఆ చిత్ర యూనిట్. ఆ సినిమాలో సూపర్ హిట్ అయిన ‘లేచింది మహిళా లోకం’ పాటకు సంబంధించిన స్టిల్‌నే చిత్ర బృందం విడుదల చేసింది. దీనికి ”లేచింది.. నిద్ర లేచింది మహిళాలోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం.

బుల్లోడుగా బాలయ్య…బుల్లెమ్మగా నిత్యామీనన్’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ పోస్టర్ చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించారో ఇప్పుడు బాలయ్య కూడా అచ్చు అలాగే ఉన్నాడని అనుకుంటున్నారు. అదే పోస్టర్‌లో ఉన్న నిత్యామీనన్ కూడా సావిత్రిలానే కనిపిస్తోంది.

మామాట: బుల్లోడు…బుల్లెమ్మ బాగానే ఉన్నారుగా….

Leave a Reply