నేమ్ ప్లేట్ రాజకీయాలు 

Share Icons:

అమరావతి,ఏప్రిల్ 17,

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 36 రోజుల సమయముంది.    అప్పటిదాకా ఎవరు గెలుస్తారన్న అంశంపై ఉత్కంఠ వీడదు. ఐతే… ఆ ఉత్కంఠను అలాగే కొనసాగిస్తూ… రోజూ అధికార, ప్రతిపక్ష నేతలు రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నేమ్ ప్లేట్ వివాదం రాజుకుంటోంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన కొద్దిరోజులకే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ ఓ  నామఫలకం సామాజిక మాధ్యాలలో కలకలం రేపింది.

అంతే దీనిపై తొలి స్ఫంధన టీడీపీ నుంచీ వచ్చింది. పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమల్లో ఉంచుతోందని విమర్శించిన ఏపీ మంత్రి దేవినేని ఉమ… జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారుచేయించుకోవడం పిచ్చికి పరాకాష్ట- అని సెటైర్ వేశారు. వెంటనే వైసీపీ నుంచీ కౌంటర్ వచ్చింది. టీడీపీ నేతలే అలాంటి నేమ్ ప్లేట్ సృష్టించి… దానిపై పిచ్చి కూతలు కూస్తున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఇటు టీడీపీ, అటు వైసీపీ ఇద్దర్లో ఎవరూ నేమ్ ప్లేట్ చేయించి ఉండకపోతే మరి దాన్ని తయారు చేయించిందెవరు, అంత ఆసక్తి చూపించిందెవరు. కచ్చితంగా ఆ ప్లేట్‌ని జగన్ మాత్రం చేయించి ఉండరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధాన కారణం… అది మామూలు ప్లేట్ కాదు. అధికారిక గుర్తింపును (సీఎం పదవి) సూచిస్తున్న ప్లేట్. అలాంటి ప్లేట్‌ను పదవి రాకముందే చేయించడం చట్ట ప్రకారం నేరమవుతుంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాబట్టి… జగన్ ముఖ్యమంత్రిగా నేమ్ ప్లేట్ ఉండటానికి వీల్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించిన తర్వాతే అలాంటి ప్లేట్ తయారుచెయ్యాలే తప్ప… ముందుగా చెయ్యడం నేరమే అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వైసీపీ ఆరోపిస్తున్నట్లు టీడీపీ నేతలే అలాంటి ప్లేట్ చేయించివుంటే… వారు చట్టప్రకారం శిక్షార్హులే అవుతారు. ఇలాంటి ప్లేట్ తయారుచేయించడం ద్వారా ఓ రాష్ట్ర సీఎంని అవమాన పరచడం, ప్రజలను తప్పుదోప పట్టించడమవుతుంది. జగన్ సీఎం కావడం టీడీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం ఉండని అంశం. అందువల్ల వారైతే కలలో కూడా ఇలాంటి ప్లేట్ తయారుచేయించాలనే ఆలోచనకు రారు. అందువల్ల ఈ ప్లేట్‌ని టీడీపీ నేతలు చేయించివుండరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నిబంధనల మేరకు ఇలాంటి ప్లేట్‌ని ఎవరు తయారుచేయించారో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నేరం కాబట్టి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులకు చాలా పనులు పెండింగ్ ఉంటున్నాయి. అసలే ఎన్నికల టైం. రోజంతా రకరకాల విధుల్లో తలమునకలై ఉంటున్నారు. అందువల్ల ఇలాంటి రాజకీయపరమైన వివాదాల కేసుల్ని దర్యాప్తు చేసేంత టైం లేదు వాళ్లకు. అయినప్పటికీ నేమ్ ప్లేట్ ఎవరు తయారుచేసిందీ తెలుసుకుంటామంటున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫొటో ఎవరు పోస్ట్ చేశారో గుర్తించడం ద్వారా… దాన్ని ఎవరు తయారుచేశారో తెలుసుకోవచ్చంటున్నారు. పోలీసులు గనక మిస్టరీని ఛేదిస్తే, మనకూ ఓ టెన్షన్ తీరిపోతుంది.

మామాట: పాపం పోలీసులు కదా

Leave a Reply