‘పడుపు వృత్తి’ నుండి బయటపడి సినీరంగంలో రాణిస్తున్న నళినీ జమీలా!

Share Icons:

కేరళలోనళినీ జమీలా  జీవితం ఎన్నో ఏళ్లు ‘సెక్స్‌ వర్కర్‌’గా గడిచింది. ‘ఒక సెక్స్‌ వర్కర్‌ ఆత్మకథ’గా వచ్చిన ఆమె రచన ఎన్నో భాషల్లో అనువాదం అయ్యింది. ఆ తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న నళిని తాజాగా ఒక సినిమా కోసం కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది. ఆమె ఎంత బాగా పని చేసిందంటే  2020 సంవత్సరానికి గాను  శనివారం కేరళ ప్రభుత్వం ప్రత్యేక అవార్డు ప్రకటించింది.

సెక్స్‌వర్కర్‌గా జీవించడంలో ఆత్మగౌరవాన్ని కోల్పోవడం, సమాజాన్ని ఎదుర్కొనడం కంటే పోలీసుల హింసని, విటుల దాష్టీకాన్ని భరించడం కష్టం. 2005లో కేరళలోని త్రిశూర్‌ జిల్లాలోని కల్లూర్‌ అనే చిన్న ఊరి నుంచి నళినీ జమీలా 52 ఏళ్ల వయసులో తన జీవితం ఆధారంగా ‘ఒక సెక్స్‌వర్కర్‌ ఆత్మకథ’ పేరుతో పుస్తకం రాసి దేశంలో ఒక రకమైన సంచలనం రేపింది. ఆ పుస్తకం స్త్రీలు గతిలేని స్థితుల్లో ఎలా సెక్స్‌ వర్కర్లుగా మారుతారో చెప్పడమే కాదు పోలీసులు, సంఘంలోని పెద్ద మనుషులు, కుటుంబం ఎలా సెక్స్‌వర్కర్లను కీలుబొమ్మలుగా చేస్తారో కూడా చెప్పింది. అంతే కాదు… మగవారి ప్రవర్తన మీద లోతైన పరిశీలనలు చేసింది. దేశంలోని అనేక భాషలతో పాటు తెలుగులో కూడా వెలువడ్డ ఈ పుస్తకం (హెచ్‌బిటి ముద్రణ) పెద్ద చర్చను లేవదీసింది. ఇప్పుడు ఆ నళినీ జమీలా తన 67వ ఏట ఒక సినిమా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కేరళ ప్రభుత్వ ప్రత్యేక అవార్డు పొందడం పెద్ద విశేషంగా మారింది. నళినీ జమీలాను ఒక విశేష వ్యక్తిగా మళ్లీ చర్చకు తెచ్చింది.

జీవన చిత్రం: నళినీ జమీలా బాల్యం ఏమీ సౌకర్యంగా నడవలేదు. తండ్రి పిల్లల్ని దగ్గరకు తీసేవాడు కాదు. పెళ్లయ్యాక ఇద్దరు అమ్మాయిలు పుట్టాక భర్త కేన్సర్‌తో మరణిస్తే జరుగుబాటు చాలా కష్టమైంది. కొన్నాళ్లు ఇంటి పనులు వెతుక్కున్న జమీలాకు ఒక స్నేహితురాలు వ్యభిచార వృత్తి గురించి చెప్పింది. ఆమే జమీలాను ఒక పోలీస్‌ ఆఫీసర్‌ దగ్గరకు పంపింది. ఆ గెస్ట్‌హౌస్‌ నుంచి తెల్లవారుజామున ఇంటికి వెళుతుంటే పోలీసులు ఆమెను పట్టుకుని హింసించడంతో జమీలా సెక్స్‌వర్కర్‌ జీవితం మొదలవుతుంది.

ఆ లైఫ్‌లో ఆమె ఎందరో పోలీసుల, విటుల, గూండాల టార్చర్‌ను అనుభవించింది. అయినా సరే కూతుళ్ల కోసం రాటుదేలుతూ వృత్తిలో కొనసాగింది. దాని నుంచి బయట పడ్డాక కొందరు మిత్రుల సూచన మేరకు ఆత్మకథ రాసి సంచలనం రేపింది. ఆ పుస్తకం తెచ్చిన పేరుతో మరో మూడు నాలుగు పుస్తకాలు వెలువరించింది. రచయిత్రిగా, సెక్స్‌వర్కర్ల విముక్తికి పని చేసే యాక్టివిస్ట్, రిలేషన్స్‌ కౌన్సిలర్‌గా పని చేస్తూ వస్తున్న జమీలాకు ఇంత పేరు ఉన్నా ఆమెను ఆమె గతం వెంటాడుతూనే ఉంది.

‘సెక్స్‌వర్కర్లకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. నేను ఇంటి కోసం ఎన్ని బాధలు పడుతున్నానో నాకే తెలుసు. ఒకరకంగా నేను ఇప్పటికీ నా మొఖం దాచుకుని దొంగబతుకు బతకాల్సి వస్తోంది’ అంటుంది జమీలా. ‘సెక్స్‌వర్కర్ల పట్ల కేరళలో దారుణమైన చిన్నచూపు ఉంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కొంచెమైనా వారితో మెరుగ్గా ప్రవర్తిస్తారు. సెక్స్‌వర్కర్లు పొట్టకూటి కోసం ఆ పని చేస్తారు. ఆడపిల్లలను ఆ వృత్తిలో దింపే ట్రాఫికర్స్‌ దుర్మార్గులు. ఆ తేడాను నేను సమాజానికి పదే పదే తెలియచేస్తున్నాను’ అంటుందామె.

కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా: ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ తమ్ముడు సంజీవ్‌ శివన్‌ జమీలా జీవితం మీద ‘సెక్స్, లైస్‌ అండ్‌ ఏ బుక్‌’ అనే డాక్యుమెంటరీ తీశాడు. తన జీవితం ఆధారం గా ఒక సినిమా రావాలని జమీలాకు ఉందికాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈలోపు ఇటీవల ‘భరతపుజా’ అనే సినిమాకు ఆమెకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. “ఆ సినిమా దర్శకుడు మణిలాల్‌ నాకు చాలాకాలం నుంచి తెలుసు. ఆ కథ కూడా ఒక సెక్స్‌వర్కర్‌ జీవితానికి సంబంధించిందే. అందుకని మీరు ఆమె కాస్ట్యూమ్స్‌ చూడండి అని కోరాడు. సరేనన్నాను. మధ్య వయసులో ఉన్న ఆ హీరోయిన్‌ (నటి సిజి ప్రదీప్‌) బట్టలను నేను ఆ వయసులో ఎలాంటి బట్టలు కడుతూ వచ్చానో ఎలా కనిపించానో దాని ఆధారంగా డిజైన్‌ చేశాను. 13 చీరలు మాత్రమే కొన్నాను. వాటిలో పూనమ్‌ చీరలే ఎక్కువ. మరో రెండు ఆ తర్వాత కొనాల్సి వచ్చింది. రాత్రిళ్లు గాఢమైన రంగుల చీరలను, పగలు తేలిక రంగుల చీరలను హీరోయిన్‌ కోసం ఉపయోగించాను. యూనిట్‌తో పాటు నేనూ ఉన్నాను. ఆ సినిమాకు కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా నాకు అవార్డు ఇవ్వడం ఊహించలేకపోతున్నాను. నా జీవితంలో ఇది నాకు గొప్ప ఘనత” అంది జమీలా.

వృద్ధ సెక్స్‌వర్కర్ల కోసం: “ఒకప్పుడు విమానం ఎక్కితే చాలనుకున్నాను. కాని అనేక దేశాలు తిరిగి చూడగలిగాను. ఇప్పుడు నా కోరిక ఒక్కటే. వృద్ధ సెక్స్‌వర్కర్ల కోసం ఒక హోమ్‌ కట్టాలి. వారికి జరుగుబాటు లేక భిక్షాటన చేస్తున్నారు. వారిని ఆదుకోవాలి.” అంది జమీలా. 1970–2000 సంవత్సరాల మధ్య 8 మంది విటులతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని ‘రొమాంటిక్‌ ఎన్‌కౌంటర్స్‌ ఆఫ్‌ ఎ సెక్స్‌వర్కర్‌’ పేరుతో 8 కథలుగా రాసిన జమీలా పుస్తకం ఇంకా తెలుగులో రావాల్సి ఉంది.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply