శిశువులు కళ్లు మూస్తున్నారు- పాలకులు ఎపుడు కళ్లు తెరుస్తారు?

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 12,

తెలుగు పత్రికలు వార్తలు ప్రచురించే వైనాలను చర్చించుకోవాలని ఉంది, కానీ ఈ ఉదయం సాక్షి దినపత్రిక తెరచినపుడు కనిపించిన శైశవ గీతిక  వార్త మరి ముందుకు సాగనీయలేదు. రాజకీయాలు నిత్యం ఉండేవే. అందులో ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ ఉండదని మనకు తెలుసు. అందుకే ఇవ్వాళ శిశు మరణాల వార్తను గమనిద్దాం దాని వెనుక కారణాలను అనుశీలిద్దాం.

ఆంధ్రప్రదేశ్ కూడా భారత దేశంలో భాగమే. 1947  నుంచి స్వయం పాలనలో ఉంది. దక్షిణాదిలో మంచి వనరులు ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని చాలా మంది నిపుణులైన నేతలు పరిపాలించారు. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో 9 సంవత్సరాలు, తాజా గా విభజన తరువాత నాలుగున్నరేళ్లుగా పరిపాలన సాగిస్తున్నారు. ఇంకా అటు కాంగ్రెస్లో, తరువాత టీడీపీలో చంద్రబాబు అధికార పీఠానికి చాలా చాలా దగ్గరగా ఉన్నారు. నిర్ణయాలు ప్రభావితం చేసే శక్తి కలిగి ఉండేవారు. పైగా పీజీ స్థాయిలో చదువుకున్నవారు. కీలక స్థానంలో పనిచేసిన వారిలో వయసు రీత్యా చిన్నవారు.  సహజంగా ఆధునిక పోకడలు కలుగి ఉంటాయని ఎవరైనా ఆశిస్తారు. 1978 నుంచి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా వారి నుంచి మంచి పాలన ఆశించడం ప్రజల చప్పుకాదు. కానీ జరుగుతున్నది గమనించినపుడు చంద్రబాబు పాలనా ప్రాధాన్యాలపై అనేక అనుమానాలు కలుగుతాయి. హైటెక్ సిటీ కట్టడం మాత్రమే పరిపాలన కాదు, ఐటికి ఆధ్యుడని చెప్పుకోవడమే పరిపాలన కాదు. ఐటి ఫలాలను సమర్థవంతంగా ఉపయోగించుకోలేని పాలకుడుగా చంద్రబాబు మిగిలిపోతారు. ఇటువంటి పాలనా విధానాలే కొనసాగినపుడు.

రాష్ట్రంలో ప్రజారోగ్యం , ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, గ్రామాలలో రోగాలు, జబ్బులతో చికిత్సలు అందక మరణించే వారి , వారి కుటంబాల హృదయ ఘోష ఏ పరిపాలనకు నిదర్శనం చంద్ర బాబూ అని అడిగే వారు లేరా. గత ఆగస్టు మాసంలోనే రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో మరణించిన చిన్నారుల జీవితాలు చంద్ర బాబు వైపే వేలెత్తి చూపుతున్నాయి.  పసిబిడ్డల ప్రాణాలు కాపాడలేని మీ పరిపాలనాదక్షత ఏ ఏట్లో కలపడానికని ఆ పసిపిల్లల తల్లుల క్షోభ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఇపుడు వైద్య ఆరోగ్య కు మంత్రి ఉన్నారా, ఆ శాఖను ఎవరు చూస్తున్నారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు?

ప్రభుత్వ ఆసుపత్రులను సక్రమంగా నిర్వహించలేనివారికి పాలనా పగ్గాలు ఎందుకు సన్యాసం తీసుకోక.  పురిటి బిడ్డల మరణ మృదంగ నాదంలో మనకు బుల్లెట్ రైళ్లు, ఒలంపిక్ క్రీడల నిర్వహణా అవసరమా సీఎం సర్. చెప్పండి. ఏటా ఈ సీజన్లో రోగాలు వెళ్లువెత్తుతాయని మీకు తెలియదా, ఏం జాగ్రత్తలు తీసుకున్నారు. కాస్త మీ రాజకీయం పక్కన పెట్టి, ఆరోగ్య శాఖకు ఓ మంత్రిని కేటాయించి పర్యవేక్షించి ఉంటే ఇందరు చిన్నారులు పుడుతూనే ఆసుపత్రి నుంచీ ఇంటికి కూడా రాకుండా అటే స్మశానానికి వెళ్లేవారు కాదు కాదా. ఐటి వినియోగం ద్వారా మీరు ఆసుపత్రులలో అవినీతిని అడ్డుకోలేరా?

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పత్రికలు ఆ వార్తలను ప్రముఖంగా ప్రచురించవలసిందిపోయి, అసలు అటువంటి వార్తలే ఎక్కడా లేకుండా జాగ్రత్తపడుతుండడం విడ్డూరం. ఎటువంటి రిమార్కునూ సహించలేని రాజరిక మానసిక వ్యవస్థకు ఇప్పటి పాలకులు చేరుకున్నారనడానికి ఈ పరిస్థితి చక్కని ఉదాహరణ.  పత్రికల తీరే తార్కాణం.

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న విధానాలపై హైకార్టు ఆగ్రహించినా పాలకులలో చలనం లేదు. నిజానికి ఎంతో వెనుకబడిన దేశాల్లో, అత్యంత పేద దేశాలలో ఇటువంటి దారుణ పరిస్థతిలేదు. మరి ఈ సన్ రైజ్ స్టేట్ లో ఈ పసిపిల్లల ఫేట్ ఏమిటిలా పురిట్లోనే సంధికొట్టిపోతోంది..? ఎవరు వీరి తలరాతలు మారుస్తారు…..? పాలకులు ఎప్పటికి కళ్లు తెరుస్తారు…?

 

మామాట:  శిశువుల ప్రాణాలు కాపాడలేనిది  సుపరిపాలనౌతుందా.. బాబూ?

Leave a Reply