ముందుకు- మునుముందుకు- ఎన్నికలకు

Share Icons:

తిరుపతి,  సెప్టెంబర్ 07,

మీడియా ఊదరగొట్టినట్టే ఉదయమో, సాయంత్రమో, అన్ని గంటలకో, మరి కొన్ని గంటలు ఆలస్యంగానో మంచి మనసుతో, మంచి ముహూర్తంలో, మంది కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ సీఎం.  ఇందులో ఏ మీడియా చెప్పింది నిజమయ్యిందో తెలుసుకోవడానికి మరికొద్దిరోజులు ఆగాలి. ప్రభుత్వ రద్దు సరే… తదుపరి విజయం ఎవరిది, తెలంగాణలో రాబోయే పాలకులు ఎవరన్నిది మీడియా చెప్పలేకపోతోంది.. అది విశేషం. సర్వేల అంచనాలు ఏమౌతాయో చాద్దాం. కాకపోతే, మితిమీరిన ఆత్మ విశ్వాసంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల గోదాలోకి అడుగుపెట్టేశాడు. నిన్న ప్రభుత్వం రద్దుకావడం, కోత్త ఎన్నికల అభ్యర్థులను టిఆర్ ఎస్ నేత ప్రకటించడం, ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం అన్నీ చక చకా ఒక్కరోజులోనే జరిగిపోయాయి.

సో… తెలంగాణలో 24 గంటల్లోనే వాతావరణం బాగా వేడెక్కి, ఎన్నికల జ్వరం వచ్చేసింది.  ఇదిలా ఉండగా,  వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మరో పెద్ద రాష్ట్రం ఒడిశాలో బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుగా ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన చేయడం లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాలకు గాను 20 సీట్లను , గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న ఆయన తిరుగులేని ధీమాతో ఉన్నారు. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ఆ పార్టీని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రయత్నించడం లేదు. దీంతో నవీన్ పట్నాయక్ కు ఎదురేలేని పరిస్థితి. విపక్ష కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని గద్దె దించడ కాదు కదా గట్టి పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేదు.

పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కిశోర్ దాస్, చిరంజీవ్ బిశ్వాల్, సీఎల్పీనాయకుడు నర సింగ్ మిశ్రా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్ లకు ప్రజాబాహుళ్యంలో పట్టు లేదు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జి జితేంద్ర సింగ్ ప్రభావం శూన్యం. ఒడిశాకు చెందిన రామచంద్ర కుంతియా ప్రస్తుతం తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జి.అదే సమయంలో మరో రెండు నెలల్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. వీటి ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనితోపాటు మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. పార్టీల నాయకులు, కార్యకర్తలు అంచనాలు, అవకాశాలు, విశ్లేషణల్లో మునిగి తేలుతున్నారు. లోక్ సభతో పాటు తమ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. లోక్ సభతో పాటు ఎన్నికలకు వెళ్లడం మంచిదా? లేక ముందస్తుగా వెళ్లడం ఉత్తమమా? అనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు సిద్థమైనారు,  లోక్ సభ, అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కే్ంద్ర ప్రభుత్వ ప్రచారం తమపై పడుతుందన్నది ఆయన అనుమానం. అదే సమయంలో రెండు ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించలేమన్నది కూడా కేసీఆర్ ఆలోచన. అసెంబ్లీ, లోక్ సభకు విడివిడిగా ఎన్నికలు జరిపితే పూర్తిగా దృష్టి పెట్టవచ్చన్నది కేసీఆర్ మనోగతంగా చెబుతున్నారు. ముందస్తు ద్వారా విపక్షాలను గుక్కతిప్పు కోనీయకుండా చేయాలన్నది అసలు వ్యూహం. ముందస్తు ఎన్నికల్లో గెలిస్తే దాని ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడు తోంది. ఆ ఎన్నికల్లో నల్లేరుపై నడకేనన్నది గులాబీ దళ పతి అంచనా.

తెలంగాణలో టీడీపీ తరుపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయి. వీరిలో జిల్లాల్లో గెలిచిన వారిని మినహాయిస్తే హైదరాబాద్ శివారు నియోజకవర్గాల నుంచి గెలిచిన వారు పార్టీ బలంతోనే గెలిచారు. ఇక కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ పార్టీల నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్న వారిని ఎవరినీ నొప్పించకుండా కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు. పార్టీ ఫిరాయించారనే చెడ్డపేరు వీరిలో సహజంగానే ఉంటుంది. పైగా ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇన్నేళ్లుగా టీఆర్ఎస్ జెండా మోస్తున్నవారు. నియోజకవర్గ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపించన ఉద్యమకారులు. వీరికి టిక్కెట్లు దక్కకపోవడంతో వారు అభ్యర్థులకు సహకరించే అవకాశం లేకపోగా, ఇతర పార్టీల వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజల్లో కూడా వీరి పట్ల సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉంది.వివాదాలను, ప్రజా వ్యతిరేకతను, ఆరోపణలను పట్టించుకోకుండా సిట్టింగ్ లు అందరికీ సీట్లిస్తామని చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల కంటే కూడా ఎక్కువగా కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లేశారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ పాలనను చూసి ఓట్లేసే ప్రజలు ఉన్నా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ కూడా చంకలు గుద్దుకుంటోంది. మొత్తానికి కేసీఆర్ అతి విశ్వాసం కొంప ముంచే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తోంది.

లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఏమాత్రం తొందరపడటం లేదు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడిన విషయం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బాగా గుర్తు. నాడు తిరుపతిలో ఆయనపై నక్సలైట్ల హత్యాయత్నం చేసినప్పుడు సానుభూతితో ఎన్నికల గండం గట్టెక్కవచ్చని భావించారు. ఆ ఉద్దేశ్యంతో ఎన్నికలకు వెళ్లి చేదు అనుభవాన్ని చవిచూశారు. ఇప్పుడు మూడు పార్టీలు (వైసీపీ, బీజేపీ, జనసేన) నుంచి పోటీ ఎదుర్కొంటున్న చంద్రబాబు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఆమేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఎన్నికలకు తొందర పడటం లేదు. పార్టీ అధినేత జగన్ పాదయాత్ర పూర్తి కావడంపైనే ప్రస్తుతం దృష్టి సారించింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. బీజేపీ, జనసేన ఇతర చిన్నా చితకా పార్టీల పరిస్థితి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

లోక్ సభతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన మరో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. 60 మంది సభ్యులుగల రాష్ట్రంలో 2014లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో సహా మొత్తం బీజేపీలోకి ప్లేటు ఫిరాయించింది. రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలలో అరుణాచల్ ప్రదేశ్ తూర్పు స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ నుంచి బీజేపీ తరుపున ఎన్నికైన కిరణ్ రిజిజు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. లోక్ సభతో పాటు ఎన్నికలు జరగాల్సిన మరో రాష్ట్రం సిక్కిం. ఇది చాలా చిన్న రాష్ట్రం. 32 స్థానాలు గల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సారథ్యంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ 1996 నుంచి గెలుస్తూ వస్తోంది. ఈసారి కూడా చామ్లింగ్ విజయం ఖాయం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ తదితర జాతీయ పార్టీలకు చోటే లేదు. మొత్తం మీద ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు తొందరపడటం లేదు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈరోజు శుక్రవారం (07.09.18) ప్రముఖ తెలుగు దినపత్రికలు చూడండి…..

ఈనాడు.. పోలవరం పనులు భేష్ అని  వార్త రాస్తూ, ఆర్థిక సమస్యలున్నా వేగంగానే పనులు జరుగుతున్నట్టు చెప్పింది. సాక్షి చూస్తే…. నాణ్యతలో డొల్ల, స్పీల్ వే పనుల్లో లోపాలపై కేంద్ర నిపుణుల కమిటీ అసంతృప్తి అని వార్త రాసింది. ఆంధ్రజ్యోతిలో పోలవరం భేష్, పనులు లక్ష్యం దిశగా సాగుతున్నాయి అని వార్త ఇచ్చారు.  ఏం చేద్దాం. దేనిని నమ్ముదాం..  వాస్తవం చెప్పేదెవరు.  ఇత నమస్తే తెలంగాణ గురించి చెప్పేదేముంది… యథా రాజా……  కేసీఆర్ శంఖారావం ఇంటూ అందుబాటులో ఉన్న పెద్ద ఫాంట్ లో శీర్షిక పెట్టేసింది.  ఇంక ఇతర వార్తలేం ఉంటాయి.

మామాట:  నిన్న ఇవ్వాళ గందరగోళంగా ఉంది. ఎన్నికలయ్యేంత వరకూ ఇంతే  నా…

Leave a Reply