రక్షణలేని ప్రయాణాలు

Share Icons:

తిరుపతి, ఆగస్టు 30,

ఏం చేస్తాం? ఏదో దురదృష్టం వెన్నాడినపుడే.. తెలుగు దినపత్రికల్లో సారూప్యత కనిపిస్తుంది. అది మొన్న కరుణానిధి మరణం, అటల్ అస్తమయం సమయంలో చెప్పుకున్నాం కదా, ఇదిగో ఇంతలోనే తారకరాముని చైతన్యరథ సారథి హరికృష్టుడు రోడ్డు ప్రమాదంలో బుధవారం ఉదయం మరణించడంతో మళ్లీ తెలుగు పత్రికల్లో వివాదాల కంటే సంతాపం ప్రముఖంగా కనిపించింది.

హరికృష్ణ విషాద మరణం కారణంగా వెల్లువెత్తుతున్న సానుభూతిని పక్కన పెడితే, హరికృష్ణను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఆలోచన వస్తుంది. హరికృష్ణ నందమూరి తారక రామరావు కుమారుడు. గతం ఎలా ఉన్నా, పుట్టుక నుంచి సిరిసంపదలతో వెలుగొందుతున్నవాడు. దేనికీ లోటు లేనివాడు. తండ్రిని కోరి ఉంటే ఎక్కడైనా చదివించేశక్తి కలిగిన కుటుంబంలో పుట్టిన హరికృష్ణ ఎందుకు పెద్దగా చదువుకోలేదు. హరికృష్ణే కాదు రామారావుకు చాలామంది సంతానం వారిలో ఎవరూ గొప్పచదువులు చదువుకోలేదు. సినిమా నటుడిగా  బాలకృష్ణ ప్రసిద్దుడు, భువనేశ్వరి చంద్రబాబు భార్యగా ప్రముఖ స్తానంలో ఉన్నారు. పురంధేశ్వరి కొంత రాజకీయంగా పైకొచ్చారు. మరి మిగితావారేం చేస్తున్నారు. హరికృష్ణ తొలి సినిమా ప్రయత్నాలు ఎందుకు పెద్దగా విజయం సాధించలేదు. తన రెండో షో లో సీతయ్య వంటి చిత్రాలతో హరి ప్రేక్షకుల మది గెలుచుకున్నారు…

ఆయనకు జీవితంపై ఉన్న దృక్పధం ఏమిటో అంచనావేయడం కష్టం. పాతికేళ్ల వయసులో తండ్రికి సహాయకుడుగా చైతన్యరథ సారథి బాధ్యత చక్కగా నిర్వహించారు. సరే, ఒకవేళ రామారావు పార్టి పెట్టి రాజకీయాలలోకి రాకుండా సినిమా రంగంలోనే కొనసాగి ఉంటే, హరికృష్ణ కూడా స్టూడియో నిర్వహణలో, ఇతర కుటుంబ వ్యాపారాలలో ఉండిపోయే వారేమో…   అట్లాజరిగి ఉంటే హరికృష్ణ స్థానమేమిటి.

మహోన్నత వ్యక్తి కుమారుడుగా హరికృష్ణ వ్యవహరించిన వైనం కొంత నిరాశ కలిగిస్తుంది. రాజకీయ ప్రత్యర్థులు హరికృష్ణ ఎదుగుదలను బావ చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించ వచ్చు… మరి ఎదుటివారి వ్యూహాలకు పడిపోయేవారు హీరో లు కాలేరు కదా, ఆవేశం, నిజాయితీ ఈ రెండూ కంటే రాజకీయాలలో నెట్టుకురాగలిగిన చాకచక్యం ఏదో హరికృష్ణలో లోపించింది. అవును ఆయనతో అనుబంధం ఉన్నావారంతా హరన్న మంచి మనసున్న మనిషి అంటున్నారు. సో మంచితనము వలన చేతగానివానిగా హరికృష్ణ మిగిలిపోయాడని అనుకుందామా. ఎంతో చేసి ఉండవలసింది. ఇంకా కొంత ఉండగానే ముందుగానే వెళ్లిపోవడం, అదీ తనకు ఎంతో సంతోషం కలిగించే వ్యాపకం.. డ్రైవింగ్ చేస్తూ.. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం..

తన పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. అదీ స్వయంకృతమే, కాగా మరో ఇద్దరు కుమారులు నిత్యం సురక్షిత ప్రయాణం గురించి లోకానికి హితబోధచేస్తూ ఉంటారు.. మరి హరికృష్ణ చివరి ప్రయాణంలో కూడా అదే తప్పు మళ్లీ చోటుచేసుకోవడం వలన మనకు తెలుస్తున్న దేమి?, తెలుసుకోవలసిన నీతి ఏమి…? ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప కారైనా మితి మీరిన వేగం అపాయకరం అని మనం ఇప్పటికైనా తెలుసుకోవాలి, ప్రయాణంలో కనీస జాగ్రత్తలు పాటించాలి. ఇతరులకు చెప్పడం కాదు మనం ఆచరించినపుడే సత్ఫలితాలు వస్తాయనేది రెండే సత్యం. ఆచరణలేని ప్రవచణాల వలన ప్రయోజనం ఉండదు. తాను చెప్పిన అహింసి, సత్యం, ధర్మ మార్గాలను ఆచరించాడు కనుకనే గాంధీ మహాత్ముడయ్యాడు. లేకపోతే మామూలు విగతజీవుడయ్యేవారు.

మరొకటి..

మనం ఇపుడు చాలా భయంకరమైన నిఘా మధ్య జీవిస్తున్నాం. ఇక్కడ అత్యంత క్రూరమైన సామాజిక మాధ్యమాలహేళ నర్తిస్తోంది. ప్రతిది.. ముఖ్యంగా ప్రముఖులనబడేవారి ప్రతి కదలికా ఈ వికృత క్రీడకు బలౌతున్నది. మానవ మనసులలోని రాక్షసక్రీడానందం అంతా సామాజిక మాధ్యమాలలో ప్రవహిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. నిన్నే భారత ప్రధాని మోదీ దేశవాసులకు ఇదే విషయాన్ని విజ్ఞప్తిచేశారు. సామాజిక మాధ్యమాలలో విషం చిమ్మకండని వేడుకున్నారు.. ఎందుకంటే, అటల్ ఆగస్టు 15నే లేదా ఇంకా ముందే చనిపోయి ఉండవచ్చు.. జగన్ సతీమణి వేలకోట్లు తినేస్తుండ వచ్చు, హరికృష్ణ మృతికి జెండా అవనతం చేయవచ్చా… అంటూ చచ్చు ప్రశ్నలు వెల్లువెత్తుతాయి… తమకు సమాధానం తెలియకపోయినా, ప్రశ్నలు శర పరంపరగా కురుపిస్తారు.. అదే సైన్స్ మరో ముఖం. పైకి కనిపించని క్రూరనైజం.

మామాట:  హెల్మెట్ వాడడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం నామోషీ కాదు క్షేమకారకం.

Leave a Reply