నారా క్యా కరేగా….. విసుగెత్తుతున్న మత రాజకీయాలు

Share Icons:

తిరుపతి, ఆగస్టు 29,

బుధవారం (29.08.18) తెలుగు పత్రికలు చదువుతున్నపుడు రెండు విషయాలు ఆసక్తిగా అనిపించాయి. వాటి గురించి ఈ రోజు ముచ్చటించుకుందాం… మొదటిది వరవరరావు అరెస్ట్.. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ వార్తను సచిత్రంగా, ప్రముఖంగా ప్రకటించాయి. కానీ నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం ఎంతో జాగ్రత్తగా, పెత్తందారులకు కోపం రాకుండా, వార్త మిస్సవుతున్నట్టు ప్రగతిశీలవాదులు భావించకుండా ఉండాలన్నట్టు పౌరహక్కుల నేతల అరెస్ట్ అని పెట్టింది. వరవరరావు అరెస్టు పూర్తిగా రాజకీయప్రేరే పింతమైన దని మాత్రం చిన్నపిల్లవాడైనా చెబుతాడు. కానీ ఫేస్ బుక్ లో చాలా తక్కువగా వరవరరావు పట్ల అయ్యో అనే భావన కనిపించింది. నెట్ జనులు చాలా వరకు ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ఆలోచించ వలసిన విషయం. నిజంగా వరవరరావు అంత ధనవంతుడయ్యాడా. హక్కుల పేరుతో బడుగుల జీవితాలతో ఆడుకున్నాడా… తను, తన కుటుంబం, పిల్లలు సుఖంగా ఉన్నారా.. ఇవన్నీ చర్చకు నిలువ వలసిన అంశాలు.

ప్రధాన మంత్రిని  హతమార్చే పథక రచనలో వరవరరావు పేరు ఎందుకు చేరింది. అంత తీవ్ర వ్యతిరేకత చంద్రశేఖర రావు ప్రభుత్వానికి ఆయనపై ఎందుకుందో తెలియదు. కనీసం ఆయన పేరు, ఫోటో కూడా లేకుండా నమస్తే తెలంగాణ పత్రిక వార్త రాసే విధంగా పాలక పార్టీకి వరవరరావుకూ ఎక్కడ చెడిందో తెలుసుకోవలసిన అవసరం ప్రజలకు ఉంది. లేక నిజంగానే ప్రధాని స్థాయి వ్యక్తిని చంపేసేయాలన్న స్థితికి వరవరరావు దిగజారారా, ఆ నిజం తెలిసి తేరాసా పాలకులు ఆయనకు దూరంగా ఉన్నారా. ఏం జరిగింది. ఎక్కడ చెడింది.  ఏమో…

ఇక రెండవ వార్త.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న నారా హమారా సభ. ఈ వార్త చదువుతున్నపుడు హిపోక్రసీ ఇంత లోతుగా ఉంటుందా అనిపించింది. గత నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లీంలకు ప్రాదినిధ్యం లేదు. గుర్తింపు లేదు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ గురించి పట్టించుకున్న ప్రభుత్వ పెద్ద లేడు. ఆ నాడు మోదీ జీ తో కలిసి వేదికలపై కత్తి దూసినపుడు ఈ ముస్లీం ప్రజలు ఏమయ్యారు. ఈ నాలుగు సంవత్సరాలు ఎందుకు వారిని పట్టించుకోలేదు. ఇపుడు బిజేపీతో  చెడిన తరువాతే మైనారిటీలు గుర్తుకు వచ్చారా.. బాబూ… నిజంగా రాజకీయులు ఎంత లేకిగా ప్రవర్తిస్తున్నారో గమనించారా. గత నాలుగు సంవత్సారాల పాలనలో బాబు ప్రభుత్వం ముస్లీములకు, అసలు ప్రజలకు ఒరగబెట్టిందేమిటో గమనిస్తే నిన్నటి సభ ఎంతటి ఫార్సో తెలుస్తుంది. పాలన తెల్లారిపోయే సమయాన. మరో ఏడాది కూడా అధికారం ఉండదని తేలిసి ఇపుడు ముస్లీంలకు మంత్రి పదవి ఇస్తారా… చంద్రబాబు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియదు. అన్నీ అరా కొరా నిర్ణయాలే.. దీనిపై ఈనాడులో  హమారా భరోసా అని, వరమాల అనీ రెండు వార్తలు ప్రముఖంగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి లో  జగన్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అనే వార్తలు చూసినపుడు పత్రికల తీరుతెన్నులు తెలుస్తాయి. సాక్షిలో  మంత్రివర్గంలోకి ముస్లింలు అనే వార్త ఇస్తూ… పక్కనే ముస్లీంల అసమ్మతిని తెలియజేసే వార్త కథనం కూడా ఇచ్చారు.

పరిపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చంద్ర బాబుకంటే మెరుగ్గా ఉన్నారని ప్రధాని మోదీ అనడం సహేతుకమైనదే అని ఇవ్వాళ నెట్ జనులు చాలామంది అభిప్రాయపడుతున్నారు. గత రెండురోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ రాష్ట్రానికి సాధించిన అనుమతులు భేరీజు వేసుకున్నవారు అంటున్న మాటలు ఆలోచించవలసినవే.. కేంద్రం నుంచీ పనులు సాధించడంలో కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారనే భావన కాదనలేనిది. దానిని అందుకోవడంలో బాబు విఫలమైనారనేది కూడా అంతే వాస్తవమైనది.

మొత్తం మీద అటు కేంద్రంలోని పాలక పార్టీ, ఇటు రాష్ట్రంలోని పాలక పార్టీ మతాన్ని, కులాలను, వర్గాలను, ప్రాంతాలనూ అడ్డుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే నీచ విధానాలను వండి వారుస్తున్నాయి. నిస్సిగ్గుగా మతాలను నేరుగా ప్రస్తావిస్తు,  కుల రిజర్వేషన్ ఆశలు సజీవంగా ఉండే విధంగా తరచూ వివాదాలు సృష్టిస్తూ, వాటి నెగడు ఎగదోచి పదవీచలి కాచుకుంటున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త…. ఎన్నికలొస్తున్నాయోచ్…

మామాట : కుల మత రాజకీయాలు రాజ్యాంగబద్దమేనా.. ఏమో..

Leave a Reply