పాలనలో విఫలమైన చంద్రబాబు

Share Icons:

తిరుపతి, ఆగష్టు 27,

ఈ రోజు సోమవారం (27.08.18) తెలుగు దినపత్రికల్లో వార్తలు చదువుతున్నుపుడు సాక్షి దినపత్రిక లో వెలువడిన “ఉపాధి హామీ నిధులతో సమర్పించు.. పెదబాబు-చినబాబు” అనే వార్త దగ్గర ఆగాను… ప్రభుత్వం ఘనతను చాటడానికి 130 లఘు చిత్రాలా… వాటిని ఎవరు నిర్మించారు?, ఎవరు డబ్బులు చెల్లించారు?. ఎవరు నటించారు..? అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంలో పొదుపు చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం ఇలా నిధులు దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడడం సహేతుకమేనా అనే ఆవేదన కలిగింది.

ఇది ఎన్నికల సంవత్సరం, దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పాలకులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. అందుబాటులోని చాలా అవకాశాలను జారవిడుచుకున్నారు. కేంద్రంలో భాగస్వామిగా నాలుగు సంవత్సరాలు ఉండికూడా తెలుగుదేశం పార్టీ విభజన హామీలను సమర్థవంతంగా అమలుచేయించడంలో విఫలమైంది. అనవసరంగా ప్రధాని మోదీని ఢీకొని చేతులారా కష్టాలు కొనితెచ్చుకున్నారు. కేంద్రంతో కయ్యం వలన రాష్ట్రం నష్టపోతుందనే ఇంగితం మన పాలకులకు లేకపోవడం ప్రజల ఖర్మ.

తాజాగా.. అందుబాటులో ఉన్న నిధులను కూడా సక్రమంగా వినియోగించడం లేదు. రాష్ట్రంలో పాలన కుంటుపడి చాలాకాలమైంది. గ్రామాలకు, చాలా నగర పాలిక సంస్థలకు ఎన్నికలు లేవు. తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అధికారులదే ఇష్టారాజ్యంగా పౌరవిధులు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి స్వంత జిల్లా చిత్తూరులో పరిస్థితి చేయిదాటిపోయింది. ఇవన్నీ గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఆయను ముద్దుల యువరాజు ప్రజాధనంతో ప్రచారానికి సిద్ధపడడం సిగ్గుచేటు. క్షమించలేని తప్పు.

సినిమా గ్లామర్ కు ఓట్లు పడతాయా అని ఒకప్పుడు రామారావును కాంగ్రెస్ పార్టీ గేలిచేసింది. అపుడు భవదీయ ముఖ్యమంత్రి వర్యులు ఓ మంత్రిగా ఆ పార్టీలోనే ఉండేవారు. ఆ తరువాత పవన్ వంటి కొందరు సినిమా నటులు పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయన బిడ్డా కూడా సినిమా హాల్లో వెలిగిపోవాలనుకుంటున్నారా…? పవన్ సినిమా గ్లామర్ ను థియేటర్ల నుంచే నరుక్కువచ్చే ప్రయత్నమా ఇది!

ఏపీలో గ్రామ పాలన చాలా అధ్వానంగా ఉంది. ప్రజా ప్రాతినిధ్యం లేదు. పంచాయితీల గడువు ముగిసింది, మళ్లీ ఎన్నికలు ఎపుడు నిర్వహిస్తారో తెలియదు. (బహుశా హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసేదాకా వేచి చూడాలేమో) ఇపుడంతా బాబు గారి అనుచరగణంతో పంచాయితీలలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. ఇంకేమి.. విపక్షమనేదే లేదు. పంచాయితీ నిధులను ఇష్టానుసారంగా ఖర్చుచేయవచ్చు… పథకాలతో, వాటి సక్రమ అమలుతో పాలకులకు పనేమిటి… ప్రచారమే ముద్దు. అందుకింకేముంది హద్దు. టెండర్లు పిలవకుండా, ఆడిట్ లేకుండా ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనా చంద్రబాబు సీనియారిటి… అది ఇచ్చిన సిన్సియారిటీ…

తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబుకు… తన పనే మాట్లాడుతుంది.. ఇంకా ప్రచారం ఎందుకు అనే విజ్ఞత లేకపోవడం విచారకరం. అంటే తమ ప్రభుత్వం- పాలనా సత్ఫలితాలు ఇవ్వవు, ప్రజలను నమ్మించి, మోసగించాల్సిందే నని మన అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రిగారికి అర్థమైందనమాట. తన పాలనలో 80 శాతానికి పైగా సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలని నిత్యం సభల్లో ఊదరగొట్టే తండ్రీ కొడుకులకు ఈ ప్రచారమేల.. అయినవారికి దోచి పెట్టడానికి కాకపోతే..

మీరు గమనించండి… ఈ రోజు ఈనాడు పతాక వార్త నిర్వహణకు నీళ్లు… అని పెట్టింది. అంటే రాష్ట్రంలో పరిపాలనలో భారీ లొసుగులున్నట్టు జేబు సంస్థే ప్రకటిస్తున్న నేపథ్యంలో… బాబు గారు వారి బాబు గారు ఏ ముఖం పెట్టుకుని ప్రచార చిత్రాలతో మభ్యపెట్టాలనుకుంటున్నారో… దేవునికే ఎరుక. ఈనాడులోనే ఈరోజు మరో వార్త చూడండి… నిధికే నీరసమొచ్చేలా… అంటూ విపులంగా రాష్ట్రప్రభుత్వ చేతకానితనాన్ని ఎలా ఎండగట్టిందో… కేంద్రం నుంచీ ఆకర్షణీయ నగరాలకు రూ. 1,162 కోట్లు వస్తే… ఇక్కడి పాలకులు కేవలం రూ. 196 కోట్లు కూడా వ్యయం చేయలేని స్థితిలో ఉన్నారంటే ఏపీ పరిపాలన సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది… తనకున్న 40 సంవత్సరాల అనుభం ఎందులోనో ముఖ్యమంత్రి ఓ సారి పరీక్షించుకోవడం క్షేమకరం.  ఉదాహరణకు సీఎం సొంత జిల్లా లోని తిరుపతి నగరాన్నే తీసుకుందా…  ఈ నగరానికి వచ్చిన కేంధ్రం నిధులు రూ. 196 కోట్లు, రాష్ట్రం వాటా రూ. 186 కోట్లు మొత్తం రూ. 382 కోట్లు కానీ ఖర్చు పెట్టింది కేవలం రూ. 25.21 కోట్లేనట… ఎందుకింత పాలనా నిర్లక్ష్యం.  మొత్తం 39 ప్రాజెక్టులకు గాను కేవలం నాలుగో ఐదో పూర్తి చేశారు. మరెందులో గొప్పలు చెప్పుకోవడానికి  పెదబాబు-చినబాబు ప్రచార సిత్రాలు చేస్తున్నారో…

 

మామాట : వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు కానీ మళ్లీ అవకాశం ఇవ్వాలా…

Leave a Reply