స్లో పాయిజన్…బాబు

Share Icons:

తిరుపతి, ఆగష్టు 23,

గురువారం (23.08.18).. ఈనాడు.. హెక్టారుకు 25 వేల సాయం, వీడని వరద, గోదారి గట్టు గజగజ, మరో భారీ పెట్టుబడి వంటి మైలేజీ వార్తలిచ్చింది. సాక్షి కడుపుకోత అనే వార్తను పతాక వార్తగా ఇచ్చి, 3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం అనే వార్తను, ఆరో పెళ్లి పై టీడీపీలో ఉలికిపాటు అనే వార్తలు ప్రస్తావించింది. ఆంధ్రజ్యోతిలో  కూడా హెక్టారుకు 25 వేలు  పంట నష్టం అనే వార్తతో పాటు ఏపీ శత్రువు బీజేపీ అనే వార్తను ప్రముఖంగా ప్రచురించారు.  నమస్తే తెలంగాణలో పెళ్లువెత్తిన సాయం, 25 లక్షల మందితో,  లాభాల్లో 27 శాతం వాటా అనే అనుకూల వార్తలు ఉన్నాయి. ఈరోజు పత్రికలు చూసినపుడు నాకేమనిపించిందంటే….

కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్రవేయండి అనేది మనకున్న పాత సామెత.. ఒక కుక్క విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకోమన్నారంటే… రాజకీయాల్లో ఇంకెంత జాగ్రత్త అవసరం.. ఆ విద్యలో ఆరితేరినవాడు మన చంద్రన్న.  పదే  పదే చెబితే ప్రజలు నమ్మేస్తారనే నమ్మకం బాబుకుంది. అందుకే  రాష్ట్రంలో తెలుగుదేశం – కాంగ్రెస్‌ పొత్తు వ్యవహారంలో తెరవెనుక జరుపుతున్న మంత్రాంగం, లోపాయకారీ అవగాహనల గుట్టు బట్టబయలవడంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక మంత్రులు, నాయకులు తత్తరపాటుకు గురవుతున్నారు.  రానున్నఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు మంత్రులు, ఎంపీలతో  ఇటీవల అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్‌ నాయకులు ఈ పొత్తును వ్యతిరేకించినా ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి వెళ్లాల్సిందేనని, లేకపోతే అవినీతి వ్యవహారాల విషయంలో తీవ్ర ఇబ్బందుల్లో పడతామని చంద్రబాబు ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగానే పొత్తుల గురించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో జరిపిన సమాలోచనలు, సీట్లు సర్దుబాటు ఎలా ఉంటుందనే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం  ఓ పత్రికలో  నిన్నే ప్రచురితమైన విషయం తెలిసిందే. తమ లోగుట్టు వ్యవహారాలు బయటకు తెలిసిపోవడంతో వాటిని కప్పిపుచ్చు కునేందుకు వెంటనే ఎదురుదాడి మొదలు పెట్టారు తెలుగు తమ్ముళ్లు. కాంగ్రెస్‌తో బేరసారాల గురించి చెప్పలేక, పొత్తు చర్చలను ఖండించలేక ఎదురుదాడి పద్ధతిలో మంత్రులు జగన్‌మోహన్‌రెడ్డిపై తిట్ల దండకం అందుకున్నారు. చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇదంతా జగన్‌ కుట్ర అంటూ ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉందా లేదా అనే విషయం చెప్పకుండా మాట దాట వేశారు. దీన్నిబట్టి పొత్తు కోసం చర్చలు జరిగింది వాస్తవమేనని చెప్పకనే చెప్పినట్లయింది.

కాంగ్రెస్‌తో పొత్తు విషయం ఎన్నికల ముందు ఒక్క సారిగా ప్రకటిస్తే, వ్యతిరేకత వస్తుందని బాబు అంచనా.. అందుకే చాలా కాలంగా ఆయన బీజేపీ వ్యతిరేకనాదం అందుకున్నారు. ముందు ప్రధాని మోదీని బద్నాం చేయాలి, నెమ్మదిగా ప్రజల్లో బీజేపీ వ్యతిరేకత పెరుగుతున్నసమయంలో కాంగ్రెస్ మేలు అనే భావన వ్యాపింప చేయాలి.. అలా అలా మెల్లగా పాము చావకుండా, కట్టె విరక్కుండా ప్రజల మూడ్ ని అనుకూలంగా మలచుకోవాలన్నది చంద్రన్న అండ్ కో తంత్రం…

అయితే, కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారం  లీక్ కావడం  పార్టీలోనూ అంతర్గతంగా అలజడి రేపింది. రాష్ట్రంలో మట్టికొట్టుకు పోయిన పార్టీతో పొత్తు ఏమిటని పలువురు నాయకులు ఆందోళన పడుతున్నారు. రాజధాని లేకుండా, హోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన పార్టీతో కలిసి ఎలా పనిచేస్తామని స్థానికంగా తెలుగు తమ్ముల్లు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా  పురుడు పోసుకున్న తెలుగుదేశం ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ముఖమెలా చూపుతామని క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసహనం వ్యక్తమవుతోంది. నిన్న ఓ పత్రికలో వచ్చిన కథనంతో పార్టీలో పొత్తు విషయం అన్ని స్థాయిలోనూ చర్చించుకున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల టీడీపీకి ఒక సిద్ధాంతం, విధానం లేవని, అవకాశాన్ని బట్టి ఎవరితోనైనా కలిసేందుకు చంద్రబాబు వెనుకాడరనే విషయం నిజం చేసినట్లవుతుందని నాయకులు వాపోతున్నారు. కానీ స్లోపాయిజన్ సూత్రాన్ని నమ్మిన బాబు బృందం మాత్రం వెంటనే రంగంలోకి దిగింది.

మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు  మీడియా మీటింగులు పెట్టి ప్రతిపక్షాలది గోబెల్స్‌ ప్రచారం అంటూ తిట్ల వర్షం కురిపించారు. మరికొందరు ఎమ్మెల్యేలు, నాయకులు పొత్తు గురించి మాట్లాడకుండా ఈ విషయాన్ని బయటపెట్టినందుకు మీడియాపై  ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌తో పొత్తును ఖండించకపోవడాన్ని బట్టి, మీడియాపై మాటలయుద్దాన్ని బట్టీ తెలుగుదేశంలో ఏదో జరుగుతోందని ప్రజలకు తెలిసేలా జాగ్రత్తపడుతున్నారు. చివరకు ఇదంతా ముందునుంచీ అనుకుంటున్నదగా అంటూ ఎన్నికల నాటికి సన్నాయి నొక్కులు నొక్కడానికి టీడీపీ నేతలు సిద్దమౌతున్నట్టు కనిపిస్తోంది.  ఈనాడు, ఆంధ్రజ్యోతి పొత్తులపై ఇచ్చిన వార్తలు చూడండి… కావాలనుకుంటే.

మామాట:  పాడరా పాడారా పాచిపళ్లదాసరీ అంటే పాడిందే పాట పాడాడట బాబులాంటివాడు.

Leave a Reply