రాజకీయకూటమిలో పత్రికలు

Share Icons:

తిరుపతి, ఆగష్టు22,

బుధవారం (22.08.18) ప్రముఖ తెలుగు దిన పత్రికలలో వార్తలు చూద్దాం…

ఈనాడులో.. భాజాపా పైనే గురి అనే పతాక వార్త,  వానలు వరదలకు సంబంధించి ఏపీ లో ముంపు ముంగిటే అనీ, కేరళలో తొలగని వరద..బురద అనీ రెండు వార్తలిచ్చారు.  అమరావతికి 10 వేల కోట్ల రుణం.. అనే వార్త, ఇక ఒకే సిలబస్ , తప్పుడు సమాచారం పుట్టిస్తున్నదెవరో తేల్చండి అనే వార్తను ప్రముఖంగా ఇచ్చారు. సాక్షిలో పతాక వార్తగా చేసుకుందాం.. ఆరో పెళ్లి.. ఏపీలో కాంగ్రెస్ కు కొన్ని సీట్లిద్దాం, తెలంగాణలో తీసుకుందాం.. అన్నది ప్రముఖంగా ప్రచురించారు. దిగువగా అదే జోరు కృష్టా,గోదావరి హోరు అని వానల వార్త, నీట్ ఒకేసారి అనే సమాచారం ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో వరుసగా.. ఇంటి నిండా మట్టి, బురదమేటతో మొత్తం ధ్వంసం అని కేరళ పరిస్థితిని, కన్నీళ్లు.. కడగండ్లు అంటూ ఏపీ  వరద సమాచారం, బాధ్యత మీదే ..కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవలసింది మీరే అన్న ఏపి సీఎం అన్నట్టు వార్తలిచ్చారు. నమస్తే తెలంగాణలో సౌరబ్ సూపర్ , శ్రీరాంసాగరం, ఎన్జీటి రైట్ రైట్, వరమాయె కంటి వెలుగు వంటి మైలేజీ వార్తలే పేజీ నిండుగా పరుచుకున్నాయి.

సరే గానీ, సాక్షి ఎందుకు పెళ్లిగోల పట్టుకుంది… మొన్నటికి మొన్న పవన్ నాలుగు పెళ్లిల్లుచేసుకున్నాడని జగన్ వ్యాఖ్యానించడం, దానిపై పెద్ద దుమారం లేవడం చూశాం. మళ్లీ రెండు రోజులుగా, చంద్రబాబు ఆరు పెళ్లిల్లు అంటూ పతాక వార్తలు రాస్తోంది సాక్షి ఏంటో విశేషం…

దాదాపు ఇదే అంశాన్ని ఈనాడు కూడా ఈరోజు పరోక్షంగా ప్రస్తావించింది. కేంద్రంలో తిరిగి భాజాపా అధికారంలోకి రాకుండా ఉండే మార్గాలు, యూపీఏ వంటి మరోటి ..  మోడీ వ్యతిరేక కూటమికి అవకాశాలు పరిశీలించాలని బాబు చెప్పినట్టు  భాజాపా పైనే గురి అనే శీర్షికతో ఈనాడు రాసింది. సాక్షి మరింత విపులంగా వివరించింది అంతే తేడా.. ఇక్కడ  సాక్షి పత్రిక అనుకుంటున్నట్టు తెలుగుదేశం వ్యతిరేక భావన ఈ వార్త ద్వారా వస్తుందా.. అన్నది ఆలోచించాలి. జగన్ మొన్న పవన్ పై ఒంటి కాలిపై లేస్తూ.. నాలుగు పెళ్లిల్లు అంటూ హేళన చేశారు. ఖర్మ కాలి కొద్దిరోజులకే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించడం, ఆ సందర్భంగా ఆయనకూ ముగ్గురు పెళ్లాలున్నారు, ఆయన ఐదు మార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా వెలుగొందారు… అన్న వాస్తవం కరుణవంశ వృక్షంతో సహా పత్రికల్లో కెక్కింది. దీనితో పవన్కు మూడు పెళ్లిల్లు అనే అంశం పక్కదారి పట్టి అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదనే వాదనా బయలుదేరింది. ఇపుడు సాక్షి మళ్లీ తెలుగు దేశం ఆరో పెళ్లి అంటూ మొదలుపెట్టి చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీతో జట్టు కట్టాడో వివరంగా పట్టిక ఇచ్చింది. ఇక్కడా అదే అనుమానం… ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలే పార్టీ మారుస్తున్నారు. అలా కాకపోతే ఒకే పార్టీ గెలవాలి కదా… ఎందుకు ఇన్ని పార్టీలు అధికారాన్ని పంచుకుంటాయి. ఈ ఎన్నికల్లో ఒకరికి ఓటు వేసిన వాడు మరో ఎన్నిక నాటికి ఆ పార్టీకే వేయడు… మరో పార్టీ వైపు మొగ్గుతాడు.. రాజకీయాల్లో ఇది సహజం. మరి ఓటరే పార్టీ మారుస్తున్నపుడు, పార్టీలు కూటమిని మార్చకూడదా.. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ పార్టీలన్ని అధికారమే పరమావధిగా కూటములు మారుతూ ఉన్నాయి కదా, సిద్దాంతాల గురించి పట్టించుకుంటున్నదెవరు.. అదంతా పాత చింతకాయ పచ్చడి అన్నట్టు మారింది వ్యవహారం…  చివరకు వామపక్షాలు కూడా రాజకీయ పార్టీలతో ఒకో  ఎన్నికల్లో ఒకో జట్టు కట్టడం మనం చూశాం. తమిళనాడులో డీఎంకే ఒక సారి కాంగ్రెస్ తో, ఒక సారి బీజేపీ తో , ఒకసారి నేషనల్ ప్రంట్ తో  మరో మారు ఎన్ డీ ఏ కాదంటో యూపీఏ ఇలా అనేక మార్లు అనేక రాజకీయ పార్టీ కూటములతో జట్టు కట్టిందికదా, దానిని ప్రజలు ఆమోదించారు కదా.  ఈ నేపథ్యంలో సాక్షి పత్రిక ఆరోపణలు బూమరాంగ్ అవుతాయా… కేంద్రంలో సోమనాధ్ చటర్జీ ఎలా లోక్ సభ స్పీకర్ కాగలిగారు..? ప్రజలకు తెలియదా…? తెలుగు దేశం పై బురద జల్లడమే ధ్యేయంగా ఆరోపణలు చేయడం మాత్రమే కాకుండా.. చరిత్ర ను గుర్తుపెట్టుకోవాలి కదా. జగన్ కు అటువంటి సలహాలు ఎవరిస్తున్నారో…! వైసీపీలో కోవర్టులున్నారా…? ఏమో కాలమే నిర్ణయించాలి.

నిన్నటి సమావేశంలో రాబోయే రోజుల్లో బీజేపీ – కాంగ్రెస్సేతర పక్షాలను ఏకం చేయడానికి అవకాశాలను పరిశీలించాలనీ బాబు ఆభిప్రాయపడగా,  ఎన్నికల్లో జత కట్టడం విషయంలో  తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరి సాక్షి పత్రిక ఎందుకు తొందర పడిందంటారు.

మామాట :  సంకీర్ణరాజకీయ యుగంలో కూటమిని వ్యతిరేకించడమెలా..

Leave a Reply