లీకుల తాత్కాలికం – నోరు మెదపని పాత్రికేయం

Share Icons:

తిరుపతి, ఆగష్టు 21,

సమయం ఎంతో విలువైనది… ఒక్క క్షణం మన చే జారినా,  మల్లీ ఎన్నటికీ అది తిరిగిరాదు.. ఇటువంటి మంచి ముచ్చట్లు చిన్నవయసులోనే బడిలో మనకు నేర్పిస్తారు. కాలం విలువతెలుసుకోవడానికి యూనివర్శిటీలో చదువు కోవలసిన అవసరం లేదు. మరలాంటపుడు నాలుగున్నర సంవత్సరాలు అంటే కొద్ది కాలం కాదు. ఏవిధంగా చూసుకున్నా, ప్రభుత్వాలు తమ పనితనం నిరూపించుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. పని పూర్తి కానక్కరలేదు… అందుకు మరో పదేళ్లుకూడా పట్టవచ్చు.. అది ఎంచుకున్న పనిలోని భారీ తనాన్ని బడ్డీ ఉంటుంది. అయితే ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశామన్నదానిపై నే కదా భవిష్యత్తు నిర్మాణం జరిగేది.

2014లో తెలుగు రాష్ట్రం విభజన జరిగింది. రాజధాని హైదరాబాదు లేకుండా, 13 జిల్లాలతో ఏపీ విభజిత రాష్ట్రంగా మిగిలింది. అప్పట్లో ప్రజలు అనుభవం ఉంది కదా అని చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రన్న కేంద్రంతో సఖ్యత కొనసాగించలేదు. చాణక్యం చూపించి రాష్ట్రానికి కావలని నిధులు, విధులు సాధించలేదు. అదేదో సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి , అలా,  సమయానికి తగు మాటలాడి, కేంద్రం నుంచీ సానుకూల ఫలితాలు తీసుకురావడంలో బాబు పూర్తిగా విఫలమవడమే కాకుండా, ఇపుడు కేంద్రంతో ప్రత్యక్షవైరం కూడా పెట్టుకున్నారు. ఇదంతా ఎందుకు చెబుతు న్నానంటే…  తెలుగువారి రాజధాని నిర్మాణంలో చంద్రన్న వైఖరి ఏమిటో తెలియకనే.. వందల కోట్లు ఖర్చుచేసి తాత్కాలిక భవనాల్లో సచివాలయం, శాసన సభ, మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వాటికి తగిన నాణ్యత లేక చిన్నపాటి వర్షానికే నీరు కారుతున్నాయి. మొదటే మంచి భవనాలు ఎంపిక చేసుకోవలసి ఉంది. అలా చేయకపోగా, తొలి సారి నీటి లీకేజీ కనిపించినపుడన్నా… భేషజాలకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపించి ఉండ వలసింది. అపుడు ప్రతిపక్షనేత చాంబర్లో వర్షంనీరు కారుతుంటే.. పైపులు కోసేశారంటూ ప్రచారం చేయించారు. మరి తాజాగా మళ్లీ సచివాలం సహా, సీనియర్ మంత్రుల చాంబర్లలో నీరు కారుతోంది కదా ముఖ్యమంత్రి ఏమంటారు, అమరనాథ రెడ్డి, గంటా శ్రీనివాసులు కూడా పైపులు కోసేశారా. వాన పడీ పడగానే ఇలా నీరు కారే సచివాలయం దేశంలో మరెక్కడైనా ఉందా, ఇంత నాసిరకం నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వం చెల్లించిన నిధులు ఎంత. నాణ్యతా లోపానికి ఎవరు బాధ్యులు…  మంత్రుల చాంబర్లలో వాన నీరు కారుతున్న అంశంపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందా..  అనే పలు ప్రశ్నలు సామాన్యుల మదిలో మెదలుతున్నాయి.

మంగళవారం (21.08.18) తెలుగు ప్రముఖ దినపత్రికలు మళ్లీ మామూలు వార్తల ప్రచురణతో తమ రాజకీయ యుద్దానికి తెరతీశాయి. ఈనాడులో కన్నీటి సుడి అంటూ కేరళ వరద వార్త ప్రముఖంగా వేశారు. పక్కనే రామోజీ రావు విరాళాల విన్నపమూ ప్రకటించారు. దానికి దిగువన అవగాహన లేక 5 వేల కోట్లు వృథా అనే విదేశీ విద్యార్థుల ఉపకారవేతనాల సమాచారం ఇచ్చారు. సరే. అమరావతిలో తాత్కాలిక వసతిపేర ఈ రాష్ట్రప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ప్రజాధనం వృథా చేస్తాఉందో ఈనాడు ఎందుకు రాయడంలేదు. కనీసం ఓ మాదిరి వర్షానికే మంత్రుల కార్యాలయాలలో నీరు నిండుతోందంటే… అది వార్త కాదా, అమరావతికి వెళ్లేదారులన్నీ ఇప్పటికే జలమయమైనాయంటే అది వార్త కాదా, రాజధాని ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతంలోని నీటి ప్రవాహాలను సరిదిద్దే అంశం ప్రభుత్వానికి తెలియదనుకోవాలా, ఒక్క సాక్షి పత్రికలోనే లీకుల విషయం ప్రముఖంగా ప్రచురించారు. ఆంధ్రజ్యోతిలో  ఎక్కడో  లోపలి పేజీల్లో  మూలన చిన్న కాలం వార్త వేసి, మేమూ వేశామనిపించుకున్నారంతే… ఇదేనా పత్రికల నిష్పక్షపాత వైఖరి.

తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అడుగుకు రూ. 10 వేలు చెల్లించన మాట నిజమేనా. రాజధాని తాత్కాలిక ఏర్పాట్లకు ఇప్పటివరకూ రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారా.. మరి శాశ్వత భవనాల మాటేమిటి అని ప్రశ్నించ వలసిన బాధ్యత పత్రికలకు లేదా? ఇలాంటివెటూ నమస్తే తెలంగాణలో రావు, అక్కటి ప్రజా సమస్యలనే ఆ పత్రిక పట్టించుకోవడంలేదు. అన్నీ టిఆర్ ఎస్ ప్రభుత్వానికి మైలేజీ పెంచే వార్తలే ఉంటాయి. అసమ్మతి స్వరం అసలు వినిపించని పత్రిక నమస్తే తెలంగాణ.

మామాట: ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తున్నారు…  తగిన మార్కులూ వేస్తారు. 

Leave a Reply