విపత్తులు-ఐక్యత

Share Icons:

తిరుపతి, ఆగష్టు 20,

మీరు గమనించారో లేదో గత పక్షం రోజులుగా దిన పత్రికలను వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు ప్రకృతి. నిజానికి ఇపుడు చేస్తున్నదే పత్రికల నిజమైన విధి. కానీ ఆ విషయాన్ని అవి మరచిపోయి చాలా కాలం అయింది అందు వలన మనం కూడా రోజూ రాజకీయ బురదజల్లుడు వార్తలు చూడ కుండా ఉండలేక పోతున్నట్టున్నాం.. ఎందు కంటే తినగ తినగ వేము తియ్యనుండు అన్నాడు కదా శతకకారుడు…. అదన్నమాట విషయం. సరే నేను చెప్పదలచుకున్నదేమిటంటే… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యం వార్తలు మొదలుకొని, ఆయన మృతి, సంతాపాలు ముగిసినట్టే ముగియగానే,, వెంటనే మాజీ ప్రధాని అటల్ జీ వార్తలు, ఇపుడు ఇక కేరళ జలప్రళయం వార్తలతో మన తెలుగు దిన పత్రికలు పరస్పరం బురదజల్లుకునే హోళీకి తాత్కాలిక విరామం ప్రకటించి ప్రధాన పుటలన్నీ జాతీయవార్తలతో నింపుతూ కొంత నిజాయితీ కనబరుస్తున్నాయి.  రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్టున్నాయి. అంటే ఇట్లా ఏదైనా విపత్తు సంభవిస్తే కానీ తెలుగు పత్రికలు ఏకతాటిపైకి రావా, ఏమో.

సోమవారం (20.08.18) నాలుగు ప్రధాన తెలుగు దినపత్రికల వార్తలు గమనిద్దాం. ఈనాడులో  పతాక వార్తగా కాస్త ఊరట అనే జలప్రళయం వివరాలున్నాయి, అలాగే ఆసియా క్రీడల్లో పసిడి పట్టిన భజరంగ్ వార్త ప్రముఖంగా ఉంది. ఇక మొదటి పేజీలో పెద్దగా రాజకీయ వార్తలు లేవు అన్నీ, అప్రమత్తంగా ఉండండి,  రాష్ట్రంలో వరద ఉద్ధృతి వంటి సహాయం, ముందస్తు జాగ్రత్తలకు సంబంధించిన సమాచారమే ఉంది.  దిగువన టీచర్లు పాసయ్యారోచ్ అనే వార్త ఉంది. అది కొంచెం ఆలోచించవలసిన వార్త… నిజానికి ప్రభుత్వ బడులలో ఎవరూ తమ బిడ్డలను చేర్పించడం లేదు అంటూ, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిత్యం నిందలు వేసే పత్రికలు, పాత్రికేయులు తమ పిల్లలు ప్రభుత్వ బడులకు పంపుతున్నారా. దీనిపై ఎవరైనా ఇప్పటి వరకు సర్వే నిర్వహించారా… గణాంకాలు ఉన్నాయా….

మరి నీతులు చెప్పడానికేనా, పాత్రికేయులు ఆచరించడానికి కాదా. చాలా సందర్బాలలో మీడియా మిత్రబృందాలు తమ పిల్లల చదువుల కోసం ప్రైవేటు పాటశాల యాజమాన్యంతో కుమ్ముక్కవుతున్న సందర్భాలు, బెదిరించి, భయపెట్టి ఫీజులు కట్టకుండా పబ్బం గడుపుకుంటున్న విలేకరులు ఎందరో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులలో బిడ్డలను చదివిస్తున్న పాత్రికేయులు ఎంత మంది.

సాక్షి పత్రికలో కేరళ విపత్తుకు ప్రముఖ స్థానమిచ్చారు. అదీ, ప్రకటనలూ పోగా తక్కిన నాలుగు వార్తలు రాజకీయంగా తెలుగుదేశంపై ఎక్కుపెట్టినవే కావడం గమనార్హం.  పల్నాడు గనుల దోపిడాపై సీబీఐ విచారణకు సిద్ధమా అన్న జగన్ వాఖ్యలో లాజిక్కు లేదు. ఇప్పటికే తనపై ఉన్న కేసులు సీబీఐ పెట్టినవే, ఆ సంస్థ పాలకుల ఇంటి కుక్క అని గతంలో తన కేసుల విషయంలో జగన్, వైసీపీ పార్టీ ఆరోపించాయి. మరి ఇపుడు సీబీఐ విచారణ కోరడంలో పరమార్థం అర్ధం కాదు. సీబీఐ ఇపుడు ప్రక్షాళణైందా… . పల్నాడు గనులలో ఇంత జరుగుతూ ఉంటే వైసీపీ శాసనసభలో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు, సాక్షాలతో సభా సంఘం వేయించి, విషయాన్ని రుజువు చేసి ఉండవచ్చు, ప్రభుత్వం ఒక వేళ పట్టించుకోకపోయి ఉన్నా, ప్రజలు అంతా గమనిచేవారు కదా, ఆ అవకాశాన్ని వైసీపీ ఎందుకు విడిచిపెట్టినట్టు.

ఆంద్రజ్యోతిలో జలబంధం, వీడని ముసురు వంటి వాన వార్తలు, బజరంగ్ విజయంతో పాటు ఇ ప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ లో రెండేళ్లలోనే మారిన సీన్ అనే వార్త ప్రముఖంగా ఉంది. ఈ వార్త పూర్తిగా అధికార తెలుగుదేశానికి మైలేజీ కోసం వండి వార్చినదే. ఒక వైపు విశాఖలో ఐటీ కంపెనీలు వచ్చినట్టే వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి, ఏపీ ఇప్పటి వరకూ ఐటీ దిగ్గజాలు కాలు కూడా పెట్టలేదు, బాబు మహత్యం ఎక్కడ ? అంటూ నెట్ జనులు సెటైర్లు వేస్తున్నారు. జ్యోతి పత్రిక మాత్రం ఏపీలో రెండేళ్లలో సీన్ మొత్తం మారిపోయిందని రాస్తోంది.

ఇక నమస్తే తెలంగాణలో షరా మామూలే. దైవభూమి దైన్యం అనే కేరళ వార్త, కేరళకు తెలంగాణ సాయం తెలిపే  తెలంగాణ చేయూత వార్త ప్రధానంగా ఇచ్చారు. దిగువన గోదావరి వరద, బజరంగ్ గెలుపు వంటి ఇతర వార్తలు ప్రచురించారు.

మామాట:   పత్రికలలో పనిచేసేవారు ఎందరు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చదివిస్తున్నారో. . 

Leave a Reply