అటల్ జీ కి ఏది నివాళి?

Share Icons:

తిరుపతి, ఆగష్టు 18,

రెండో రోజు కూడా ప్రముఖ తెలుగు పత్రికలు నాలుగూ మాజీ ప్రధాని అటల్ జీ అంత్యక్రియల వార్తల్లో సారూప్యత చూపించడం విశేషం.  ఇక రెండో సమాన విషయం కేరళలో  వరద ఉదృతి పై వార్తలు.. రెండు రోజులు రాజకీయ కంగాళం నుంచీ పాఠకులకు కొంత ఊరట లభించిందనమాట.

నిజంగా దేశం కోసం తప్ప తనకోసం ఏమీ ఆలోచించని ఒక రాజకీయనేత పట్ల ప్రజల్లో ఎంత ఆరాధనాభావం పెల్లుబుకుతుందో… అటల్ జీ మరణం తార్కాణం. కానీ ఈ నిజాన్ని తాజా రాజకీయనేతలు గుర్తిస్తారా లేక ఇదీ శ్మశాన వైరాగ్యం లాంటిదే అవుతుందా. కాలమే జవాబు చెప్పాలి.  పదవిలో ఉండి, తనవారికోసం దోచి పెట్టిన వారికి, పదవిలోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేసేవారికి ఆ పదవి, హోదా పోయిన నాడు కారే రాజులు అనే పద్యం గురుతుకు రావచ్చు.

ఇదే సూత్రం పత్రికలకు, సగటు మానవునికీ వర్తిస్తుంది. కేవలం రాజకీయనేతలు మాత్రమే నీతిగా ఉండాలి, పదవుల్లో ఉండే అధికారులే అవినీతికి దూరంగా ఉండాలి అనుకోవడమే ఇప్పటి మన దుస్థితికి కారణం. ప్రస్తుతం మన సమాజంలో వ్యక్తి సమూహంలో నీతి మంతుడుగానూ, వ్యక్తిగతంగా అవినీతి పరుడుగానూ మసలుకుంటున్నారు. వేదికపై నీతిపాఠాలు వల్లించే వారు తాము మాత్రం మళ్లీ అవినీతికి పాల్పడకుండా ఉండడం లేదు. అందువలన ప్రజలు మొత్తంగా నీతివంతులైనపుడే జాతి నీతి వెలుగొందుతుంది. ఎందుకంటే దేశమంటే మట్టి కాదు మనుషులోయ్ అని మహాకవి అన్నాడు గుర్తులేదా.  ప్రజలు లేదా ఓటరు పవిత్రంగా లేకుండా దేశం, సమాజం ఉన్నత మార్గంలో పయనించవు. వ్యక్తిగా నిబద్దతతో జివించడం మొదలుపెట్టాలి. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది… అటల్ జీ జీవితం మనకు నేర్పే పాఠం ఇదే. సచ్చీలత అలవరుచుకోవాలి. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతున్నపుడు ఎవరైనా మరో ఓటు కొంటారు. అదీ ఓటు అమ్మకానికి సిద్దంగా ఉన్న సమయంలో… అటువంటిది పాలనాధికారాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టిన వ్యక్తిలోపల దాగి ఉన్న శక్తి ఏమిటో ఈ జాతి ఎంత త్వరగా గుర్తిస్తే ఈ దేశానికి అంత మేలు. అదే మనం అటల్ జీకి ఇచ్చే నిజమైన నివాళి. ఒక ప్రజాహృదయాధినేతకు పత్రికలు సముచిత స్థానం ఇచ్చిన వైనమే మన ప్రస్తుతాంశం.

ప్రజాస్వామ్యంలో రెండు భిన్నదృవాలు

శనివారం (18.08.18) నాలుగు తెలుగు పత్రికలు అటల్ జీ వార్తలతో మొదలయ్యాయి.. ఈనాడు పత్రిక  పతాక వార్తగా ఔదార్యమూర్తికి అంతిమ వీడ్కోలు అనీ, సాక్షి పత్రిక అటల్ జీ అల్విదా అనీ ఆంధ్రజ్యోతి దేశమా వర్ధిల్లు.. అటల్ జీ అంతిమ వీడ్కోలు అనీ నమస్తే తెలంగాణ పత్రిక  వాజపేయికి కన్నీటి వీడ్కోలనీ వార్తలను ప్రముఖంగా ప్రచురించాయి.

షరా..

కొన్ని సార్లు కొందరు వరుసగా తప్పులుచేస్తున్నా అకసామత్తుగా ఎవరూ ఊహించని విధంగా పుణ్యకార్యం ఏదో చేసేసి ఒడ్డున పడిపోతూ ఉంటారు. అలాంటిదే నిన్న అటల్ జీ అంతిమయాత్రలో కాలినడకన మోదీ బృందం పయనించడం. సుమారు ఐదు కిలోమీటర్లు.. ప్రధాని సహా పలువురు కేంద్ర నేతలు, వృద్దులూ అటల్ వెంట నడిచివెళ్లడం భావోద్వేగాలకు సంబంధించింది. మనసును తడి చేసే సంఘటన. వాహనాలలో వెళ్లి ఉండవచ్చుగాక… అలా వెళ్లకపోవడం సచ్చీలత. అంతే. అదే సమయంలో అటల్ చితి మండుతున్నపుడు ప్రధాని సహా ముఖ్యులంతా దూరంగా కుర్చీలలో కూర్చుని ఉండడం, ముఖ్యంగా పలువురు శిఖర సమానుల నడుమ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాలుపై కాలువేసి కూర్చోవడం పై శుక్రవారమే సామాజిక మాథ్యమాలలో తీవ్ర దుమారం రేగింది. ఇటువంటివి వారి విజ్ఞతకే వదిలివేద్దాం.

 

 

మామాట: అటల్ జీ జీవితాశయం నెరవేరేలా మనం కృషిచేయలేమా!

 

 

2 Comments on “అటల్ జీ కి ఏది నివాళి?”

  1. very good gangadhar gaaroo… nenu anukunnadhe meeru raasaaru. mana abhipraayaalu inkaa dhaggaragaane vunnaay… keep it up

    mee bashaa…

    1. ధన్యవాదాలు భాషా గారు… అందరం ఆ తాను ముక్కలే కదా…

Leave a Reply