ఒరిగిన శిఖరం-ఒక్కటైన పత్రికలు

Share Icons:

 

 

తిరుపతి,  ఆగష్టు 17,

 

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

నిన్నటి నుంచీ ఈ సుమతి పద్యం మదిలో మెదలుతూ ఉంది. శుక్రవారం (17.08.18) తెలుగు దినపత్రికలు చూచినపుడు… ఈ పద్యం మళ్లీ కనుల ముందు నిలిచింది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే మానవ నైజాన్ని ఇంత చిన్న తేట తెలుగు పదాలలో ఇమిడ్చిన శతక కారును రచనాశక్తికి నమస్సులు చెప్పుకున్నాను.  సుతి మెత్తని మనసుతో జాతి జనుల గుండెలనుగెలుచుకున్న మాజీ ప్రధాని అటల్ జీ మరణవార్తతో సహచరులతో పాటు నా మనసు కూడా మూగబోయింది. ఆయన గురించి ఏదన్నా రాయాలనిపించినపుడు ఈ పద్యం ఒక్కటీ రాసేసి ఊర్కోవచ్చునని పించింది.  ఇంత కాలం ఇంతమంది జనుల మనసు గెలుచుకున్న వాజ పేయి ఏం బలగం కలిగినవాడు… నాలుగు తెలుగు పత్రికల మొదటి పుటలు , లోపలి పేజీలలోని వ్యాసాలు చదువుతున్నపుడు బలం అంటే ఏమిటి అనే ప్రశ్న మనకు కలుగుతుంది.

ఏనుగు కంటే మావటి వాడు ఎందులో బలవంతుడు చెప్పండి. మరి వాని వెంట మదగజం తోక ఉపుకుంటూ మందగమనంలో వెళ్లడానికి కారణం ఏమిటి. తార్కికమైన బుద్ధి బలం కంటే హద్దులెరుగని శారీరిక బలం వలన ప్రయోజనం లేదని తెలియడం లేదూ.  అంతే కాదు శతకకారుడు చెప్పిన ఒళ్లు జలదరించే మాట… భావింపగ నీతిపరుడు బలవంతుండౌ నన్న వాఖ్యం అటల్ జీ జీవితాన్ని, ఆయన చివరి ప్రయాణాన్ని చూచినపుడు నిజమనిపించడం లేదూ.. కవి ని ఋషి అని, దార్శనికుడనీ అంటారు. ఆ మాట నిజమని శతక కారుని ఈ పద్యం మరో మారు నిరూపించిందీవేళ. పై చెప్పిన పద్యాలలోని అక్షరాలకు రూపం వస్తే అది అటల్ జీ వాగా ఉంటుంది. సమకాలీన రాజకీయ యవనికపై అజాత శత్రువుగా వెళ్లిపోతున్న చివరి వ్యక్తి.. ఏకీభావ శక్తి వాజ్ పేయ్ మాత్రమే… అందుకే ఈ ఉదయం తెలుగు పత్రికలన్నీ  కన్నుమూసిన కర్మయోగి అని, ఒక శిఖరం ఒరిగింది అని, దివికేగిన మేరునగం అనీ అటల్ జీ అస్తమయం అంటూ ఒకరికి ఒకరు తీసిపోని స్థాయిలో పతాకశీర్షికలుంచారు. నిలువెత్తు ఫోటోలతో అటల్ జీకి నివాళి అర్పించారు. అవును అటల్ ఎందులో బలవంతుడు… ఆయన వెనుక ధన బలం ఉందా, ఉండడానికి ఇల్లుకూడా లేదే…. ఆయన వెనుక కుల సంఘాల క్యూ ఉందా.. ఆయన కులం ఏమిటో నిన్న గూగుల్లో చూచేవరకూ తెలియదే… పోనీ ప్రాంతీయ బలం ఉందా… అటల్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు… అన్ని మార్లు లోక్ సభకు ఎక్కడెక్కడ నుంచీ గెలిచారు. ఎవరు వీల్లంతా, ఆయనకు ఏమౌతారు.

నిన్న మధ్యాహ్నం నుంచీ కన్నీటి పర్యంతమౌతున్న కాశ్మీరు నుంచీ కన్యాకుమారి వరకూ రోధిస్తున్న మానవ సమూహం ఏ కారణంగా అటల్ జీ లేరంటే  విలపిస్తోంది. ఆయన పదవిలో ఉండి పోయి, ఆ ఫలాలు తమకు దక్కుతాయని వీరంతా ఆశించి విలపిస్తున్నారు. దాదాపు పుష్కర కాలం క్రితం పదవి నుంచి వైదొలగి, గత ఆరేడు సంవత్సరాలుగా కనీసం నోట మాట రాని అనారోగ్యంతో బాధపడిన నేత నుంచి ఏం ఆశించి జాతి జనులు కన్నీరు మున్నీరవుతున్నారు… అదే అటల్ బలం. ఈ బలం గురించే సుమతి శతకకారుడు చెప్పింది. మానవులారా మనిషి ని గౌరవించండి, సిద్దాంతాలనుచర్చించండి, అంతే కాని వాటి ఆ ధారంగా వైషమ్యాలను, వైకల్యాలను పెంచుకోవద్దన్నాడు. దానిని త్రికరణ శుద్ధిగా ఆచరించినవాడు అటల్ బిహారీ వాజ్ పాయ్… అందుకే ఈ జాతినిలువెత్తు కన్నీటి నివాళి. ఈ విషయంలో ఏకతాటిపై నిలిచిన తెలుగు పత్రికలకు అభినందనలు….

 

మామాట: అంతఃకరణ శుద్ధితో జీవించడం అంటే ఏమిటో మీ నుంచి తెలుసుకున్నాం అటల్ జీ…

 

Leave a Reply