జర్నలిష్టులే గూఢచారులా…?

Share Icons:

తిరుపతి, ఆగష్టు 13,

పత్రికలు పెట్టుబడిదారుల విషపుత్రికలుగా మకిలి పులుముకుంటున్నాయి. ఒక నాడు తెలుగుజాతికి కీర్తి పతాకగా వెలుగొందిన దిన పత్రిక వర్తమానంలో చాలా పతనమార్గంలో వెళుతోందని నెటిజనులు అభిప్రయపడుతున్నారు. ప్రజలు ప్రస్తుతం ఏ పత్రికను మనస్ఫూర్తిగా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. పత్రికలు కూడా పాఠకుల ఆదరణ కోసం చూస్తున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకటి… పత్రిక తీసుకునే స్టాండ్ ను బట్టీ సదరు వర్గం అంతా ఆ పత్రికనే కొంటారు. ఈ స్టాండ్ అనేది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతీయతత్వం కావచ్చు రాజకీయ శిబిరం కావచ్చు. దీనితో కొంత గ్యారెంటీ పాఠకులు ఉంటారు. మరి కొందరు సమాచారాన్ని పోల్చి చూచుకోవడానికి, లేదా వ్యాపార రీత్యా రెండు మూడు పత్రికలు కొనవలసిన వారు ఉంటారు. ఇక రెండవది.. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల హవా.. ఆండ్రాయిడ్, టచ్ స్క్రీన్ వంటి సదుపాయాలున్న ఫోన్లలో… న్యూస్ ఆప్ లు కూడా ఉచితంగా దొరకడం. ఇక్కడ పత్రిక కొనడం అనేది ఉండదు… ఎందరు సదరు పత్రిక ఆప్  వినియోగిస్తున్నారనేదానిపై వారికి ప్రకటనలు వచ్చే మార్గం ఒకటి ఉంది. తద్వారా యువతను ఆకట్టుకుని లైకులు-క్లిక్ లు పెంచుకోవడమే పనిగా మొబైల్ ఆప్ లలో వచ్చే అంతర్జాల పత్రికలు తాత్కాలిక పుకార్లను వ్యాపింపజేస్తూ… పబ్బం గడుపుకుంటున్నాయి. జర్నలిజం విలువలతో ఇపుడిక ఎవరికీ పేచీ లేదు.

సోమవారం(13.08.18) తెలుగు ప్రముఖ దినపత్రికలు చూచినపుడు అదే భావన కలుగుతుంది. ఈనాడులో  చలో సూర్యుడు చెంతకు, కృష్ణా గోదావరికి వరదపోటు అనే వార్తలు పతాకశీర్షికలుగా వచ్చాయి. దిగువన బతుకు బాసట అని చంద్రబాబు గురించిన వార్త ఉంది. ఇక నైపాల్ మృతి, తిరుపతిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, సహా పుట్టపర్తిలో జరిగిన న్యాయసదస్సు వార్త న్యాయమూర్తులు సత్యాన్ని ఆచరించాలి అనే వార్తలు కూడా ఉన్నాయి. సాక్షి దిన పత్రికలో పతాక వార్తగా ఎన్నికల తర్వాత ఎన్డీఏ గూటికే అనే వార్త ఉంది. దాని దిగువన ఘనుడు సేఫ్, బడుగులే బలి అని అక్రమ క్వారీల గురించిన వార్తనిచ్చారు. ముసురేసింది, కొండకోనల్లో పోటెత్తిన జనం అంటూ అటు రాష్ట్రంలో వర్షాల వివరాలు, ఇటు జగన్ పర్యటనలో జన హర్షం వివరాలు అందించారు. ఆంధ్రజ్యోతిలో పతాక వార్తలుగా మీడియాపై మోదీ నిఘా అనే వార్తతో పాటు మిషన్ సూర్య విశేషాలు ఇస్తూ… నలుగురు పోలీసు ఉన్నతాధికారలు వ్యవహారశైలిపై వార్తా కథనం ఇచ్చారు. ట్రిపుల్ ఐటీలో మతప్రార్థనలు, 10వేల కోట్లతో మమ్మల్ని కొంటారా అన్న ముద్రగడ వార్త, అవినీతిలో రెండు ఒక్కటే అనే పవన్ వార్త ఇచ్చారు. నమస్తే తెలంగాణలో ఆగష్టు 15 న మూడు కానుకలు అనేది ప్రధానంగానూ, నాసా ప్రోబ్ అనే వార్త ఇచ్చారు. కాల్చి చంపినవారే నివాళులర్పిస్తారా అనేది మరో సమాచారం.  ఇవి నేడు పత్రికలు ప్రధాన వార్తలుగా భావించిన అంశాలు, వాటిని ప్రచురించిన వైనం.

ఇందులో నేడు మనకు ఆందోళన కలిగించే అంశం ప్రధాని మోదీ శైలి. జ్యోతి ప్రచురించిన వార్తలో నిజం ఎంతవరకు ఉంది అన్నది పక్కన పెడితే… ఇలా వందలాది పాత్రికేయులను నిఘా శక్తులుగా, గూఢచారులుగా, చారులుగా మారుస్తున్న నేటికాలం రాజకీయశక్తుల దుర్నీతికి చింతించాల్సి ఉంది. ఈ పరిణామం ఎటువెడుతుంది.  మీ టీవీలో మా నేతను ఎంత సమయం ఏ విధంగా చూపించారో సమాచారం మాదగ్గర ఉంది, అనే ఆరోపణ రావడం  పాత్రికేయరంగం పతనానికి పరాకాష్ట అనుకోవచ్చు. ఇది ఎవర్జెన్నీ కంటే దారుణం. మీడియా ఇపుడిక ఏం చేయగలదు. డబ్బులేనిదే ఏదీ కాదు. డబ్బులు రావాలంటే బాస్ లకు (అధికారంలో ఉన్నవారికి) ఊడిగం చేయక తప్పదు… మరి ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు ఎవరు చెబుతారు. ఎవరు సరిదిద్దుతారు… ఈ మొత్తం కథ అంతా నలుగురు గుడ్డివారు ఏనుగు రూపాన్ని వర్ణించిన చందంగా తయారు కాలేదా… ఇపుడు పత్రికలు, మీడీయా చెప్పేది ఎవరు నమ్ముతారు.

 

మామాట: మెడపై కత్తిపెట్టి వార్తలు రాయమంటున్నారు…  గతంలో ఇలాఅన్నవారు ఏమైనారో తెలియదా?

 

Leave a Reply