పత్రికలు -ప్రశ్నించని వైనాలు

Share Icons:

 

తిరుపతి, ఆగష్టు 09, 

ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం..

అన్నారు శ్రీశ్రీ. ఇదే వాక్యాన్ని అదే స్ఫూర్తితో నేటి పత్రికలకు అన్వయించవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా మీడీయాపై నమ్మకం కోల్పోతున్న సందర్బాలే  ఇటీవల కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా పాత్రికేయులకు దేశభక్తే లేదని అధ్యక్షులు ట్రంప్ అబిప్రాయపడ్డం తెలిసిందే కదా. ఇక మన భారతంలో రాజకీయనేతలతో సమానంగా అక్రమాలకు పాల్పడుతున్న పాత్రికేయులు, మీడియా సంస్థల గురించి అందరికీ తెలిసిందే. గొంగట్లో తింటు న్నట్టుంది.. పరిస్తితి, పాత్రికేయ జీవితమూనూ.

గురువారం(09.08.18) కూడా నాలుగు ప్రధాన తెలుగు పత్రికలు తమిళనేత మహాప్రస్థానంతో నిండిపోయాయి. పత్రికలలో వార్తలు చదువుతున్నపుడు కొంత అసహనం ఉంది. ఈనాడు వంటి పత్రికలో సంపాదకీయం రాస్తూ విరామమెరుగక పరిశ్రమించిన వ్యక్తి విశ్రమించిన చోటు ఇది అంటూ కరుణానిధి రాసుకున్న వాఖ్యాలు, నిన్న ఆయనను ఖననం చేసిన శవపేటికపై చెక్కిన విషయాన్ని ప్రముఖంగా పేర్కొనడం ఆవేదన కలిగించింది. జన్మించిన వారు మరణించే వరకూ విశ్రమించక శ్రమించే వారే కదా, ఎవరు ఊరకే కూచుని, కాలు కదపకుండా తిని, నిద్రిస్తూ ఉంటారు? రాజకీయంగా ఎదుగుతూ, ప్రజాసేవ పేరుతో అధికారానికి ఎగబాకి, సమయానుకూలంగా విధానాలు మార్చుకుని, వ్యతిరేకించిన వారితో పొత్తులు పెట్టుకుని, తద్వారా పదవులు అనుభవించి, అపారంగా సంపాదించిన నేతలే విరామవెరుగక శ్రమిస్తే, మరి రక్తాన్ని చెమటగా చిందించే కార్మికులు… కర్షకులు… పొట్ట కూటికి ఒళ్లమ్ముకుని కుమిలి, కుళ్లిపోతున్న జీవులు ఏంచేస్తున్నట్టు. వారి జీవనగతినేమనాలి? కరుణానిధి వాఖ్యలు పూర్తిగా కవితాత్మకం. వాటికి విలువ అంతే. దానిని గొప్పగా చిత్రించడం సినిమా నటులు కళాసేవ చేస్తున్నా రంటూ చేసే పొగడ్తలాగే ఉంటుంది. వెగటు కలిగిస్తుంది.

సాక్షి పత్రికలో ఎందుకో నింగికేగిన నిధి అనే శీర్షిక పెట్టారు. అవును కరణ నిధి, కుటుంబానికి నిధిని సమకూర్చారు. ఒక్క కరుణానిధి కారణంగా కరుణ-మారన్ కుటుంబాలు నేడు ఆసియాలోనే ధనవంతుల జాబితాలో ఉన్నాయి. వారికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు సమకూరడానికి వారికున్న నిధి ఏమిటి? అని పత్రికలు ప్రశ్నించ వలసిన పనిలేదా…? ఉచిత టీవీలు ఇచ్చారు, పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు అంటే సరిపోతుందా….! అవన్నీ కూడా నిజాయితీగా చేయలేదు. గెలుపుకోసం పంచిన తాయిలాలుగా వాటిని చూడాల్సి  ఉంటుంది. పదవిలో ఉంటేనే కదా  తమ పాచిక పారేది… అందుకు ప్రజాధనంతో ఉచితాల ఎరవేయడం విజ్ఞులైన నేతలు చేయరు.  

 

కరుణ నుంచి మనం గ్రహించ వలసింది ఏమిటి!? డికె, డిఎంకే పార్టీలు గత 70-80 సంవత్సరాలుగా ప్రవచించే ఏ సిద్దాంతం కూడా కరుణ కుటుంబం ఆచరించలేదు. దేవుడు లేడు అని వాదించే కరుణ సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు నిత్యం గుడులు, గోపురాలు తిరుగుతూ, యజ్ఞాలు, యాగాలూ చేయిస్తుంటారు. మూఢనమ్మ కాలపై ఒంటికాలిపై లేచే కరుణ పసుపు రంగు కండువానే ఎందుకు ధరిస్తారు. పగడపు ఉంగరమే వేసుకుంటారు ఎందుకు?

ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి చట్టాన్ని గౌరవించ వద్దా, గోపాలపురంలో ఇల్లాలు, సిఐటి నగర్లో ప్రియురాలు అంటే చెల్లుతుందా… ఇలా మన ఇంట్లో ఎవరైనా చేస్తామంటే మనం అంగీకరిస్తామా… పత్రికలు, మీడియా దీనిని కరుణ స్వవిషయం అని వదిలిపెట్టడం సమర్థనీయమా. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా ఒక భార్య ఉండగానే మరో స్త్రీతో సహజీవనం చేస్తానంటే చట్టం, నిబంధనలు అంగీకరిస్తాయా. భారతీయ శిక్షాస్మృతి ఏం చెబుతోంది. మరి ఇన్ని విషయాలలో వైవిధ్యమున్న నేతను ప్రజలు ఎలా అంగీకరించారు. ప్రజలు అంగీకరించారు కనుక అంతా సవ్యంగా ఉన్నట్టేనా… అదే ప్రజాస్వామ్యమా? పత్రికలేం చెబుతాయి?

మామాట:  జనతకు దారిచూపే విజ్ఞత నేడు పత్రికలకున్నదా..!

Leave a Reply