కరుణాస్తమయం- తెలుగు మీడియా అత్యుత్సాహం

Share Icons:

తిరుపతి, ఆగష్టు 08,

 

దక్షిణభారతంలో తిరుగులేని రాజకీయ నేత. ద్రవిడ ఉధ్యమసారథి, మానవతా వాది, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తవేల్ కరుణానిధి మంగళవారం 07.08.2018 సాయంత్రం 6.10 గంటలకు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. దీనితో ఒక శకం ముగిసింది. బుధవారం (080818) తెలుగు దినపత్రికలన్నీ మొదటి పుటతో సహా మూడు నాలుగు పుటలు కరుణానిధి వార్తలతో నింపడం గమనించవచ్చు. నమస్తే తెలంగాణకు కూడా మినహాయింపులేదు.  ఏమిటి ఏ వైనం?

నిస్సందేహంగా కరుణానిధి జీవితం ప్రభావవంతమైనదే. రాజకీయంగా ఆయన సాధించిన విజయాల కారణంగా ఆయన దేశరాజకీయాలను ప్రభావితం చేసినవారే కావచ్చు… కానీ, కరుణ గానీ, జయలలిత గానీ మరణించినపుడు, చికిత్సకోసం ఆసుపత్రిలో ఉన్నపుడు తెలుగు మీడియా ముఖ్యంగా.. టీవీ లు వ్యవహరించిన తీరుపై సామాన్యులలో పలు అనుమానాలున్నాయి. ఎందుకు స్వంతనేత మరణించినంత హడావుడి చేస్తున్నారు తెలుగు మీడియా ?అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ఇదే రీతిలో కర్నాటక, కేరళ నేతలు మరణించినపుడు తెలుగు మీడియా ఇంత తీవ్రంగా స్పంధించిందా? అన్నది సామాన్యుని ప్రశ్న. దీనికి బదులు చెప్పవలసిన బాధ్యత తెలుగు మీడియాకు ఉంది. కేవలం సందర్బానుసారంగా మానవబలహీనతలను పెంచి, టీఆర్ పీ రేటింగ్ పొందాలనుకునే వ్యాపార సూత్రమే నా ఇది… లేక మరేదైనా కారణం ఉందా? అన్నది వెలుగు చూడాలి. జయలలిత మరణం సమయంలో తెలుగు టీవీలు రోజుల తరబడి రేయింబవళ్లు ఆసుపత్రి ముందు ప్రత్యేక ప్రధినిధులను నిలిపి లైవ్ కవరేజీ ఇవ్వడం వివాదాస్పదమైంది. సరే. జయలలిత తెలుగు సినిమా నటి, ఆ కోణంలో గాని, వివాదాస్పద రాజకీయ నేపథ్యం కానీ మరణ సమయంలోని నాటకీయత గానీ మీడియాను ఆకట్టుకున్నట్టు భావించినా, కరుణానిధి ఆసుపత్రిపాలైన రోజు నుంచీ మళ్లీ తెలుగు ఛానళ్లు వరుస బులెటిన్లతో హడావుడి చేయడం విమర్శలనెదుర్కొంది. టీవీలు సరే,  పత్రికలు కూడా వాటితో పోటీ పడి కవరేజీ ఇవ్వడం వెనుక కారణాలు ఖచ్చితంగా ఆలోచించవలసినవే.. తెలుగు వారికి తమిళ నేలకు చాలా దగ్గర సంబంధం ఉంది అందుకే ఇంత కవరేజీ అని ముక్తసరిగా చెప్పడానికి కుదరదు… ఈ వాదన ఇతర ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది కానీ అక్కడి వ్యవహారం వేరుగా ఉంది. తమిళనాడు నుంచి తెలుగు వారు పాలనాపరంగా వేరుపడడం వెనుక కారణాలు ఈ నాటి మీడియామిత్రులకు తెలుసా… ఎందుకు తెలుగువారు తమిళనాడు నుంచి విడిపోయి, స్వంత రాష్ట్రం కావాలనుకున్నారు? తమిళనాడు నుంచి విడిపోయినపుడు తమిళ పెద్దలు తెలుగు వారికి చేసిన అన్యాయం ఏమిటి ? ఎన్ని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మనకు దక్కకుండా పోయాయి? చెన్నపట్టణం ఎందుకు చెన్నైగా మారింది? దీని వెనుక ఉన్న చారిత్రిక, రాజకీయ కారణాలు ఏమిటో ఇప్పటి తరానికి తెలుసా? విభజన తరువాత తమిళనాడులో తెలుగు భాషను, సంస్కృతిని, జీవన విధానాన్ని తమిళ రాజకీయ నేతలు ఎంత పకడ్బందీగా నిర్వీర్యంచేశారో మనకు తెలుసునా1953లో తమిళనాడు విభజన జరిగితే 2018 నాటికి అక్కడే ఉన్న తెలుగు సంతతి పడుతున్న మనో వేధన తెలుగు పత్రికలకు, మీడియాకు ఎరుకలో ఉందా? ఈ మొత్తం పరిణామాల వెనుక ఉన్న పెద్దాయన కరుణానిధి కాదా…? కరుణ మూలాలు తెలుగే అని మనం చంకలు కొట్టుకోవడంమే కానీ, అక్కడ త్రిభాషా సూత్రాన్ని నిలువుగా పాతేసి, పాఠశాలల్లో తెలుగు చదువుకునే వీలు లేకుండా, తెలుగు వారు తమ మాతృభాషను మరచిపోయేలా చేసిని నిర్ణయాలలో జయలలిత-కరుణానిధి పోటీ పడిన మాట వాస్తవం కాదా? తమ పదవీ లాలసతతో తమిళనాడులో తెలుగువారి మనుగడనే ప్రశ్నించే పరిణామాలకు బీజం వేసిన రాజకీయ నాయకుల పట్ల తెలుగు మీడియా ఎందుకు ఇంత ఉదారంగా వ్యవహరిస్తోంది?  అందుకే మీ జాతీయత ఏమైంది అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.

ఇదే కాదు ఎన్ టి ఆర్, ఏ ఎన్ఆర్, వైఎస్ ఆర్ వంటి  తెలుగు నేతలు, నటులు  మరణించినపుడు, చివరకు సత్యసాయి పోయినపు డైనా తమిళమీడియా ఇలాగే ఆసక్తి చూపిందా, పేజీలకు పేజీలు సమాచారం ఇచ్చిందా? అన్నది సామాన్యుని అనుమానం. మరి పొరుగు వారిపై వారికి లేని ఆసక్తి మనకు మాత్రమే ఎందుకు? అన్నది వీరి ప్రశ్న.

మీడియా కేవలం సమయానికి తగు మాటలాడు రీతిలో ఏది ప్రజలకు క్యూరియాసిటీ కలిగిస్తుందో దానినే అనుసరిస్తుందనే సాధారణ సూత్రం ఇక్కడ వర్తిస్తుందా? లేక తమిళనాడును వదిలిపెట్టినా మనలో వారి పట్ల సానుకూలత పోలేదా…? ఇంకా భావ దాస్యమేనా?

అయినా కరుణానిధి మృతి తెలుగు వారికి ఎందుకు క్యూరియాసిటీ కలిగించాలి? ఏతా వాతా తమిళనాడు సరిహద్దుల్లో ఉండి, తమిళభాషా ప్రభావం ఉన్న రెండు మూడు జిల్లా ప్రజల్లో కొంత వరకు ఆసక్తి ఉండవచ్చు.. ఎందుకంటే ఈ జిల్లాల్లో తమిళభాషా ప్రజలుంటారు కనుక దానికోసం సంబంధిత జిల్లా పేజీలలో వార్త ఇచ్చుకోక మెయిన్ లో మూడు నాలుగు పుటలు వివరంగా వార్త ఇవ్వడం వెనుక ఉన్న మతలబు కేవలం భావదాస్యమేనా లేదా మరేమైనా ఉందా. తెలుగు పత్రికల వైనం ఏమిటో ఎవరికి తెలుసు..

 

మామాట:  మరణాన్ని కూడా వ్యాపారానికి వాడుకునే నైజమా… ఇది?

Leave a Reply