నిరుద్యోగలంచం..?

Share Icons:

తిరుపతి, ఆగష్టు 03,

రాష్ట్రానికి ఇది ఎన్నికల సంవత్సరం. ఈ ఏడాదంతా నేతలు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి, అందుకు ఏ ఎత్తులు వేయాలి అనే ఆలోచిస్తూ ఉంటారు. రాజకీయాలు గెలుపు –ఓటమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓడిపోయిన నేతల వద్దకు ఎవరూ రారు. నిన్న అధికారంలో ఉన్నపుడు కటౌట్లకు పాలాభిషేకాలు చేసినివారే ఓడిపోయి, పదవి కోల్పోయినపుడు పిలిచి గుక్కెడు కాఫీ కూడా పోయరు. అధికారంలో ఉన్నవారికి ఈ సత్యం బాగా తెలుసు. అందుకే వారు పదవి నిలుపుకోవాలని, అది లేనివారు ఎలాగైనా పదవిలోకి రావాలనీ తాపత్రయపడుతూ ఉంటారు. ఇదే రాజకీయం.

అధికారంలోకి రావాలంటే ప్రజలు ఓట్లు వేయాలి కదా, వారు ఎందుకు వేస్తారు. వేయకుండా ఉండడానికి వారి కారణాలు వారికుంటాయి. అందువలన తమకు ఓట్లు వేసేవారిని ఏర్పాటు చేసుకోవడమే రాజనీతి. అందుకు తమ డబ్బు ఖర్చుపెట్టకూడదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చి, తామేదో వారిని ఉద్దరిస్తున్నామనే కల్పనలో ఉంచడం తాజా విధానం. దీనిని ప్రజల పక్షాన నిలిచి పోరాడవలసిన పత్రికలు పట్టించుకోకపోవడమే విషాదం. రాజకీయాలు అధికారం కోసమే అని తెలుసు కానీ పాత్రికేయం కూడా అధికారంకోసం వినియోగించబడడం నేడు మనం చూస్తున్నాం.

ఈ శుక్రవారం 03.08.18 తెలుగు దినపత్రికలు చూడండి మీకే తెలుస్తుంది పత్రికలు నడుస్తున్న వైనం ఏమిటో… ఈనాడు.. పతాక శీర్షికలో నిరుద్యోగుల నేస్తం అంటూ ప్రభుత్వం ప్రకటించిన ప్రతినెలా రూ. 1000భృతి వార్తనిచ్చింది. అదే విషయాన్ని సాక్షి పత్రిక రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు, 12 లక్షల మందికే భృతి అని వార్త రాసింది. ఇక ఆంధ్రజ్యోతిలో దీనిపై  నిరుద్యోగులకు యువనేస్తం అంటూ వార్త వేశారు. ఇవి చూసినపుడు ఏమనిపిస్తుంది. ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారు. అలా చేస్తున్నవారికి సహకరిస్తున్నవారు ఎవరు అన్నది తెలుస్తోంది.

ఇవ్వాళ సామాజిక మాధ్యమాలలో ఒక సెటైర్ చక్కర్లుకొడుతోంది… అదే మంటే… బాబు వస్తే జాబు వస్తుందన్నారు… నిరుద్యోగ భృతి నివ్వడం ద్వారా ప్రభుత్వం 12 లక్షల మందికి రూ. వేయి ఉద్యోగం ఇచ్చిందని వెటకారం. మన పాలకుల ఆలోచనల తీరును తాజా పథకం చక్కగా చెబుతోంది. రాష్ట్రంలో ఏటా ఎందురు డిగ్రీ, డిప్లోమో, పీజీ చదువులు పూర్తిచేసుకుంటున్నారు. మధ్యలో చదువులు ఆపివేస్తున్నది ఎంత మంది. వీరికి ఉపాధి చూపడం ఎలా, ఇపుడు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎందరు స్వయం ఉపాధి గానీ, అసంఘటిత రంగాల్లో గానీ పనికి కుదురుతున్నారు. అన్న గణాంకాలు పాలకుల వద్ద లేనట్టుంది. ఎన్నికల వేళ 12 లక్షల కొత్త ఓటర్లను సృష్టించుకోవడం, ఉన్న ఆరేడు మాసాలు వారికి నెలా రూ. వేయి వంతున ప్రభత్వ ధనం చెల్లించడం, మాకే ఓటు వేయండి మేమే గెలిస్తే మళ్లీ మీకు ఇంకా ఎక్కవ ఇస్తాం అని చెప్పడం, నిరుద్యోగులను ఊరించడం, కొత్తవారిని ఆకర్షించడం ఈ పథకం ఉద్దేశం కాదా… ? ఒక్కో ఓటుకు రూ. 6 వేలు (సుమారుగా) చెల్లిస్తున్నట్టు కాదా? అది లంచం ఇచ్చినట్టు కాదా? ఈ రోజుల్లో నిరుద్యోగికి నెలకు రూ. వేయి ఎందుకు సరిపోతాయి, ఒక్కరోజు తాగుడు ఖర్చుకు తప్ప. ఇదా ప్రభుత్వం చేయవలసిన పని… ? దీనిని పత్రికలు ప్రశ్నంచకపోవడం దారుణం కాక మరేమిటి..? ఈ వార్త నిరుద్యోగులకు నేస్తం ఎట్లా అయ్యింది?

తెలంగాణ విషయానికి వస్తే నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పుటలో.. స్థానికోత్సాహం , జోనల్ వ్యవస్థకోసం ఢిల్లీకి కేసీఆర్, త్రిముఖవ్యూహం, కాళేశ్వరమే ఎందుకు అన్న వార్తలిచ్చింది. ఇవేవీ ప్రజా సమస్యలను ప్రతిబింభించేవి కాదు. పాలకులకు డప్పుకొట్టేవే…

మామాట : ప్రభుత్వాలు.. పత్రికలు ప్రజలను మోసగించే పని మొదలు పెట్టాయా?

Leave a Reply