పత్రికలు ఎవరి పక్షం?

Share Icons:

తిరుపతి, ఆగష్టు 02,

Media organizations face a new challenge: that of globalization, which has brought with it business conglomerates that control the Press. The result — profits are given more importance than journalistic ethics and people are losing faith in the Fourth Estate.  

పత్రికలు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలి. ప్రజల ఆశలు ఎలా ఉన్నాయి.. వాటి మేరకు నడుచుకోవడం ధర్మమవుతుందా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మందనీతి ఉంటుంది. ఎక్కువ మంది ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. కర్ర ఉన్నవానిదే బర్రె అనే నీతిసూత్రం ప్రజాస్వామ్యానికి సూత్రం.  అట్లా చూచినపుడు ఎక్కవ మంది లంచం తీసుకుంటున్నారు కనుక అవినీతిని అంగీకరిద్దామా అన్నది ప్రశ్న.

ఇదంతా ఎందుకు అంటే… మంచి దారి ఏమిటో ప్రజలకు ఎవరు చెబుతారు. పాఠశాలల్లో ఇపుడు నీతి పాఠాలు చెప్పడం లేదు. అంతా రుబ్బుడు వ్యవహారం. పరీక్షల్లో మార్కులు తెచ్చే ప్రశ్నలను ముందుగా ఊహించి, వాటినే ఏడాదంతా బట్టీయం వేయించి, పరీక్షలో ఏ ప్రశ్న వచ్చినా సమాధానం అవును-కాదు అని ఏదో ఒకటి గుర్తు పెట్టే విధింగా పిల్లలను తీర్చిదిద్దడమే ఈ నాటి చదువుల సారం. అందువలన బడిలో సత్కర్మలు వంటబట్టడం లేదు. ఇక కుటుంబ జీవనంలో, సామాజిక స్రవంతిలో ఎదురౌతున్న సంఘటనల కారణంగా చిన్నతనంలోనే మంచి తనం అంటే చేతకాని తనం అనే భావన భావి భారతపౌరులలో ఏర్పడుతోంది. ఇది వాస్తవ దృశ్యం.

మరి పత్రికలు మాత్రమే మంచి మార్గంలో నడవడం ఏమిటి. అలా ఎలా కోరుకుంటాం. సమాజ జీవనంలో పై నుంచి దిగువ వరకు సర్వం స్వలాభాపేక్షతో నిండిన సమయంలో ఒక్క పత్రికారంగం, పాత్రికేయులు మాత్రమే నీతి నియమాలు కలిగి పలుకడిగిన ముత్యాలుగా మెరవాలంటే ఎలా సాధ్యమౌతుంది. అంతటి సచ్చీలురు ఇపుడుండారా…. అట్లా కాక లోకం పాడైపోయింది కనుక మీడియా కూడా పాడైపోతే ఫరవాలేదు అనుకుందామా..

గురువారం (02-08-18) నాలుగు తెలుగు ప్రధాన దినపత్రికలు చూడండి. వార్తల్లో వైవిద్యం కనిపిస్తుంది. ఈనాడు మొదటి పుటలో ఎస్సీ, ఎస్టీ చట్టానికి పదును, చౌక బియ్యం అమ్మితే కార్డుకోత వంటి వార్తలు వేశారు. తరువాత ఏపీకే ఓటు అని పోలవరం కేసుల వివరాలతో వార్త ఉంది . అది కాక నాకే రాజకీయాలు నేర్పుతారా వంటి వార్తలున్నాయి. సాక్షి పత్రికలో ఓట్లకు రెక్కలొచ్చాయ్, 108 ఉద్యోగులపై సర్కారు కక్షఅనే వార్తలతో పాటుగా యూ-టర్న్ దేశం ఎదురుదాడి నిలువెత్తుమోసంపై నిందల ముసుగు వార్త ఐటీ పేరుతో లూటీ వార్తలు ఇచ్చారు. కుట్ర రాజకీయాలు చేస్తే వదలం అని సీఎం వాఖ్యలను ప్రచురించారు. ఆంధ్రజ్యోతిలో ఎస్సీ ఎస్టీ చట్టం యథాతథం అనే వార్తను తోక ముడిచిన జగన్ అనే వార్తను ప్రముఖంగా ప్రచురించారు. అటు పక్కగా అయ్యప్ప స్వామికి హక్కుల్లేవా అనే వార్త ఇచ్చారు. దిగువన రాజకీయ కాక అంటూ రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయవేడి పై కథనం ప్రచురించారు.  ఇవి ఇలా ఉంటే నమస్తే తెలంగాణ పత్రిక  రాష్ట్రానికి పచ్చతోరణం అని పతాక వార్తనిచ్చింది. మరో పక్క ఎస్సీ ఎస్టీ యథాతథం అంటూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయాన్ని ప్రచురించింది.  ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు,  పరిశ్రమలకు పునర్జీవనం అనే పాలకపక్షపాత సమాచారాన్ని ప్రదర్శించారు.

ఇవన్నీ చూసినపుడు ప్రజలకు పత్రికలపై విశ్వాసం పోతోందన్న వాదనలో విపరీతం ఏమీ లేదనిపిస్తోంది. ఏపీ లో నేటి నుంచి పంచాయితీ అధ్యక్షుల పాలన ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు పలు కుంటి సాకులతో ఎన్నికలు నిర్వహించకుండా దాటవేస్తు, గ్రామాలలో ప్రత్యేకాధికారుల పాలనను తీసుకువచ్చింది. మరి, తెలుగు పత్రికలు దీనిని ప్రశ్నించాయా. ప్రజాపాలన లేని రోజున ప్రజాస్వామ్యానికి విలువ లేదని పాలకులకు గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాయా? …. ఎన్నికలు వాయిదా వేసి, అనుకూల వర్గాలతో పాలన నడిపిచే విధానానికి మొగ్గు చూపిన ప్రస్తుత రాష్ట్రపాలకులను పత్రికలు నిలదీయడం పోయి, గతంలో ప్రత్యేకాధికారులు ఎపుడెపుడున్నారో వివరాలు ప్రచురించారు. తద్వారా ప్రతిపక్షం నోటికి తాళం వేసేందుకు సహకరించారు. ఇదే నా పత్రికలు వ్యవహరించవలసిన వైనం.

 

మామాట: ప్రజల పక్షం వహించే పత్రికలునేడున్నాయా…

Leave a Reply