తిరుపతి, జూలై31,
పత్రికలు పారదర్శకంగా లేకపోతే ఎవరికి నష్టం?
ఎందుకు పత్రికలను ఫోర్త్ పిల్లర్ అన్నారు. నాలుగో స్థంభం కదిలి, కూలుతుంటే ప్రమాదం ఎవరికి?
రాజరికాలు, నియంతల పాలనా అంతరించి, ప్రపంచ ప్రజలకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం మంచి చేస్తుందని, ప్రజా స్వామ్యంలో రాజ్యాంగం సర్వోన్నత మార్గదర్శిగా పౌరహక్కులను కాపాడే బాధ్యత తీసుకుంటుందనీ, పాలకులు కేవలం రాజ్యాంగ పరిధిలో పరిపాలన చేయడం ద్వారా స్వంత అభిమతాలను ప్రజాబాహుల్యంపే రుద్దరనీ మన ముందు తరం పెద్దలు ఆశించారు. అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ తరువాత వచ్చిన మేధావులు ఈ రాజ్యాంగానికి కూడా మంద బలంతో సవరణలు చేసి, తొలినాటి స్ఫూర్తిని నీరుగార్చి, సమయానుకూల రాజకీయాలను మన నెత్తికిరుద్దారు.
మంగళవారం తెలుగు దిన పత్రికలు చూస్తే ఈ విపరీతం అర్థం అవుతుంది. ఈనాడులో పైన రావాల్సింది రూ. 1,45 లక్షల కోట్లు, ఇస్తున్నది రూ. 22వేల కోట్లు అనే వార్త ఉంది. ఎవరు ఎవరికి ఇస్తున్నారు? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. శ్రీ నరేంద్ర మోదీ మరో శ్రీ చంద్రబాబు గారికి తన కోటు జేబులో ఉన్న డబ్బు ఇవ్వడం లేదు. భారత రాజ్యాంగం మేరకు యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలకు పన్నులలో వాటా పంపిణీ చేయాలి ఇందులో ఒకరి దయా ధర్మం ఏమిటి? ఇది ప్రజల ఆత్మగౌరవ సమస్య. రాష్ట్రాలు కేంద్రం వద్ద భిక్షమెత్తడం లేదు. ముఖ్యమంత్రులు అనుకూలంగా ఉంటే ఒకలా, లేకపోతో మరోలా వ్యవహరించడానికి. కేంద్రం మోదీ జాగీరు కాదు. కానీ మన దురవస్థ ఏమిటంటే.. కేంద్రప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా విడుదల చేయించే భారీ ప్రకటనల కోసం పత్రికలు కేంద్రంలో పాలనలో ఉన్న పెద్దలతో వైరంఎందుకని గట్టిగా అడగడం లేదు. నిలదీయడంలేదు. పైగా కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారిచేత వ్యాసాలు రాయించి, ప్రచురించి వారి మెప్పు పొందుతుంటాయి. ఎందుకు? అంతటి వ్యాసం రాసే నిపుణులు బయటలేరా…! నిజానికి సదరు నేతల పేరుతో వస్తున్న వ్యాసాలు ఆ నేతలే స్వయంగా రాస్తున్నారా …
అలాటిదే ఇంకో వార్త కాపుకోటాపై పోరాడండి… షెడ్యూలో 9లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచండి... అనేది. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒత్తిడి చేస్తే కేంద్రం రాజ్యాంగానికి సవరణచేయాలా?… రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని నీరుగార్చుతారా?… ఇవేవీ పత్రికలు ప్రశ్నించడం లేదు ఎందుకని? పత్రికలు పదవిలో ఉన్న నాయకుల నీడలు గా మారిపోయినందు వల్లా… అనుకోవడంలో ఆశ్చర్యం ఉందా…. ?
సాక్షి పత్రికను చూడండి… ప్రభుత్వం నుంచీ ప్రకటనల కోసం చూడ్డంలేదు కనుక మొత్తం విమర్శనాత్మక వార్తలే ఉన్నాయి. ప్రజాధనంతో సొంత ప్రచారమా. ఫీజులుం భరించలేం.. తేలని పంచాయితీ, చెంచుల భూముల్నీ చెరబట్టారు, పండుటాకులకూ పెన్షన్ తీసేస్తారా…ఇలా సాగింది వార్తా సమాహారం. ఆంధ్రజ్యోతిలో కంపెనీలు క్యూ, వా తలైవా వావా, పంచమంటే ముంచారు, కేంద్ర వైఖరితో రూ.20 వేలకోట్లు నష్టం, బీజేపీ ద్రోహాన్ని నిలదీయాలి అన్న సరళిలో వార్తలు ప్రచురించారు. ఒక తెలుగు పత్రికకు రాష్ట్రంలో అన్నీ అరాచకాలు, అక్రమాలే కనిపిస్తే… మరో దానికి అంతా సవ్యంగా ఉన్నట్టు తోస్తోంది ఎందుకని?
నమస్తే తెలంగాణలో అడ్రసు లేని జనం 40లక్షల మంది, సింహం సింగిల్ గానే వస్తుంది, శకున పక్షుల శంకలు, ఐదు పట్టణాలకు ఔటర్ తళుకులు వంటి వార్తలు మొదటి పేజీలో ఉన్నాయి. ఇక్కడ కూడా సదరు పత్రికకు ప్రభుత్వం నుంచీ ప్రకటనలు రావు అనే భయం లేదు (పత్రిక ప్రభుత్వ పెద్దల కనుసన్నలలో నడిచేదే కదా) అందుకని విమర్శించేవారిని శకున పక్షులు అనగలిగారు. పత్రిక ప్రతిపక్షాలకు ఇస్తున్న విలువ ఇది… ఇకేం చెబుదాం.
మామాట: పత్రికలను తమ మాట వినేలా చేసుకోవడంలో నేతలు విజయం సాధించారా!