పత్రికల వికృతి క్రీడ

Share Icons:

తిరుపతి, జూలై 26 ,  గురువారం 26 వతేదీ తెలుగు దినపత్రికలలో వార్తలు  ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టున్నాయి. ఈనాడు పత్రికలో ఇమ్రానే కెప్టెన్ అని, అర్హత లేని వైద్యం – అంతా అనర్థం అంటూ మున్నాభాయ్ లే అనే వార్తనిచ్చారు. సాక్షిలో  పతాక వార్తగా గనుల తవ్వకంలో అవినీతి గురించీ అవినీతికి పరాకాష్ట అనే వార్త రాశారు. తరువాత జగన్ అనే నేను అంటూ జగన్ పర్యటన వివరాల వార్త ప్రచురించారు. ఆంధ్రజ్యోతిలో 25 కోట్లు… 2500 పింఛన్లు అనే ప్రధాన వార్త ఇచ్చి, దాని పక్కన ఉప్పెనలా దాడి చేస్తా, తేడా వస్తే తోలు తీస్తా అని పవన్ వర్యటన ప్రసంగాలను ఉటంకించారు. నమస్తే తెలంగాణలో గజ్వేల్ లో హరిత పండుగ అంటూ పెద్ద వార్త రాశారు. ఇట్లా నాలుగు తెలుగు పత్రికలు కూడా నాలుగు  రకాలుగా వార్తలను ప్రచురించాయి. రాష్టంలో గనుల అవినీతిపై హైకోర్టు ధర్మాసనం వేసిన ప్రశ్నలు పత్రికలు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఆ వార్తకు, ఆ అంశానికి ఈనాడు, జ్యోతి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు. నిజానికి ఈ రెండు పత్రికలు మైనింగ్ అక్రమాలపై ఒకప్పుడు పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువరించాయి. మరి నేడు ఆ అంశాన్ని ఎందుకు విస్మరిస్తున్నాయి. హైకోర్టు ధర్మాసనం అడుగుతున్న రీతిలో కూడా పత్రికలు అక్రమార్కులను ప్రశ్నించడం లేదు ఎందుకు.  ఒక్క సాక్షి పత్రిక మాత్రమే అక్రమ మైనింగ్ పై  వివరంగా వార్త ఇచ్చింది.

ఇట్లా పత్రికలు ఎవరి దారి వారిదే అన్న రీతిలో వార్తలను ఇవ్వడం ఇప్పుడే మొదలైందా… లేక గతంలో కూడా ఉండేదా.. అప్పటికి ఇప్పటికీ వార్తారచనలోగాని, వార్తల ఎంపికలో గాని వచ్చివ మార్పును గమనించాల్సి ఉంది. సీనియర్ పాత్రికేయులు దీనిపై దృష్టి సారించ వచ్చు. తులనాత్మక వివేచన చేయవచ్చు.

నమస్తే తెలంగాణ పత్రికను ప్రచురిస్తున్నది ఎవరు?  పత్రిక మొదటి పుటలో పైన  మనరాష్ట్రం- మన పత్రిక అని ఉంటుంది. అంత వరకూ బాగానే ఉంది. మరి మన రాష్ట్రంలో ప్రజాసమస్యలు ఏవీ లేవా… లేక సంపాదకులకు కనిపించవా… ? తెరాసా పాలనలో తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా ఉంది. పుణ్యం కోసం భిక్షవేద్దామన్నా వేయించుకోవడానికి బిక్షగాడు దొరకడంలేదు .. అందరూ నాలుగు పూటలా తిని సంతోషంగా ఉన్నారన్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే పత్రిక నడుస్తున్నట్టు కనిపిస్తోంది.

రెండో అంశం… పత్రికల్లో.. పలు వార్తలు వస్తున్నాయి. కనీసం జిల్లా టాబ్లాయిడ్ లలో స్థానిక సమస్యలు రాస్తున్నారు. అవి పరిష్కారమౌతున్నాయా… అంతే కాదు టీవీలు కూడా ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాలను ఇస్తున్నాయా… టీవిలలో వార్తలు చదువుతారు, చర్చలు పెడుతున్నారు. వార్తలు సరే.. దైనందిన వ్యవహారం.. కాలంతో పరుగు, ఎక్స్ క్లూజివ్ లోగో కావాలి… మరి చర్చలు దేనిపై సాగుతున్నాయి. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తున్నారా… టీవీ మాధ్యమానికి ఉన్న పరిమితి కారణంగా అవి రేటింగ్ కోసం తప్ప సమస్యలను పరిష్కరించే పని పెట్టుకోవడం లేదు. చివరకు మళ్లీ పత్రికలే ప్రజల బాగోగులు చూడవలసి ఉంది . కాని ఈ పత్రికలు కూడా పెట్టుబడి పెట్టినవారి ఇష్టానుసారంగా వార్తలు వండుకోవడం వలన అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు.

A newspaper is one of the best ways to keep up to date with the world around. It enriches one’s vocabulary and can help one grow interest in various topics and issues. It helps one take part in discussions as well as form clear opinions. It widens the scope of one’s knowledge and leads one to be a responsible member of the society. అని అంతర్జాలంలో ఒకచోట చూచినపుడు. మనసు పరిపరివిధాలుగా ఆలోచించింది. ఈ ఆంగ్లవాఖ్యాలు నేతిబీరకాయ లాగా ఉన్నాయేమో అనిపిస్తోంది. తెలుగు పత్రికలు ఈ పరిధిలో పనిచేయడం మానివేసి ఇప్పటికి  ఎంతకాలమైందో కదా… అదే ఆవేదన కలిగించే అంశం.

పత్రికలలో వార్తలు  రెండు విధాలుగా సమాజానికి ఉపకరించాలి. ఒకటి.. పరిపాలనకు సంబంధిచి, పాలకుల మంచి చెడ్డలు, నిర్ణయాలు, వ్యవహార శైలి ప్రజోపయోగ కరంగా ఉందా లేదా అన్నది. మొత్తంగా ప్రజా ప్రభుత్వం పనితీరును నిరంతంరం స్క్రూటినీ చేయడం. రెండవది ప్రజలలో ఆలోచన, వివేచన, విశ్లేషణ కలిగించి, విజ్ఞత పెంచి సమసమాజ స్థాపనకు వారిని సిద్దపరచడం. ఈ రెండు  నేడు పత్రికలు అనుసరించే వైనాలతో సాధ్యమవుతుందా అన్నది పెద్ద ప్రశ్న.

మామాట: పత్రికలు పెట్టుబడి దారుల ప్రియపుత్రికలుగా మారిపోయాయా…

Leave a Reply