అవిశ్వాస వైన వైనాలు..

Share Icons:

 

తిరుపతి, జూలై 21,  అదే.. అనుకున్నదే జరిగింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అవిశ్వాసంతో విపక్షాలు ఏం సాధించాయని అందరూ ప్రశ్నించుకుంటున్నారు. శుక్రవారం పార్లమెంటు సాక్షిగా జరిగిన నాటకం మొత్తం ప్రపంచం చూసింది. ఎవరు ఏమిటో విజ్ఞులైన ప్రజలు నిర్ణయించు కుంటారు. అయితే ఈ వార్తలను మన ప్రముఖ తెలుగు పత్రికలు ఎలా ప్రచురించాయో చూద్దాం. వాదన నినదించింది అవిశ్వాసం వీగింది అని ఈనాడు, వైఫల్యాలను కప్పిపుచ్చు కొనేందుకే బాబు యూటర్న్ అని సాక్షి, కేంద్రం పలాయనవాదం అని ఆంధ్రజ్యోతి  వార్తలిచ్చాయి.  ఇక నమస్తే తెలంగాణ పత్రిక విభజన హామీలు నెరవేర్చాలి  అనే పతాకశీర్షిక ఇస్తూ, దిగువన విశ్వాసమే అనే వార్తను ఇచ్చారు.

ఏపీ విభజన సమయం నుంచీ వస్తున్న విధంగానే.. నాలుగేళ్ల తరువాత కూడా పత్రికలు తమ ఇష్టానుసారం వార్తలు రాస్తున్నాయి, ఒక్కటీ వాస్తవం రాయడం లేదు. జరిగిన సంఘటన పూర్వాపరాలను వివేచించి విశ్లేషణ  జరిపి వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ధోరణి పత్రికలు మరచిపోయాయి.  విడిపోయి- ఎవరి దారి వారిదే అయినా రెండు తెలుగు రాష్ట్రాల వైఖరిలో మార్పు లేదు. వారిని దెప్పి వీరు వీరిని గిచ్చి వారు తమ స్వరాష్ట్రాలలో లాభం పొందాలనుకుంటున్నారు. లోపల అంతా కలిసే వ్యాపారాలు, వ్యవహారాలూ నడుపుకొంటూ ఉన్నా, పైకి పగలను, సెగలను ఎగదోసి ఇరు రాష్ట్రాలలో వైషమ్యాలు పాదుకొలుపుతున్నారు. ఇదే ధోరణిలో నమస్తే తెలంగాణ పత్రిక కూడా వార్తలను ప్రచురించడం దారుణం. వాస్తవాలు చెప్పడం ఎందుకు మరచిపోతున్నారో..

ఇందిరా గాంధీ హత్య తరువాత జరిగిన ఎన్నకల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తరువాత  దాదాపు 30 సంవత్సరాలకు తిరిగి ఇపుడే కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ స్వంతంగా ఉన్న ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వం పై తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఎందుకు…. నాలుగు సంవత్సరాలుగా మిత్రపక్షంగా ఉంటూ, గత ఎన్నకల్లో కలిసి పోటీ చేసిన పార్టీ .. ఎన్ డీఏ నుంచి విడిపోయి, దూరం జగరడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ సన్నివేశం రక్తి కట్టవలసిందిగానీ, అప్పట్లో ఎందుకో మోదీ ముఖం చాటేశారు.

చివరకు ఈ శుక్రవారం పార్లమెంటులో జరిగిన సంఘటనలు చూచినవారికి, శనివారం ఉదయం పత్రికల్లో వార్తలు చదువుతున్న వారికీ అయోమయమే తప్ప అసలు విషయం బోధపడలేదంటే అతి శయోక్తికాదు. నాలుగు ప్రముఖ పత్రికలూ తమ తమ వాదనను వినిపించాయే గానీ ఏ ఒక్కటీ అసలు నిజాలను రాయలేదు. అవిశ్వాసం ఎందుకు పెట్టారు. ఎవరు పెట్టారు. అవిశ్వాసం పెట్టిన వారు ఏమి కారణాలతో అశ్వాసం పెట్టారు. ప్రభుత్వం ఆ ఆరోపణలకు సహేతుకమైన జవాబులు ఇచ్చిందా. కేవలం సంఖ్యాబలంతో ఊకదంపుడు వాదనలతో నెట్టుకొచ్చిందా అన్నది ఎవరూ తేల్చలేదు. అవిశ్వాసం నెగ్గుతుంది అనుకున్నవాడు మూర్ఖుడు. పార్లమెంటులో ఎంపీల సంఖ్య పార్టీల బలాబలాలూ తెలిసినవారు అవిశ్వాసం వీగి పోతుందని ముందునుంచే అనుకుని ఉంటారు. అదే వాస్తవం కూడా, అయితే అవిశ్వాసం పెట్టిన పార్టీ కేవలం పార్లమెంటులో హడావుడి చేయడానికి మాత్రమే ఈ అస్త్రం ఎంచుకుందా…  ముఖ్యంగా అవిశ్వాసం చర్చలో భాగంగా పార్లమెంటులో కాంగ్రెస్ ప్రార్టీ లొసుగులు బయటపడ్డాయి. అంది వచ్చిన అవకాశాన్ని ఆ పార్టి నేత స్వయంగా ఎలా అపహాస్యం పాలుచేశారో జాతి మొత్తం తిలకించింది. నిజానికి ఈ విషయంలో నిందించవలసింది మీడియానే… రాహుల్ గతంలో కంటే ఎంతో మెరుగ్గా ప్రసంగించారు. ప్రధానిపై నేరుగా పలు ఆరోపణలు చేశారు. అయితే మీడియా ఆ అంశాలను పక్కన పెట్టి, ఏ మాత్రం బాధ్యతలేని సామాజిక మాధ్యమాలతో పోటీపడి రాహుల్ కౌగిలింతలపైనా, కన్నుకొట్టడంపైనా దృష్టినిలిపాయి. వాటికే వార్తల్లో ప్రధాన్యమిచ్చాయి. రాహుల్ చేసిన ఆరోపణలను అటు ప్రధాని కానీ ఇటు పత్రికలుగానీ పెద్దగా పట్టించుకోలేదు. ఒక సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వ నేతగా మోదీ వ్యవహరించలేదు. ఆయన పదవికీ స్థాయికీ దగిన విధంగా వ్యవహరించకపోగా పలు వెకిలి చేష్టలతో ప్రత్యర్థులను ఎకసెక్కం చేయడానికి పార్లమెంటును వాడుకున్నారు. ఆయన సంఖ్యాబలం ఇందుకు ఉపకరించిందా…..? ప్రధాని గానీ, హోం మంత్రిగానీ అవిశ్వాసం ప్రవేశ పెట్టిన వారు సంధించిన ప్రశ్నలకు సూటిగా బదులిచ్చారా.

రాజకీయంగా ఎవరు లాభపడుతారు అన్న విషయం పక్కనపెట్టి పార్లమెంటులో అవిశ్వాసం పై జరిగిన చర్చా సరళిని పత్రికలు పట్టించుకోకుండా, తమ తమ రాజకీయ నేస్తాల మనసులకు అనుగుణంగా వార్తలు వండి వడ్డించడం ద్వారా పాత్రికేయం ఎటువెళుతోంది అనే అనుమానాలకు నేటి పత్రికల వైనాలు బలాన్నిస్తున్నాయి.

 

మామాట : విశ్వాసావిశ్వాసాల విద్వేషాల విహ్వళ కేలీ కలాపం… ఎవరికి మేలు చేస్తుంది ?

Leave a Reply