అవిశ్వాసం దేనికి?

Share Icons:

తిరుపతి, జూలై 19,  విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది. ఈ నాలుగు సంవత్సరాలలో రాష్ట్రానికి కేంద్రం ఏమి చేసింది. ఇంకా ఏమి చేయాలి. చేయని వాటి వివరాలు, ఎందుకు చేయలేదో విశ్లేషణా ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి విభజన సమయంలో అప్పటి పాలక కాంగ్రెస్ పార్టీ ఏపీ కి తీరని అన్యాయం చేసిందని ప్రజలు భావించారు. ఆ ఫలితం కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో చవి చూసింది. ఇక ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపడంలేదనేది సగటు తెలుగుప్రజల అభిప్రాయం. ఇరు పార్టీలు ఇక్కడ-అక్కడ అధికారం పంచుకున్నాయి. పదవులు అనుభవించాయి. తాపీగా, పరస్పరం దూషించుకుంటున్నాయి. ఇదేమి చోద్యం. అడిగేవారు లేరు. కలిసి ఎన్నికల్లో పోటీచేసి, కలిసి పరిపాలన సాగించి ఇపుడు ఎందుకు అవిశ్వాసం చూపుతున్నారో…. ఎవరికీ అర్థం కావడంలేదు.

ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాలు కలిసి సాగిన తెలుగు దేశం-బీజేపీల కలహాల కాపురం కూలిపోయింది. అన్యాయానికి మీరంటే మీరని ఇరుపార్టీలు నేడు పరస్పరం నిందుంచుకుంటున్నాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టింది. ఈ తీర్మాణంపై గురువారమే పార్లమెంట్లో  చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై గురువారం నాలుగు తెలుగు ప్రధాన పత్రికలు తలో దారిలో వార్తరాయడం దారుణం. ఎరికీ రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధిలేదు. కేవలం రాజకీయ మైలేజీ పైనే ధ్యాస కనిపిస్తోంది ఈ వార్తలు చదువుతూ ఉంటే. ముఖ్యంగా పొరుగు తెలుగు సోదరుల సమస్యను నమస్తే తెలంగాణ పత్రిక పట్టించుకున్నట్టు కనిపించలేదు. వారు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడంలేదు. టిఆర్ఎస్ పార్టీగా రాజకీయాలు ఆలోచించడం సమంజసమే అనుకున్నా… ఒక పత్రికగా పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చి కేవలం కరపత్రంగా నమస్తే తెలంగాణ పత్రిక మిగిలిపోవడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కాదు. సమస్యను ఎత్తి చూపని పత్రిక దేనికి. వారైనా విభజన హామీల విషంలో ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అసత్యం ప్రచారం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేయవలసింది.

ఇక  తెలుగుదేశం ఇచ్చిన అవిశ్వాసం నోటీసు పై ఈనాడు అవిశ్వాసం రేపే అని, సాక్షి పత్రిక అదే బంధం అని, ఆంధ్రజ్యోతి పత్రిక సమరమే అని వార్తలిచ్చాయి. ఈ శీర్షికలు చూస్తే తెలుస్తుంది ఎవరు ఏం రాసి ఉంటారో. ఎందుకిలా పత్రికలు తమ ప్రాముఖ్యాన్ని కోల్పోయి కేవలం ప్రకటనల కోసం అర్రులు చాస్తున్నాయి. విషయాన్ని పక్క దోవ పట్టించి, తామనుకుంటున్నది వార్తగా ఛలామణి చేయించడానికి వర్తమాన పత్రికలు పూనిక వహించడం ఆందోళన కలిగించే అంశం. వార్త ప్రజోపయోగకరంగా ఉండాలి కానీ, తమ స్వరాజకీయ ప్రయోజనాలను కాపాడే తీరులో ఉండకూడదు. విభజన తరువాత జరుగుతున్నది ఏమిటి. పాలనలో ఉన్న తెలుగు దేశం, బీజేపీ పార్టీలు గతంలో చెప్పింది, ఇపుడు చేస్తున్నదీ సరైనదేనా అని పత్రికలు ప్రజలకు వాస్తవాలు చెప్పవలసి ఉంది. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తోందో కూడా పత్రికలు ఏకరువు పెట్టవలసిందే. కానీ తాజా వార్తల్లో ఈ వాస్తవాల ప్రస్తావన కంటే పరస్పరం బురద జల్లుకోవడం, ఇతరులు చల్లిన గబ్బును మరికొందరికి అంటించడమే ధ్యేయంగా వార్తారచన జరిగినట్లు గ్రహించవచ్చు.

మామాట: పత్రికలకు తరతమ  వ్యత్యాస భావనలుండవచ్చా…

Leave a Reply