ఆవూ దూడా -న్యాయం

Share Icons:

తిరుపతి, ఆగష్టు 1,

“నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది.

మరి అలాంటి జర్నలిస్టులు ఇవ్వాళ ఉన్నారా. జర్నలిజమ్ ఉంటే జర్నలిస్టులు కూడా ఉండేవారు. అందుకేనేమో నార్లవారు సంపాదకుడు అనకండు ఎడిటర్ అని పిలవ మన్నాడు. సంపాదించేవాడే నేడు సంపాదకుడు కదా ఇది ఆయన ముందే ఊహించినట్టున్నారు.

బుధవారం(01-08-18) పత్రికలు చూడండి మీకే తెలుస్తుంది. ఈనాడులో పతాకంగా కోటాపై రోజుకోమాట అనే వార్త ప్రముఖంగా ప్రచురించారు.  తరువాత ఎన్ ఆర్ సీ కుదుపు అనే వార్త ఉంది. దిగువన నేటి నుండి కొత్త ధరలు అంటూ ఒక వార్త ప్రచురించారు.

సాక్షి పత్రికలో పతాక వార్తగా కాపులకు రూ. 10 వేల కోట్లు అనే జగన్ ప్రకటన ఇచ్చారు. దానికి దిగువన మా ఎంపీలు రాజీనామా చేయరు అన్న చంద్రబాబు వాఖ్యలున్నాయి.

ఇక ఆంధ్రజ్యోతిలో  కాపు కోటాపై జగన్ వి రోజుకో మాట అనీ, వాస్తవం చెబితే వక్రీకరించాయనీ రెండు ప్రధాన వార్తలనిచ్చారు.  దానికి దిగువన 12.26 లక్షల మందికి నిరుద్యోగ భృతి అనే వార్తనూ ప్రచురించారు.

చివరగా నమస్తే తెలంగాణ పత్రికలో  దీపావళికి భగీరథ అనీ  కొత్తగా బీ హబ్  అనే కేటీఆర్ వార్త ఇచ్చారు. దిగువన సర్కారు బడులు సూపర్ హిట్ అనే వార్తను వేశారు.  ఇవీ స్తూలంగా నాలుగు ప్రధాన తెలుగు దినపత్రికల మొదటిపుటలలో ఉన్న ప్రధాన వార్తల శీర్షికలు. వీటిని పరిశీలించినపుడు నాలుగు పత్రికలూ వాటికి అనుకూలమైన వార్తలు వారు వేసుకున్నారు. విషయప్రాధాన్యత గానీ, ప్రజాప్రయోజనంగానీ వార్త ప్రాముఖ్యాన్ని నిర్ణయించడం లేదన్నిది స్పష్టంగా తెలుస్తోంది . మన ప్రజలపై, వారి జీవన విధానంపై ప్రభావం చూపే విధంగా దేశంలో గాని, రాష్ట్రంలో గాని జరుగుతున్న సంఘటనలు చాలా తక్కువ ప్రాధాన్యతతో పత్రికల లోపలి పేజీలకు పరిమితం చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

తెలంగాణ ప్రజలు మొదటి నుండీ చైతన్యం కలిగినవారే… అన్ని అరాచకశక్తులనూ ఎదిరించిపోరాడినవారే… కానీ ఇపుడు తెలంగాణలో పత్రికలు- వాటిని నడిపిస్తున్న వ్యక్తులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పాలకులు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపుతూ ఉంటే  ఆ వార్తలను పతాకశీర్షికల్లో వేసి, అక్షరాలా సెభాసో అంటు ప్రభుత్వాన్ని ఎందుకు కీర్తిస్తున్నట్టు….? బంగారు తెలంగాణ వర్థిల్లుతున్నట్టు ఎందుకు కలవరిస్తున్నట్టు? తెలంగాణ సర్కారుబడుల్లో సమస్యలు లేవా? అందరికీ తరగతి గదులున్నాయా? మంచినీరు అందుబాటులో ఉందా? మూత్రశాలలు ఉన్నాయా? వాటిని సక్రమంగా నిర్వహిస్తున్నారా….? పాఠశాలలో ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో ఉన్నారా? వారు క్రమం తప్పకుండా వచ్చి పాఠాలు చెబుతున్నారా…? ప్రభుత్వ బడులలో ఉత్తీర్ణతా శాతం ఎంత? ఏటికేడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది తెలియచెప్పవలసింది పత్రికలు కాదా, మరి వారే వారేవా అంటే ఎట్లా?

పత్రికలు ఒకరిని పనిగట్టుకుని వ్యతిరేకించడం, మరొకరిని పంతంపై భుజాలమీద పెట్టుకుని మోయడం అనే రెండు విథానాలూ ప్రజాస్వామ్యానికి మేలుచేయవు. విషయ ప్రధానంగా (ఇష్యూ బేస్డ్) వార్తలున్నపుడు మాత్రమే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. మంచి చెడులను వారు నిర్ణయించుకుంటారు. లేదా ప్రమాదకర పరిశ్రమల ఏర్పాటు, పథకాల అమలు వంటి సాంకేతిక అంశాలపై సంబంధిత నిపుణులతో  వార్తా కథనాలు, ప్రత్యేక వ్యాసాలు రాయించ వచ్చు. అవి కూడా ఏక పక్షంగా కాకుండా, పారదర్శకంగా, నిర్మాణాత్మకంగా ఉన్నపుడే ప్రయోజనం సిద్దిస్తుంది. కానీ నడుస్తున వైనాన్ని గమనించినపుడు పత్రికలు తమ తమ పెట్టుబడి “దారు”ల లో పయణిస్తున్నట్టుగా ప్రస్పుటంగా కనిపిస్తోంది.

యాజమాన్యం వైఖరికి విరుద్దంగా ఎడిటర్లు వ్యవహరించడాన్ని ఈ కాలంలో ఊహించడం మౌళికంగా తప్పేమో అనిపించే పరిస్థితి కూడా ఉంది.  జీవితం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోణంలో సాగుతున్నపుడు పెట్టుబటిదారునికి వ్యతిరేకంగా నిలబటి మనుగడ సాధించే మహోన్నత వ్యక్తులు కూడా ఉండాలి కదా… పొట్టకూటికే గడవని నాడు సత్యవ్రతం ఎవరు పాటిస్తారు చెప్పండి అని చాలా మంది ఈ నాటి పాత్రికేయవిలువలపై వ్యాఖ్యానించడం వాస్తవానికి దగ్గరగా ఉందనిపిస్తోంది.

పెద్ద పత్రికలు, బాగా విస్తరించి, ఏళ్లతరబడి పాఠకుల నమ్మకాన్ని స్వంతం చేసుకున్న పత్రికలో ఏ ఎండకాగొడుగు పడుతూ ఉంటే… చిన్నపత్రికల విషయం ఎలా చెబుతాం. పెద్దలన్నట్టు ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టున మేస్తుందా!?

మామాట:  పత్రికలు బాటవిడిచి పయనిస్తున్నాయా..

Leave a Reply