ఒక్కొక్కరిదీ ఒక్కో దారి

Share Icons:

 

తిరుపతి, జూలై 25, నడుస్తున్న వైనాలు శీర్షిక ఎంపిక ఎంతగా ఈ వ్యాసావళికి నప్పుతోందో బుధవారం తెలుగు దినపత్రికలను చూస్తే తెలిసిపోతోంది. మంగళవారం ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చింది. అయితే బంద్ గురించీ మాకు మాట మాత్రం చెప్పకుండా, తేదీలను ప్రకటించేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారా అంటూ ఈ బంద్ కు ఇతర ప్రతిపక్షాలు ఏవీ మద్దతు ఇవ్వలేదు. ఇక పాలక తెలుగుదేశం.. బంద్ విఫలం కావడానికి చేయాల్సిందంతా చేసింది. ప్రభుత్వం లో ఉన్నందున ప్రభత్వ శాఖలన్నీ యధావిధిగా పనిచేసినట్టు చూపించడానికి నాయకులు అన్ని చర్యలూ తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం నాలుగు తెలుగు ప్రముఖ దినపత్రికలను పరిశీలించినపుడు కొత్తగా ఏమీ కనిపించలేదు. అదే ఇజం. నిజాలకు పాతర వేసే దృక్పథం కనిపించింది.  ఈనాడు పత్రిక వైకాపా బంద్ ప్రశాంతం అని చిన్న బాక్స్ మాత్రం మొదటి పేజీలలో పెట్టింది. తక్కిన వార్తంతా ఎక్కడో ఐదో పేజీలోకి తరలించింది. సాక్షి పత్రిక  కుట్రభగ్నం, బంద్ విజయం – ఉక్రోషం, ఉక్కుపాదం అంటూ ఉప శీర్షికలతో మొదటిపేజీలో బ్యానర్ వార్త రాసారు. ఆంధ్రజ్యోతిలో  వైసీపీ బంద్ పాక్షికం అనే హెడ్డింగ్ మాత్రమే మొదటి పుటలో ఉంచి తక్కిన వార్తను క్షేమంగా 14 పేజీకి తరలించారు. ఇక నమస్తే తెలంగాణ పత్రిక ఏపీ బంద్ గురించి అసలు పట్టించుకోలేదు. వారు  పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లే... అనే కేసీఆర్ వార్తను ప్రముఖంగా ఇచ్చారు. అలాగే తెలంగాణ నష్టాలను పట్టించుకోవడం లేదు అని తెరాసా ఎంపీ కేకే రాజ్యసభలో చేసిన ప్రసంగాన్ని ఇచ్చారు. విషాదం ఏమిటంటే… కరెంటు లేక హైదరాబాదులోని ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఒక్క రోజే 21 మంది మరణిస్తే ఆ వార్తను నమస్తే తెలంగాణ పత్రిక పట్టించుకోలేదు. ఇదే ప్రజాస్వమ్యమా… కర్ర ఉన్న వాడిదే బర్రె అనే నీతికి ఇది అద్దం పడుతోంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నడిపే పత్రికలో పాలనలో లోపాలు కలిపించవు… ఇతర పత్రికలకు ప్రకటనలు రావు, ఆ దాయం ఉండదు కనుక అవి ప్రతిపక్షం పాత్రను పోషించవు. ఇక ప్రజాసమస్యలకు దిక్కేది.

Fairness in journalism means exploring all sides of an issue and reporting the findings accurately. Members of the public should never be used to exaggerate the importance of a story… అన్నది మౌళిక సూత్రం దీనిని ఏ పత్రికా పాటించడం లేదు. 

అదే విధంగా ప్రతిపక్ష నేత ఉన్నట్టుండి మంగళవారం జనసేన నేతను చౌకబారుగా విమర్శంచారు. ఈ అంశానికి సాక్షి, ఈనాడులలో చోటే లేదు. జ్యోతి పత్రిక ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

హోదాపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ- దానికి సంబంధించిన వార్తలు పరిశీలించినపుడు కూడా మైలేజీ సూత్రమే కనిపిస్తుంది. ఈ విషయంలో ఈనాడు పత్రిక పాత పాటే అని, సాక్షి ప్యాకేజీయే లాభమన్న బాబు అని ఆంధ్రజ్యోతి హోదా ఇవ్వం అంటూ వారి వారికి అనుకూలంగా శీర్షికలు నిర్వహించారు. ఇదండి తెలుగు పత్రికల్లో వెలుగొందుతున్న సచ్చీలత. ప్రజల బాగోగులు ఏ పత్రికా పట్టించుకోవడం లేదు. స్వంత పార్టీ భావజాలాన్ని బలంగా వ్యాప్తిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా… వార్తను వార్తగా ఇచ్చే సహృదయం కోల్పోయిన పత్రికలు ప్రజలకు ఏ రీతిగా  మేలుచేస్తాయన్నది అందోళన కలిగించే అంశం.

 

మామాట : నలుగురితో నారాయణ కాదు… నలుగురుదీ నాలుగు దార్లు… అదీ సంగతి.

Leave a Reply