పత్రికలూ-నమ్మకమూ

Share Icons:

తిరుపతి, ఆగష్టు 07,

పత్రికలు, మీడియా ఇవి ఒట్టి వ్యాపార సంస్థలు కావు. వాటిని కేవలం పెట్టుబడికోసం నడపకూడదు. సినిమా ఎలా కళ, వ్యాపారం కలిసిన కళావ్యాపారమో పాత్రికేయం కూడా కళాత్మక ప్రక్రియ. ఇక్కడ కేవలం రిట్రర్న్స్ మాత్రమే చూడడం వినాశానికి దారితీస్తుంది. సృజన, జనహితం ఇవి రెండు కళ్లు గా మీడియా వ్యవహరించాలి కానీ ఎప్పుడైతే పెట్టుబడిదారులు మీడియా సంస్థలను నియంత్రించడం, నెలకొల్పడం ప్రారంభించారో అప్పుడే పాత్రికేయ విలువలు మట్టిగొట్టుకుపోవడం మొదలైంది.  ఇందుకు వారు వీరు అనే పేర్లు అక్కరలేదు. అన్నీ ఆ తానులో ముక్కలే.  అందుకే ఇపుడు వార్తలకంటే వ్యూసే రాజ్యమేలుతున్నాయి. అందువలన పత్రిక-టీవీ లలో  నమ్మదగిన గుణం కొరవడుతోంది.

 

మంగళవారం(07.08.18) నాలుగు తెలుగు దినపత్రికలు చూద్దాం. ఈనాడు లో చైనా కంటే ఏపీలో భేష్ అనేది పతాక వార్త. ఏ విధంగా ఏపీ భేషో పత్రిక తెలపదు. ప్రజలు ఇబ్బందులు పడని పాలనా వ్యవస్థ ఒక్కటైనా ఉందా. ప్రభుత్వ బడులు సక్రమంగా పనిచేస్తున్నాయా, రవాణా సంస్థలో అవినీతి నిండిపోయింది. రెవిన్యూ విభాగాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు, గనుల శాఖ, పోనీ పసి పిల్లలకు ఆహారం అందించే విభాగమన్నా సక్రమంగా పనిచేస్తోందా.. ఆసుపత్రుల గురించి చెప్పేదేముంది. . అక్కడ పుట్టిన బిడ్డలు మాయమౌతున్నారు, లేదా ఎలుకలు కొరికి చనిపోతున్నారు. మధ్యం ఒక్కటే రాష్ట్రంలో విరవిగా లభిస్తోంది. ఇక గుళ్లలో దేవుని వస్త్రాలు సైతం నాయకులే అపహరిస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి ఏ చెబుదాం. ఇన్ని అవకతవకలతో పాలన సాగిస్తూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన చోట పత్రికలు భేష్ అని కితాబివ్వడం ఆత్మవంచనకు పరాకాష్ట.

 

దాని దిగువన ఇదేమి అన్యాయం అంటూ బీజేపీ పై తెలుగు దేశం నాయకుల వ్యాఖ్యలు ప్రచురించారు.  ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ అనే వార్తను దిగువన ఇచ్చారు.  సాక్షిలో కరుణానిధికి సీరియస్, రైతు ఉసురు తీసిన అప్పు అనే వార్తలు పైన ఉండగా దాని దిగువన మధ్యాహ్నభోజనం కార్మికులను ఈడ్చి పారేశారు అనేది ప్రముఖంగా ప్రచురించారు. ఇతర పత్రికలు ఈ అంశానికి ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వలేదు.  దానికి దిగువన ఎవరూ సంతోషంగా లేరన్నా అంటూ జగన్ పాదయాత్ర వార్త ప్రచురించారు. అంధ్రజ్యోతిలో ప్రధానంగా మొబాల్స్ మేడిన్ ఆంధ్రా అనే వార్త రాగా దాని పక్కన  రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి నగారా అనీ, పీఏసీలో సీఎం రమేశ్ అనే రెండు వార్తలున్నాయి. అలాగే మాపై ఇంత వివక్షా అంటూ ఢిల్లోలో ఎంపీల ధర్నా వార్త వేశారు. నమస్తే తెలంగాణలో హైకోర్టు విభజనపై కదలిక, ఇంటింటికీ జలధార, నెత్తురోడిన ఛత్తీస్ గఢ్ వార్తలను ఇచ్చారు. ప్రతిపక్షాల ఊసే ఎక్కడా లేదు. అన్నీ మైలేజీ వార్తలే. పైగా ఊసరవెళ్లి కాంగ్రెస్ అంటూ వైరి పక్షంపై దాడిచేసిన వార్తలను ప్రముఖంగా ప్రచురించుకున్నారు. పాలకులకు మద్దతు ఇస్తున్న పత్రిక  ఇంతకంటే ఏం రాస్తుందిలే అనుకుంటే. ఇక ఆ పత్రిక రాస్తున్నది వార్తలా… అభిప్రాయాలా. దీనిని ప్రజలు ఎలా తీసుకుంటారు.  ప్రభుత్వమే పత్రిక నడుపుకోవచ్చుకదా అనే సందేహం రాకమానదు ఈటువంటి తీరు చూసినపుడు.

 

వార్తలు ఇవ్వడం పత్రికల హక్కు కానీ ఆ వార్తలు- వాటి వెనుక వాస్తవాలను కూడా పత్రిక ప్రతిభింబించాలి కదా. క్వారీలో పేలుడు సంభవిస్తే అందులో అక్రమాల గురించి ఒక పత్రిక ప్రస్తావించదు. అలాగే ప్రపంచంలోనే తొలి థర్మల్ బ్యాటరీ పరిశ్రమ రాష్ట్రంలో వస్తుంటే మరో పత్రిక కనీస వార్త కూడా రాయదు. అంతా గాంధారిలాగా ఇష్టంలేని విషయాలను పూర్తిగా చూడను అన్న రీతిలో మీడియా… ( అది పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు) వ్యవహరిస్తున్నప్పుడు ఇక దేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ?

 

మామాట :  మీడియా నమ్మకం పోగొట్టుకొంటోందా..

Leave a Reply