ముస్లింలకు 150 దేశాలున్నాయి…హిందువులకు భారతదేశం ఒక్కటే…

Muslims have 150 countries to go to, Hindus have only India
Share Icons:

అహ్మదాబాద్: గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, విపక్ష పార్టీలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పౌరసత్వ బిల్లుకు అనుకూలంగా హిందువులు కొందరు ర్యాలీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలపై గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు వెళ్లేందుకు వారికి 150 దేశాలున్నాయని…కాని హిందువులకు మాత్రం భారతదేశం ఒక్కటేనని అన్నారు.

అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి ఆశ్రమం బయట పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతుగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. .2014 డిసెంబరు 31 వతేదీ వరకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చే కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ను నిందించారు.1947లో దేశ విభజన జరిగినపుడు పాకిస్థాన్ దేశంలో 22 శాతం మంది హిందువులున్నారని, ఇప్పుడు ఆ దేశంలో నిరంతర హింస కారణంగా హిందువుల జనాభా 3 శాతానికి తగ్గిందని, అందుకే వారు భారతదేశానికి రావాలని కోరుకుంటున్నారని సీఎం చెప్పారు.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలని ఉద్దేశించి హర్యానా మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు ఇద్దరూ లైవ్ పెట్రోల్ బాంబులు అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్న పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల పక్షాన నిలబడి బిజెపి సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఇక ఇదే సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇద్దరూ ‘లైవ్ పెట్రోలు బాంబులు’అంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వారెక్కడికి వెళ్లినా మంటలు పెట్టి ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తుంటారంటూ వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హర్యానా మంత్రి అనిల్ విజ్.పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో మరణించిన ఇద్దరు బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్లిన ప్రియాంక, రాహుల్‌లను అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. తమను మీరట్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఇందుకు సంబంధించి రాతపూర్వకంగా తమకు ఎటువంటి ఉత్తర్వులు పోలీసులు చూపించలేదని రాహుల్ మండిపడ్డారు.

 

Leave a Reply