తల్లి ప్రేమ

Share Icons:

 తల్లి ప్రేమ

సృష్ఠిలో కరగనిది తరగనిది, మరెందులోనూ కనిపించనిది, భూమి కన్నా విశాలమయినది, చందమామ కన్నా చల్లనయినది, సూర్యుని కన్నా ప్రకాశవంతమయినది, ఆప్యాయత అనురాగాల గొప్ప నిధి, అదే తల్లి ప్రేమ. అమ్మ ప్రేమ డబ్బుతో కొనలేనిది. అమ్మ బంధం ఎప్పటికీ తెంచుకోలేనిది. అమ్మ పంచే ఆప్యాయత ఆకాశంతో పోల్చలేనిది. అమ్మ పంచే మమకారం ఏ విపణిలోను దొరకనిది.  ఈ లోకంలో తల్లి ప్రేమ అనేది చాలా విలువైనది. తల్లి ప్రేమలో కల్మషం అంటూ ఏమి ఉండదు. తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఒకేరకంగా చూసుకుంటుంది. బిడ్డలు ఎంత పెద్దవారైనా ఆ తల్లికి ఇంకా చిన్న పిల్లల వలె కనిపిస్తారు.

పక్షి తన రెక్కలతో పిల్లలను కాపాడుతుంది. గూడు తయారు చేసుకుంటుంది. రెక్కలు రాని చిట్టి తల్లి కోసం ఆ తల్లి పడరాని పాట్లు పడుతుంది. తల్లి ప్రేమను చవిచూసిన వారికి తెలుసు తల్లి విలువ. మన నోట్లో అమృత బిందువులు చిలికింది అమ్మే కదా. మనం ఏవేళ వచ్చినా అన్నంపెట్టే తల్లి ఆమె. మనం తల్లికి ఏమిచ్చినా రుణం తీరదు. ”గూడులేని పిల్లలకు తెలియాలి గూటి విలువ” ”రక్షించే చేతులు లేని అనాధలకు తెలుసు చేతుల వెచ్చదనం” అన్న మాటలు అక్షర సత్యాలు. పక్షులు గూటి నుండి ఎగిరిపోయినట్లు పిల్లలు చదువుకొని జీవనయానంలో స్థిరపడి, వారి కుటుంబాలు వారికి ఏర్పడతాయి.

మగపిల్లవాడు వివాహానికి ముందు తల్లిపై ఆధారపడతాడు. తన దగ్గర ఉన్నవి అమ్మకు ఇవ్వాలని, తల్లిదండ్రుల కోసం ఏవో చేయాలని తపన పడతాడు. వివాహానంతరం ఆ దృక్పధంలో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ విధంగా కొడుకు తల్లికి దూరం కావటం జరుగుతుంది. ఎల్లప్పుడూ బిడ్డల గురించే ఆరాటపడే గొప్ప హృదయం ఆమెది. మన గురించి తపనపడే ఆరాటపడే ఆమె హృదయం ముందు మనమిద్దామనుకున్న బహుమ తులన్నీ దేనికీ సాటికాదు. చాలా తక్కువగా ఉంటాయి. తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డల గురించి తపనపడుతుంది. ఎప్పుడూ బిడ్డల బాగుగురించి ఆలోచిస్తుంది. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకంటే విలువైనది మరొకటి లేదు.

చిన్నప్పటినుంచి మనం కాళ్ళమీద నిలబడేంతవరకు తల్లి మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. తల్లికి మనమీద బాధ్యత ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత మనకు తల్లిపై ఉంటుంది. వృద్ధాప్యంలో తల్లిని చూడవలసిన బాధ్యత ప్రతి బిడ్డకు ఉంటుంది. తల్లి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది కాని బిడ్డలు తన బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నారు. తల్లి విలువను గుర్తించలేకపోతున్నారు. తల్లి మీద తనకున్న బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోతున్నారు. తల్లి యొక్క బాధ్యతను సరిగా నిర్వర్తించినట్లయితే ఆ తల్లి చాలా ఆనందంగా ఉంటుంది.

తల్లి పుట్టిన తరువాతే తెలిసింది లోకానికి ప్రేమ పుట్టిందని. ఒక శ్వాస ఆడటానికి తన శ్వాస నిర్బంధించి  కడుపులో  పడ్డప్పటినుంచి కడుపు చీల్చుకు వచ్చేవరకు బాధలన్నీ సంతోషంగా భరించేది తల్లిప్రేమ. ప్రేమనంతా పాలధారగామార్చి ఉసిముసి నవ్వుల ముద్దుమాటల – మురిపాల చేష్టలే లోకంగా బతికి తనమనుగడనే మరచి బిడ్డ ఎదుగుదలనే ఆకాక్షించి ఏ కష్టానికైనా చలించక  శ్రమిచి బంగరుబాట పరచే దేవత ఆమె. తల్లి ప్రేమను మించి ఈ లోకంలో మరొకటి లేదు. పుట్టినప్పట్నుంచి మరణించే వరకు మనల్ని కంటికి రెప్పలా చూసుకొనే గొప్ప ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే.

అమ్మను బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదు, ఎన్నెన్నో జన్మలు వెంటాడుతుంది…. కని పెంచిన దైవం అమ్మ.  ఎన్ని జన్మలు ఎత్తినా తల్లి ఋణం తీరదుది. తల్లిని ఎవరూ బాధ పెట్టకూడదు. అమ్మ లేకుంటే ఈ సృష్టి లేదు. అమ్మ అనే పదం అన్నిటికన్నా తీయనైనది. లోకంలో అందరి ప్రేమ ఒక ఎత్తు తల్లి ప్రేమ ఒక ఎత్తు. ఆ తల్లి ప్రేమకు నోచుకోవడం మన అదృష్టం. నవ మాసాలు తన కడుపులో పెట్టుకొని పెంచిన తల్లికి ఎంత మొక్కినా తక్కువే..   అందరు ముందుగా తల్లిని ప్రేమించండి ఆదరించండి, తుదిశ్వాస వరకు గొప్పగా చూసుకోండి. కించపరచకండి, అవమానించకండి. ఈసడించుకోకంది. తల్లిని మిoచిన దైవము ధారుణి వేరే లేనే లేదుగా!!

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply