డబ్బే డబ్బురా.. డబ్బు

Share Icons:

తిరుపతి, మార్చి 22,

ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ఓట్లు. 51-49 లెక్కలు.. మెజారిటీ వర్గానికి పరిపాలనా పగ్గాలు. ఈ అధికారం పొందే మార్గం ఓట్ల పండుగ.. ఎన్నికలు… గతంలో ఎన్నికల్లో ఇంతలా డబ్బు ప్రవహిచేది కాదు. కాలం మారుతోంది కదా.. రాజకీయం కూడా మారుతోంది.

ఇక ఇపుడు ఏపీ లో మరో మూడు వారాల వరకూ పండగే.. కూలి పనులకు వెళ్లాల్సిన పనిలేదు. వద్దంటే డబ్బు.. బిర్యానీ,, ఇంకా మందు కూడా..  ఏప్రిల్‌ 11వతేదీ వరకు ప్రచారంలో పాల్గొన్న ప్రతిసారీ కార్యకర్తలు, కూలీల జేబు నిండా సొమ్ములు చేరుతుంటాయి. పైగా కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎన్ని కోట్ల రూపాయిలైనా పర్వాలేదు ప్రచారంలో వందలాదిమంది కనిపించాలని ద్వితీయశ్రేణి నాయకులపై ఒత్తిడి తేవడంతో వీరికి మరింత డిమాండు.

దాదాపు నెలరోజులపాటు వివిధ పార్టీల జెండాలతో ప్రచారం చేసిన వీరు చివరికి ఓటెవరికేస్తారో తెలియదనే ప్రచారం జరుగుతోంది. పైగా బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటు అభ్యర్థించాలని మాత్రమే వీరికి ప్రత్యేకంగా సూచనలిస్తారుగానీ, తమ ఓటు వేయాలని అడిగే పరిస్థితి కనిపించడం లేదు.

సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీల జెండాల మోసేవారికి డిమాండు పెరిగింది. జెండా పట్టుకుని ప్రచారంలోకి దిగితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రూ.400, సాయంత్రం వరకైతే రూ.500 తీసుకుంటున్నారు. కుటుంబంలో నలుగురుంటే రోజుకి రూ.2వేలు ఆదాయం లభిస్తోంది. దీనికి అదనంగా క్వార్టర్‌ మందు, బిర్యాని కూడా సరఫరా చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు, కూలీలు, గృహిణులు, యువతా పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఉదయం 9 గంటలైతే బరిలో నిలిచే అభ్యర్థుల గృహాల వద్ద ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. ప్రధానపార్టీలు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు తమ ప్రచారం కోసం పెద్దఎత్తున కార్యకర్తలు, కూలీలను ఆహ్వానిస్తున్నారు. గ్రామాలలో కూలీలు రబీ, ఉపాధి హామీ పనులకు దూరంగా ఉంటున్నారు. అర్బన్‌లో గృహనిర్మాణ కూలీలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొని సొమ్ములు తీసుకుంటున్నారు. పైగా మధ్యాహ్నం పసందైన పలావ్‌, సాయంత్రానికి కిక్కిచ్చే బీర్‌, విస్కీలతో అభ్యర్థులు కూలీలను తమ వెంట తిప్పుకుంటున్నారు. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల పండుగతో మందుబాబులకు మంచి విందులే దొరుకుతున్నాయి. రాత్రి అయ్యే సరికి అభ్యర్థుల క్యాంపుల వద్ద మందుబాబులు చిట్‌చాట్‌ చేసుకుంటూ ఎంచాక్క పెగ్గు మీద పెగ్గు వేస్తూ చికెన్‌ ముక్కతో భలే మజా చేసుకుంటున్నారు.

కొంతమంది కూలీలు, గృహిణులు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఒక జెండాతో ప్రచారంలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరొక జెండాతో ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రచారంలో పాల్గొనే వారికి కొంతమంది అభ్యర్థులు రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నారు. దీంతో ఆయా అభ్యర్థుల డిమాండును అనుసరించి వ్యూహాత్మకంగా జెండాలు మార్చుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. కూలీల ఎజెండా కేవలం డబ్బు సముపార్జించడమేనని అంటున్నారు.

మామాట: ఆదాయం వస్తే చాలు జండా ఏదైతేనేమి… సామీ

Leave a Reply