హైదరాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనంగా మారిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి….పార్టీ మారుతారో లేదో తెలియదు గాని….ఆయన రోజుకోక మాట మాట్లాడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… భువనగిరి ఎంపీ, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని వ్యాఖ్యానించారు.
తన లాంటి వ్యక్తి బీజేపీలో చేరితేనే తెలంగాణలో ఆ పార్టీ బలపడుతుందని అన్నారు. ఒకవేళ, తాను బీజేపీలో చేరినా, ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మునిగిపోయే ఓడగా అభివర్ణించిన రాజగోపాల్ రెడ్డి, టైటానిక్ షిప్ లో తన లాంటి హీరో ఉన్నా అది మునిగిపోవాల్సిందేనంటూ పరోక్షంగా ‘కాంగ్రెస్’పై వ్యాఖ్యలు చేశారు.
ఇక తన తమ్ముడు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడనని, తాను చనిపోయే వరకూ ఈ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తనకు మరో జన్మ అంటూ ఉంటే కాంగ్రెస్ లోనే ఉంటానంటూ భావోద్వేగంతో చెప్పారు.