గల్లంతైన AN-32 విమానం – ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ గాలింపు

Share Icons:

కొత్తఢిల్లీ, జూన్ 04,

అరుణాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన AN-32 విమానం కోసం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. 18 గంటలు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో యుద్ధ విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. సుఖోయ్-30, C-130J స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, AN-32 ఎయిర్‌క్రాఫ్ట్, రెండు MI-17, మరో రెండు ఇండియన్ ఆర్మీ ALH హెలికాప్టర్లు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

విమానం కూలిపోయిందని వార్తలు రావడంతో గాలింపు బృందాలు అక్కడికి వెళ్లాయి. ఐతే అక్కడ శకలాలేమీ కనిపించలేదని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. AN-32 విమానం సోమవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైంది. ఆ విమానంలో ఏడుగురు అధికారులు, మరో ఆరుగురు ఎయిర్ వారియర్స్ ఉన్నారు.

మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్‌ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాని ఆచూకీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మారుమూలన ఉన్న మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు ఆ విమానం చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ విమానం నుంచి చివరిసారిగా కమ్యూనికేషన్‌ వచ్చింది. ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి.

సాధారణంగా మెచుకాకు చేరుకోవడానికి 50 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ గంటలు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి విమానం కోసం గాలిస్తున్నారు. సోవియట్ యూనియన్ రూపొందించిన ఈ విమానాలను 1980లో భారత వైమానికదళంలో చేర్చారు. నాలుగు దశాబ్దాలుగా రవాణా అవసరాల కోసం వినియోగిస్తున్నారు.

AN-32 శ్రేణి విమానాల్లో రెండు టర్బోప్రాప్‌ ఇంజిన్లు ఉన్నాయి. పలుమార్లు ఈ విమానాలను ఆధునికీకరించారు. ఐతే అరుణాచల్‌లో అదృశ్యమైన ఆ విమానాన్ని ఆధునీకరించనట్లుగా తెలుస్తోంది. గతంలోనూ AN-32 విమానాలు కూలిపోయాయి. 2016లో చెన్నై నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవులకు బయలుదేరిన ఏఎన్‌-32 విమానం బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా అదృశ్యమైంది.

ఆ విమానం కోసం సుదీర్ఘ కాలం పాటు గాలింపు జరిగింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. కనీసం శకలాలు కూడా దొరకలేదు. దాంతో ఆ విమానంలో ఉన్న 29 మంది మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. 2009 జూన్‌లో మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో మరొ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో 13 మంది మరణించారు.

మామాట- సైనిక విమానాలకూ రక్షణ లేదా.. దేవుడా

One Comment on “గల్లంతైన AN-32 విమానం – ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ గాలింపు”

Leave a Reply