టిడిపి కేంద్ర మంత్రుల రాజీనామా

Share Icons:

టిడిపి కేంద్ర మంత్రుల రాజీనామా

ఢిల్లీ, మార్చి 8ః

కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి తమ రాజీనామా పత్రాలను ప్ర‌ధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. టిడిపి అధిష్ఠానం సూచనలు మేరకు ఇద్దరూ మంత్రి పదవుల నుంచి వైదొలిగారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడంలో కేంద్రం విఫలమైన కారణంగానే మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వీరిద్దరూ ప్రధానికి వివరించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజు, శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రిగా సుజనా చౌదరి బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ప్రధానితో సుమారు 10 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెనువెంటనే సీఎం చంద్రబాబు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌, మంత్రులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన తర్వాత బుధవారం అర్ధరాత్రి కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఉదయమే తమ రాజీనామా పత్రాలను తీసుకొని పార్లమెంట్‌ వద్దకు చేరుకున్న అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం వేచిచూశారు. అయితే ప్రధాని రాజస్థాన్‌ పర్యటకు వెళ్లడంతో సాధ్యపడలేదు. ఈ సాయంత్రం 4.30గంటల సమయంలో దిల్లీకి చేరుకున్న ప్రధాని నేరుగా సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేసి సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోదీని కలిసిన మంత్రులిద్దరూ తమ పదవుల నుంచి వైదొలుగుతూ రాజీనామా పత్రాలను మోదీకి సమర్పించారు.

మామాటః ఒక అంకం ముగిసింది!

Leave a Reply