చంద్రబాబు సబ్జెక్ట్ ఇక క్లోజ్…కుటుంబరావు ఎక్కడ?

botsa satyanarayana comments on ap capital
Share Icons:

అమరావతి: అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా కాకుండా.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బిజినెస్‌గా మార్చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అవినీతి అక్రమాలపై తాము ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నామని.. అందుకు తమను అభివృద్ది నిరోధకులు అని ఆరోపించారని గుర్తుచేశారు. అయితే తమకు కావాల్సింది అభివృద్ది అని,అవినీతి కాదని ఎన్నోసార్లు స్పష్టం చేశామన్నారు.

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే ఇప్పటివరకు చంద్రబాబు నుంచి గానీ,లోకేష్ నుంచి గానీ ఇప్పటివరకు సౌండ్ లేదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు సబ్జెక్ట్ ఇక క్లోజ్ అని.. స్వర్గీయ ఎన్టీఆర్ పుణ్యమాని ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగాడని, కానీ ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదని సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.100కోట్లు దాటిన ప్రతీ ప్రాజెక్టుపై దర్యాప్తు జరుపుతామని చెప్పామన్నారు. ఈరోజు ఆయన పీఏ ఇంటిపై జరిగిన సోదాల్లో బయటపడ్డ అక్రమాలను చూస్తుంటే.. చంద్రబాబు అవినీతి తేటతెల్లం అవుతోందని అన్నారు. ఒకవేళ చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయకపోతే.. ఎందుకు బయటకు వచ్చి వీటన్నింటిని ఖండించట్లేదని ప్రశ్నించారు.

గతంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కుటుంబరావు అనే వ్యక్తి.. ప్రతీ దానికి మీడియా ముందుకు వచ్చేవారని,ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదని బొత్స అన్నారు. దోపిడీకి సంబంధించి ఈ లెక్కల ప్రణాళికలన్నీ వేసింది ఆయనేనని ఎద్దేవా చేశారు. పీఏ ఇంటిపై సోదాల్లో బయటపడ్డ డొల్ల కంపెనీలు టీడీపీ నేతలకే చెందినవని తేలిందన్నారు. అందులో ఒకరు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాగా,మరొకరు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అబ్బాయి,నారా లోకేష్ బినామీ రాజేష్ అని తేలిందన్నారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు ధిట్ట అని.. కానీ అవినీతి అక్రమాలు ఏదో రోజు బహిర్గతం అవుతాయని బొత్స అన్నారు. తనపై గతంలో అవినీతి ఆరోపణలు వస్తే చాలా హడావుడి చేశారని.. టీడీపీ నేతలు,చంద్రబాబు ఇప్పుడెందుకు కిక్కురుమనకుండా ఉన్నారని ప్రశ్నించారు. నిప్పు లేకుండా పొగ రాదని.. చంద్రబాబు రాష్ట్ర ఖజానాకు సంబంధించిన డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని.. అప్పట్లోనే కథనాలు వచ్చాయని అన్నారు.

 

Leave a Reply