పవన్, చంద్రబాబులకు షరా మామూలుగా మారిపోయింది…..

chandrababu tries to close old friends janasena and bjp
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లని ఉద్దేశించి ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని బీజేపీని విమర్శించిన జనసేన పార్టీ, ఇప్పుడు బీజేపీతో తిరిగి దోస్తీ కట్టడం…అటు పవన్‌కు, ఇటు చంద్రబాబుకు షరా మామూలుగా మారిపోయిందని బాలినేని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరితో ఇంతవరకు పొత్తులు పెట్టుకోలేదన్నారు. వైయస్‌ జగన్‌ పాలనలో ప్రజలు సుఖంగానే ఉన్నారని, ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు నష్టం లేదన్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళతామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. పవన్ వెనుక ఉన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపణలు చేశారు. గతంలో కమ్యూనిస్టు పార్టీ, బీఎస్పీ.. ఇప్పుడు బీజేపీతో జనసేన కలవడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

‘యాక్టర్ నిమిత్త మాత్రుడు. నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్యూనిస్టులతో కలిసినా, బీఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనే’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ..జనసేన మధ్య పొత్తు అధికారికంగా ఖరారైంది. ఇక..ఏపీలో బలం పెంచుకొనే దిశగా రెండు పార్టీలు ప్రాధమకంగా ఒక అంచనాకు వచ్చాయి. తక్షణం అమరావతి అంశం మీద ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇక, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తరువాత ఏపీలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీజేపీ నేతలు పవన్ కు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా..జనసేన అధినేతకు బీజేపీ పెద్దలు బంపరాఫర్ ప్రతిపాదించారు.

అందులో భాగంగా..పవన్ కల్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి..రాజ్యసభకు పంపాలనేది ఆరెస్సెస్ ..బీజేపీ నేతల ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మోడీ ప్రస్తుత కేబినెట్ లో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. దీంతో..ఇప్పుడు పవన్ కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి..ఆయన ద్వారా కేంద్ర పధకాలు..కేంద్రం నుండి ఏపికి అందించిన..అందుతున్న సాయం పైన ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది

అయితే, పవన్ మాత్రం ఆచి తూచి స్పందిస్తున్నారు. గతంలో జరిగిన రాజకీయాల కారణంగా పవన్ ఆ ఆఫర్ పైన ఆలోచన చేస్తున్నారు. దీని పైన పూర్తి స్థాయిలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

Leave a Reply