అదే జగన్‌, చంద్రబాబుకు ఉన్న తేడా: టీడీపీపై మంత్రి అవంతి సెటైర్లు

Share Icons:

అమరావతి, 18 జూన్:

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదాపై చంద్రబాబు అనేక సార్లు యూటర్న్‌ తీసుకున్నారని, జగన్‌ ఎప్పుడూ నమ్మిన సిద్ధాంతం వీడలేదని అవంతి పేర్కొన్నారు.

ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించబోనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. అదే జగన్ స్థానంలో చంద్రబాబు ఉంటే, ఉన్న 23 ఎమ్మెల్యేలను 13కు ఎలా చేర్చాలా అని ఆలోచనలు చేసుండేవారని ఎద్దేవా చేశారు. ఇదే చంద్రబాబు, జగన్‌కు ఉన్న తేడా అని చెప్పారు.

నవరత్నాలను కాపీ కొట్టాలని ప్రయత్నించినందునే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని, పోలవరం ప్రాజెక్టులో జరిపిన అవినీతిని తమ ప్రభుత్వం ప్రజల ముందు బయట పెట్టనుందని అన్నారు. ప్రభుత్వం నియమించే కమిటీ పోలవరంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెస్తుందని అన్నారు.

ఒంటెద్దు పోకడలే టీడీపీ ఓటమికి ప్రధాన కారణమని, ఎన్నికలకు ముందు వైసీపీ నవరత్నాలను కూడా కాపీ కొట్టారని విమర్శించారు. అమరావతి గురించా చాలా గొప్పగా చెప్పుకున్న నేతలు… ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు.

వ్యక్తిగత స్వార్థం కోసం తాను ఎన్నడూ పని చేయలేదని తెలిపారు. పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తాను పార్టీ మారానని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అన్నింటినీ నెరవేర్చుతామని అన్నారు.

 

Leave a Reply