MI vs KKR Preview: కోల్‌కతాతో ముంబై పోరు.. ఎవరు గెలిస్తే సన్‌రైజర్స్‌కు లాభం?

Share Icons:
ఐపీఎల్ 2020లో నేడు (అక్టోబర్ 16న) కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఒక వేళ కోల్‌కతా గెలిచినా పాయింట్ల పట్టికలో మార్పేమీ ఉండదు. ముంబైపై నైట్ రైడర్స్ ఘన విజయం సాధిస్తేనే.. ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో బెంగళూరును వెనక్కి నెట్టి మూడోస్థానానికి చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచి.. అక్టోబర్ 18న కోల్‌కతాపై సన్‌రైజర్స్ గెలిస్తే.. ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగవుతాయి.

అబుదాబీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫేవరేట్‌గా బరిలో దిగనుంది. ఇక్కడ నైట్ రైడర్స్ 4 మ్యాచ్‌లు ఆడగా… మూడింట్లో విజయం సాధించింది. చెన్నైపై పది పరుగుల తేడాతో.. పంజాబ్‌పై రెండు పరుగుల తేడాతో కోల్‌కతా గెలిచింది.

మరోవైపు ముంబై ఇండియన్స్ సైతం ఇక్కడ చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ మినహా మిగతా 4 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలుపొందింది. అబుదాబీ వేదికగా సెప్టెంబర్ 23న జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబై 49 రన్స్ తేడాతో గెలుపొందింది. ఈ వేదికపై ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై.. 190కిపైగా పరుగులు చేసింది. పోలార్డ్, పాండ్య బ్రదర్స్ లాంటి హిట్టర్లు.. బుమ్రా, బౌల్ట్ లాంటి బౌలర్లతో ముంబై పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై తుది జట్టులో మార్పులేవీ ఉండకపోవచ్చు.

కోల్‌కతా విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో నరైన్ ఆడటం అనుమానంగానే ఉంది. ఒక వేళ అతడి స్థానంలో టామ్ బాంటన్ ఆడితే.. ఓపెనర్‌ రాహుల్ త్రిపాఠి మరోసారి బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన ఆడాల్సి ఉంటుంది. బాంటన్ బదులు లాకీ పెర్గ్యూసన్‌ను జట్టులోకి తీసుకుంటే అదనపు బౌలర్‌ అందుబాటులోకి వస్తాడు.